ధృవ ప్రాంతాలపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలను ఎంతగానో కలవరపరుస్తున్న విషయం అంటార్కిటికా మంచు మట్టం కరిగిపోవడం. సముద్ర మంచుకు పరావర్తన గుణం చాలా ఎక్కువని, సాధారణంగా సూర్యరశ్మికి కరగదని శాస్త్రవేత్తల నిర్ధారణ. అయితే దాని వెనుక నీరు చేరితే మాత్రం కింది నుంచి కరిగిపోతుందని.. ప్రస్తుతం అంటార్కిటికాలో కొన్ని దశాబ్దాలుగా అదే జరుగుతుందని పరిశోధకులు నిర్ధారించారు. ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
- అంటార్కిటికా అంటే...!

అంటార్కిటికా అనే పదం గ్రీకు భాష అంటార్కిటికోస్ నుండి వచ్చింది. ఇది ఓసా మెనోర్ అని పిలువబడే ఉత్తర కూటమిని సూచిస్తుంది. దీనిలో ఉత్తర ధ్రువాన్ని గుర్తించే పోలార్ స్టార్ ఉంటుంది. అంటార్కిటికాలో ఏడు దేశాలు.. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, చిలీ, ఫ్రాన్స్, నార్వే, న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్‌డమ్ ఉన్నాయి.
గ్రీకు తత్వవేత్త ప్లేటో ప్రకారం, ఈ ఖండం ఆదర్శధామ ద్వీపంగా ఏర్పడి, అతని కాలానికి సుమారు 9,000 సంవత్సరాల ముందే ఉనికిలోకి వచ్చింది. కొంతకాలం మంచుతో కప్పబడి కనుమరుగై, 2,300 సంవత్సరాల క్రితం 'లాస్ట్ సిటీ ఆఫ్ అట్లాంటిస్' అనే పేరుతో ప్రస్తావించబడిందని పరిశోధకులు పేర్కొన్నారు. 1824 నుంచి ఇది ఆస్ట్రేలియాలో భాగంగా పరిగణించబడింది. మంచుతో కప్పబడి ఉండటంతో 1890ల వరకు దీనికి ప్రత్యేకంగా పేరు లేదు. గుర్తించిన అనంతరం మొట్టమొదట 1909లో బ్రిటీష్ అన్వేషకులు అయస్కాంత దక్షిణ ధ్రువాన్ని, 1911లో నార్వేజియన్ అన్వేషకులు భౌగోళిక దక్షిణ ధ్రువాన్ని గుర్తించారు.
- అంటార్కిటికా మంచు నిర్మితమా..!
అవును. అంటార్కిటికా హిమానీనదాలు, మంచు అల్మారాలు, మంచుకొండలతో నిర్మితమైంది. అంటార్కిటికాలో చెట్లు లేవు. చల్లని ప్రదేశంలో నివసించగలిగే వృక్షజాతులు నాచు, ఆల్గే ఉంటాయి. అంటార్కిటికా ద్వీపకల్పంలోని లోయ, హిమానీనదాలు, ట్రాన్సాంటార్కిటికా పర్వతాలు, ఇతర ప్రాంతాలు ప్లీస్టోసీన్ ప్రారంభ కాలం నాటివి కావచ్చనే అభిప్రాయపడుతున్నారు శాస్త్రవేత్తలు. ల్యాండ్ ఐస్ (మెటోరిక్ ఐస్ అని కూడా పిలుస్తారు) మంచులా పడుతుంది. అంటార్కిటికాపై అత్యల్ప ఉష్ణోగ్రత -89.2 రికార్డు అయ్యి ఉంది. ఇక్కడ నెమటోడ్లు, పెంగ్విన్‌లు, సీల్స్, టార్డిగ్రేడ్‌లు, ఎక్కువగా లైకెన్‌లు నాచు రూపంలో ఉంటాయి.

- మంచు పరిమాణం తరుగుతోందా!
అంటార్కిటికా ఖండం ధృవ ఎడారి. ప్రపంచంలోని మంచినీటి నిల్వలు 70% ఇక్కడే ఘనీభవించాయి. వాతావరణ మార్పుల కారణంగా ఘనీభవించిన మంచు పొరలు కరిగిపోతున్నాయని పరిశోధనల్లో వెల్లడైంది. ఇవి కరిగితే ప్రపంచ సముద్ర మట్టాలు దాదాపు 60 మీటర్లు (216 అడుగులు) పెరుగుతాయి.
ఇటాలియన్, ఫ్రెంచ్, నార్వే పరిశోధకులు నార్వేకు చెందిన స్వాల్‌బార్డ్ ద్వీప సమూహంలో శిబిరాన్ని ఏర్పాటుచేసి, పరిశోధనలకు పూనుకున్నారు. పురాతన మంచు నమూనాలను, ప్రస్తుత నమూనాలను సేకరించి, విశ్లేషణ కోసం భద్రపరచేందుకు ఆర్కిటిక్ శాస్త్రవేత్తలు డ్రిల్లింగ్ ప్రారంభించారు. ఒక సెట్ ఐస్ ట్యూబ్‌ను సేకరించి, రెండవ సెట్‌ను 'ఐస్ మెమరీ అభయారణ్యం'లో నిల్వ చేయడానికి అంటార్కిటికాకు పంపారు. ఒక్కొక్కటి ఒక మీటర్ (మూడు అడుగుల) పొడవు, 10 సెం.మీ (నాలుగు అంగుళాలు) వెడల్పు కలిగిన సిలిండర్ ఆకారంలో ఉండే మంచు దిమ్మెలు ఇవి. ఇక్కడ ఈ నమూనాలు భవిష్యత్ తరాల శాస్త్రవేత్తల కోసం భద్రపరచబడతాయి.
- భారత వాతావరణంపై అంటార్కిటికా ప్రభావం..!
భారతదేశం 7,516.6 కి.మీ తీరప్రాంతం, ముఖ్యమైన ఓడరేవు నగరాలను కలిగి ఉంది. ప్రపంచ వాతావరణ సంస్థ నివేదిక ప్రకారం, భారత తీరం వెంబడి సముద్ర మట్టం ప్రపంచ సగటు రేటు కంటే వేగంగా పెరుగుతోంది. కేవలం మూడు అడుగుల సముద్ర మట్టం పెరిగితేనే భారత దేశంలోని 14,000 చదరపు అడుగుల మేర భూభాగం కనిపించదు. అంటార్కిటిక్ వాతావరణ వైవిధ్యం భారతదేశ రుతుపవనాలపై తీవ్రంగా ఉంటుంది.
- ఏఏ దేశాలకు ముప్పు..?
డెన్మార్క్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, అనేక ద్వీపాలు, దేశాలతో పాటు ఫ్లోరిడా పూర్తిగా కనుమరుగవుతుంది. ఉరుగ్వే వంటి కొన్ని దిగువ దేశాలలో చాలావరకు భూభాగం మునిగిపోతుంది. సామాజిక-ఆర్థిక సమస్యలు తీవ్రమౌతాయి. ప్రజల వలసలు భారీగా పెరుగుతాయి.
సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్ జూలియన్నే స్ట్రోవ్ 'తేలియాడే పెద్ద పెద్ద మంచు అల్మారాలు, పైన్ ఐలాండ్, త్వైట్స్ వంటి ప్రధాన అవుట్‌లెట్ హిమానీనదాలకు ఉన్న అనుసంధానం క్రమేపీ సన్నగిల్లుతుంది. ఇప్పటికైనా మానవ కార్యకలాపాలను క్రమబద్దీకరించకపోతే ఈ శతాబ్దం ముగిసేలోపు సముద్ర మట్టం అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంది' అని వ్యక్తీకరించారు. భూమిపై ఉన్న మంచు మొత్తం కరిగిపోతే మన మహాసముద్రాలు 216 అడుగులు పెరుగుతాయి.
- 2050 నాటికి..!
అసెస్‌మెంట్ రిపోర్ట్-6 (2021) ప్రకారం.. 2050కి ముందు, అంటార్కిటికాలో సంవత్సరానికి సగటున 150 బిలియన్ టన్నుల మంచు కరిగిపోతుంది. గ్రీన్‌లాండ్‌లో సంవత్సరానికి 270 బిలియన్ టన్నుల మంచు కరిగి సముద్ర మట్టం పెరుగుతుంది. పశ్చిమ అంటార్కిటికాలో అముండ్సెన్, బెలింగ్‌హసన్ సముద్రాలలో మంచు ఊహాతీత వేగంతో కరిగిపోవడం శాస్త్రవేత్తలను మరింత కలవరానికి గురిచేస్తుంది. 'గత ఫిబ్రవరిలో అంటార్కిటికా తీరరేఖలో మూడింట రెండు వంతులు మంచు పూర్తిగా కరిగిపోయి, సముద్రనీరు కనిపించింది' అని ఆస్ట్రేలియాలోని టాస్మేనియా యూనివర్శిటీకి చెందిన డా. విల్‌హబ్స్ ఆవేదన చెందుతున్నారు.










