- చేయిచేయి కలిపి రాష్ట్రాన్ని రక్షించుకుందాం
- 'నిజం గెలవాలి' సభలో నారా భువనేశ్వరి
- మృతుల కుటుంబాలను పరామర్శ, ఆర్థిక సాయం
ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : 'నారావారిపల్లికి నేను వచ్చి రెండు రోజులైంది. మా గ్రామంలో కుటుంబంతో సంతోషంగా గడిపిన క్షణాలు గుర్తుకొచ్చి నా గుండె పిండేసింది. ఇలా మొదటిసారి పబ్లిక్ మీటింగ్‌లో మాట్లాడుతున్నా. నిజం గెలవాలి అనే పోరాటం నా ఒక్కరిదే కాదు... మనందరిదీ. మన బిడ్డలు, భావితరాల కోసం ఈ పోరాటం. అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా? చేయిచేయి కలుపుదాం. ఈ రాష్ట్రాన్ని రక్షించుకుందాం' అంటూ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి భావోద్వేగంతో మాట్లాడారు. నిజం ఈ రోజు కాకపోయినా రేపైనా గెలిచి తీరుతుందని వక్కాణించారు. 'నిజం గెలవాలి' యాత్రను తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం అగరాల వద్ద బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఆమె ప్రారంభించారు. అంతకుముందు తన సొంతూరు నారావారిపల్లిలో తన తండ్రి ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం 11 గంటలకు ఆమె అక్కడి నుంచి బయల్దేరారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక భావోద్వేగానికి గురై గుండెపోటుతో మృతి చెందిన పాకాల మండలం నేండ్రగుంటకు చెందిన కనుమూరి చిన్నబ్బనాయుడు, చంద్రగిరి మండలం ప్రవీణ్‌రెడ్డి కుటుంబ సభ్యులను భువనేశ్వరి ఓదార్చారు. ఎన్‌టిఆర్ ట్రస్టు నుంచి రూ.3 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. అగరాల వద్ద జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఈ సభకు నియోజకవర్గ నలుమూలల నుంచి ఐదువేల మందిపైగా మహిళలు హాజరయ్యారు. నారా భువనేశ్వరి భావోద్వేగంతో మాట్లాడిన సందర్భంగా మహిళలు కంట తడిపెట్టారు. ఎలాంటి ఆధారమూ లేకుండా తన భర్తను రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్బంధించారని, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తొలుత రూ.3 వేల కోట్లు అవినీతి జరిగిందని, ఆ తరువాత రూ.350 కోట్లని, ఇప్పుడు 25 కోట్లని చెబుతున్నారు తప్ప ఎక్కడా ఆధారాలు చూపించిన దాఖలా లేదని ఆమె అన్నారు. జైల్లో బంధించింది చంద్రబాబును కాదని... రాష్ట్రాన్ని, న్యాయాన్ని బంధించారని అభివర్ణించారు. వైసిపి పాలనలో రాష్ట్రంలో హత్యలు, గంజాయి, అత్యాచారాలు, అక్రమ కేసులు, అరాచకాలే కనిపిస్తున్నాయని విమర్శించారు. అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదన్నారు. మానసికంగా చంద్రబాబును ఇబ్బంది పెడితే టిడిపి కేడర్‌ను దెబ్బతీయొచ్చని రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, ఇవ్వాళ కాకపోయినా రేపైనా ఆయన జైలు నుంచి కడిగిన ముత్యంలా మీ ముందుకు వస్తారని, అప్పటివరకూ నాతోపాటు మీరు కూడా చేయిచేయి కలిపి పోరాడాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షులు వంగలపూడి అనిత మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రి కూతురిగా, ఓ ముఖ్యమంత్రి భార్యగా ఎప్పుడూ బయటకు రాని భువనేశ్వరమ్మ ఈ రోజు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు మీ ముందుకు వచ్చారన్నారు. ప్రతి తెలుగు మహిళా, ప్రతి టిడిపి అభిమాని ఆమెకు వెన్నుదన్నుగా ఉండాలని కోరారు. మాజీ స్పీకర్ ప్రతిభాభారతి మాట్లాడుతూ '2024లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అయిన నేను ప్రమాణం చేస్తున్నా' అని చెప్పేంత వరకూ టిడిపి శ్రేణులన్నీ ఒక్కటవ్వాలన్నారు. ఎంఎల్‌సి పంచుమర్తి అనురాధ అధ్యక్షత వహించిన ఈ సభలో మాజీ మంత్రి అమరనాథరెడ్డి, టిడిపి అధికార ప్రతినిధి నల్లారి నరేష్‌కుమార్‌రెడ్డి, ఎంఎల్‌సిలు దొరబాబు, కంచర్ల శ్రీకాంత్, చంద్రగిరి టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పులివర్తి నాని, పులివర్తి సుధారెడ్డి, తిరుపతి మాజీ ఎంఎల్‌ఎ సుగుణమ్మ, శ్రీకాళహస్తి నియోజకవర్గ టిడిపి అభ్యర్థి బొజ్జల సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు. 'నిజం గెలవాలి' అనే బ్యాక్‌డ్రాప్ బ్యానర్‌లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఫొటో కనిపించింది. అయితే, జనసేన శ్రేణులు ఎవరూ సభకు హాజరు కాలేదు. అనంతరం 'నిజం గెలవాలి' బస్సు యాత్ర తిరుపతి నియోజకవర్గంలో అడుగు పెట్టింది.












