Mar 22,2023 14:29

ప్రజాశక్తి-కలక్టరేట్‌ (కృష్ణా) : మన సంస్కృతి సంప్రదాయాలకు ఉగాది ప్రతీకని కలెక్టర్‌ రంజిత్‌ బాషా తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ భావితరాలకు అందించాలని సూచించారు. జిల్లా యంత్రాంగం దేవాదాయశాఖ సంయుక్త ఆధ్వర్యలో బుధవారం స్థానిక బచ్చుపేట వెంకటేశ్వరస్వామి వారి దేవస్థాన కళ్యాణ మండపంలో శ్రీ శోభకృత్నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా, జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ అపరాజిత సింగ్‌, నగర మేయర్‌ మోకా వెంకటేశ్వరమ్మ, ముడా ఛైర్‌ పర్సన్‌, నాగ వెంకట దుర్గాభవాని ముఖ్య అతిథులుగా హాజరై శోభకృత్నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. వేదపండితులను, అర్చక స్వాములను, కవులను ఘనంగా సత్కరించారు. వేద పండితులు ఆశీర్వచనం పలికారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు, తెలుగు సంవత్సరా ఉగాది ప్రతీకగా నిలుస్తున్నదన్నారు. మన సంస్కృతిని కాపాడుకుంటూ భావితరాలకు అందించాలన్నారు. ఉగాది పచ్చడిలో షడ్రుచులు మానవ జీవితంలో కష్ట సుఖాలతో కవులు పోలుస్తారన్నారు. అదే విధంగా తెలుగు సంవత్సరాది ఉగాదికి ప్రతి ఒక్కరు గతం మరచి కొత్త జీవితం ప్రారంభించాలని, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది జిల్లా వాసుల కల నెరవేరే విధంగా బందరు పోర్టు పమలు ఏప్రిల్‌లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తొలుత కలెక్టర్‌ ఆహుతులు జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాధి వేడుకలను ప్రారంభించారు. నాదస్వరంతో ప్రారంభమయిన ఉగాధి వేడుకలలో విష్ణుభొట్ల నాగవెంకట నారాయణశర్మ ఆవధాని, షణ్ముఖ విశ్వనాధశర్మ ఆవధాని వేద పఠణం చేశారు. విష్ణు భొట్ల సూర్యనారాయణ శర్మ ఘనాపాటి పంచాంగ శ్రవణం చేసి రాశిఫలాలు ఈ ఏడాది జరగబోయే విశేషాలు వివరించారు. దేవదాయశాఖ ఆధ్వర్యంలో వివిధ దేవాలయాల్లో నిష్టాతులైన అర్చక స్వాములను, వేద పండితులను ఘనంగా సత్కరించారు. డిఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, జిల్లా దేవదాయ అధికారి హరనాద బాబు, బందరు ఆర్‌ డివో ఐ.కిషోర్‌ ఉగాధి వేడుకలను పర్యవేక్షించారు. తొలుత కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించి పూజాలు నిర్వహించారు. దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో కలెక్టరును, జాయింట్‌ కలెక్టరును డిటిడబ్లూవో ఫణి ధూర్జటి, పాత్రికేయులు ముదిగొండ శాస్త్రీ సభకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్‌ గాజుల శ్రీదేవి, మున్సిపల్‌ కమీషనర్‌ చంద్రయ్య, జిల్లా రవాణా అధికారి సీతపతిరావు, తహసిల్దారు డి. సునీల్‌ బాబు వివిధ దేవాలయాల ఈవోలు పాల్గొన్నారు.