Oct 06,2023 22:30

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :రెండేళ్లలో దేశం నుంచి లెఫ్ట్‌ వింగ్‌ తీవ్రవాదం (ఎల్‌డబ్ల్యూఇ) పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలిపారు. నక్సలిజం మానవాళికి శాపమని, దానిని అన్ని రకాలుగా నిర్మూలించాలని నిర్ణయించామని చెప్పారు. ఎల్‌డబ్ల్యుఇ ప్రభావిత రాష్ట్రాలలో భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు శుక్రవారం విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన సమీక్షా సమావేశానికి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, జార్ఖండ్‌ ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, హేమంత్‌ సోరెన్‌ హాజరయ్యారు. ఒడిశా, బీహార్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల మంత్రులు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ కూడా హాజరయ్యారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దావలే, కేంద్ర హోం కార్యదర్శి, సిఎపిఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు, రాష్ట్రాల డిజిపిలు, ఇతర అధికారులు పాల్గన్నారు. ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడుతూ, గత నాలుగు దశాబ్దాల్లో నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో 2022లోనే అతి తక్కువ హింస, మరణాలు సంభవించాయని అన్నారు. నక్సల్స్‌ ప్రభావిత రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు 2010తో పోలిస్తే 2022లో 77 శాతం తగ్గాయని తెలిపారు. గత ఐదేళ్లలో దేశంలో ఎల్‌డబ్ల్యూఈ భద్రతా పరిస్థితిలో గణనీయమైన మెరుగుదల ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 2015లో 'నేషనల్‌ పాలసీ అండ్‌ యాక్షన్‌ ప్లాన్‌'ను ఆమోదించిందని అన్నారు. భద్రతా సంబంధిత చర్యలు, అభివృద్ధి చర్యలు, స్థానిక వర్గాల హక్కులు మొదలైన వాటితో కూడిన బహుముఖ వ్యూహాన్ని పాలసీ అంచనా వేస్తుందని పేర్కొన్నారు. ఈ విధానాన్ని దృఢంగా అమలు చేయడం వల్ల దేశవ్యాప్తంగా ఎల్‌డబ్ల్యూఇ హింస తగ్గుముఖం పట్టిందని అన్నారు.