ఆసియా క్రీడల్లో భారత్ మరో 2 స్వర్ణాలను కైవసం చేసుకుంది. 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్, షాట్‌పుట్ విభాగాల్లో బంగారు పతకాలు వచ్చాయి. స్టీపుల్‌ఛేజ్ 3000 మీటర్ల రేసులో అవినాశ్ సాబ్లే విజయం సాధించాడు. ఇక షాట్‌పుట్‌లో భారత 'బాహుబలి' తేజిందర్‌పాల్ సింగ్ తూర్ స్వర్ణం నెగ్గాడు. అందరికంటే ఎక్కువగా 20.36 మీటర్లు విసిరి విజేతగా నిలిచాడు. అంతకుముందు హైదరాబాదీ బాక్సర్ నిఖత్ జరీన్ 50కేజీల విభాగంలో కాంస్యంతో సరిపెట్టుకుంది.మరోవైపు పురుషుల 50 మీటర్ల ట్రాప్ ఈవెంట్‌లో భారత్ కాంస్యం నెగ్గింది. అలాగే మహిళల 1500 మీ. ఫైనల్‌లో హర్మిలన్ రజతంతో మెరిసింది. పురుషుల 1500 మీ. ఫైనల్‌లో అజరు రజతం, జిన్సన్ జాన్సన్ కాంస్యంతో సత్తా చాటారు. ఇప్పటివరకూ మొత్తం 48 పతకాల (స్వర్ణం 13, రజతం 18, కాంస్యం 17)తో ఆసియా క్రీడల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది.










