Jul 23,2023 17:44

ఇప్పటి యువతరంలో ప్రేమ పట్ల ఉన్న అయోమయం.. వయస్సులో కలిగే ఆకర్షణ వంటి అనుభూతులు ఈ సినిమాలో చూపించారు. తెలిసీ తెలియని వయసులో ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య పుట్టిన ప్రేమకథ.. కాలేజ్‌ డేస్‌కు వచ్చేసరికి ఆ అమ్మాయి మరొక అబ్బాయితో స్నేహం, ప్రేమ, దగ్గరవ్వడం వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయో కళ్లకు కట్టినట్లు చూపారు దర్శకుడు. కౌమారదశలో బలహీనతలకు లొంగిపోతే జీవితం చివరకు ఏమౌతుందో చెప్పారు. ఇటువంటి కథలు గతంలో వచ్చినా ఇప్పటి జనరేషన్‌కు సులభంగా అర్థమయ్యే రీతిలో చెప్పే ప్రయత్నం చేశారు.
కథలోకి వెళితే.. వైషు అలియాస్‌ వైష్ణవి (వైష్ణవి చైతన్య) ఓ బస్తీ అమ్మాయి. చిన్నప్పటి నుంచి తన ఎదురింట్లో ఉండే ఆనంద్‌ (ఆనంద్‌ దేవరకొండ) ను ప్రేమిస్తుంటుంది. ఆ ప్రేమను అతనూ అంగీకరిస్తాడు. వీరి ప్రేమ స్కూలు డేస్‌లో ప్రారంభమవుతుంది. ఆనంద్‌ పదో తరగతి తప్పడంతో ఆటో డ్రైవర్‌గా స్థిరపడతాడు. వైష్ణవి ఇంటర్‌ పూర్తి చేసి ఇంజినీరింగ్‌ కాలేజీలో చేరుతుంది. కొత్త స్నేహాలు, కొత్త పరిచయాలు ప్రభావం చూపుతాయి. దాంతో వైష్టవి ఆలోచనా విధానంలో, నడవడికలో మార్పులు వస్తాయి. ఈ క్రమంలోనే ఆమె తన క్లాస్‌మేట్‌ విరాజ్‌ (విరాజ్‌ అశ్విన్‌) కు దగ్గరవుతుంది. స్నేహం పేరుతో మొదలైన ఆ బంధం ఆ తర్వాత అడ్డదారులు తొక్కుతుంది. ఈ క్రమంలోనే అనుకోని పరిస్థితుల వల్ల విరాజ్‌కు వైష్ణవి శారీరకంగా దగ్గరవ్వాల్సి వస్తుంది. మరి ఆ తర్వాత ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. ఆనంద్‌కు నిజం తెలిసి, ఎలా స్పందించాడు? అలాగే విరాజ్‌కు వైష్ణవి - ఆనంద్‌ ప్రేమకథ తెలిసిందా? అసలు ఆనంద్‌ - విరాజ్‌లలో వైష్ణవి ఎవర్ని ప్రేమించింది? అన్నది తెరపై చూడాల్సిందే.
చాలా మంది జీవితాల్లో ఇలాంటి చిన్ననాటి స్కూలు, కాలేజీ రోజుల్లో తొలి ప్రేమకథలు ఉంటాయి. అయితే వాటిలో కాలంతో పరిణతి చెందుతూ పెళ్లి పీటలు దాకా ఎక్కేవి కొన్ని మాత్రమే. వీటిలో ఎక్కువ శాతం విఫలమైన ప్రేమకథలే ఉంటాయి. ఆ కోవకు చెందిన సినిమానే 'బేబీ'. ఎంతో సహజంగా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు దర్శకుడు సాయి రాజేష్‌. భగ ప్రేమికుడిగా ఆనంద్‌ను పరిచయం చేసి అతని కోణం నుంచి అసలు కథను ఆరంభించాడు. తొలి ఇరవై నిమిషాల పాటు వైష్ణవి - ఆనంద్‌ల స్కూల్‌ డేస్‌ ప్రేమకథే ప్రధానంగా సాగుతుంది. ఈ పాఠశాల ప్రేమకథ సహజత్వం నింపుకొని, మనసులకు హత్తుకునేలా అనిపిస్తుంది. మొదటి భాగంలో పెద్దగా మాటలు లేకుండా కేవలం హావభావాలు, నేపథ్య సంగీతంతో వారి ప్రేమను హైలెట్‌ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ఆనంద్‌ టెన్త్‌ ఫెయిలై ఆటో డ్రైవర్‌గా మారడం.. వైష్ణవి ఇంటర్‌ పూర్తి చేసి పై చదువులకు కాలేజీలో చేరడంతో వీరి ప్రేమకథ మరో మలుపు తీసుకుంటుంది.
కాలేజీలో వైష్ణవిని 'బస్తీ పిల్లా' అని అందరూ అంటూ వుంటారు. కొంతమంది ఆమెతో స్నేహం చేస్తారు. వారివల్ల వైష్టవిలో చాలా మార్పు వస్తుంది. విరాజ్‌ (విరాజ్‌ అశ్విన్‌) అనే అబ్బాయితోనూ స్నేహం చేస్తుంది. అతని మాటలకు ఆకర్షణకు లోనవుతుంది. పూర్తి వేషధారణలో, ఆలోచనల్లో మార్పు వస్తుంది. పబ్‌లకి, షికార్లకి, మందుకు కూడా అలవాటు పడుతుంది. పుట్టినరోజు ఫంక్షన్‌కి వెళ్లి విరాజ్‌ను శారీరకంగా కలుస్తుంది. తర్వాత బాధపడుతుంది. ఓవైపు ఆనంద్‌కు నిజాన్ని తెలియకుండా దాచి పెడుతూ.. మరోవైపు విరాజ్‌తో బంధాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. ఈ ట్రైయాంగిల్‌ లవ్‌ కాస్త సాగతీత వ్యవహారంగా అనిపిస్తుంది. ఇక విరాజ్‌ కుట్ర పూరిత మనస్తత్వం బయటపడ్డాక అతని నుంచి బయట పడేందుకు వైష్ణవి పడే మానసిక సంఘర్షణ సహజంగా ఉంటుంది.
ఇటువంటి సంఘటనలు సహజంగా జరుగుతున్నాయి అని దర్శకుడు చెప్పాలనుకున్నాడు. కానీ పాత్రల చిత్రణ, వాటి ప్రవర్తనపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టినట్టు అనిపించలేదు. దీంతో కొన్ని సందర్భాల్లో ఓ రకమైన గందరగోళం కనిపించింది. అక్కడక్కడా క్యారెక్టరైజేషన్‌లో లోపాలున్నప్పటికీ ఆనంద్‌ దేవరకొండ తన పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. ఇక ఈ సినిమాలో అత్యంత కీలకమైన పాత్ర పోషించిన వైష్ణవి చైతన్య చాలా బాగా చేసింది. ఆమె కళ్లతో భావాలు పలికించిన తీరు బాగుంది. మరో కీలక పాత్రధారి విరాజ్‌, నాగబాబు, వైవా హర్ష తమ పాత్రలకు న్యాయం చేశారు. విజరు బుల్గానిన్‌ అందించిన సంగీతం సినిమాకి ప్రాణం పోసింది.

నటీనటులు : ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌, నాగబాబు, సాత్విక్‌ ఆనంద్‌, బబ్లూ, లిరిష, కుసుమ తదితరులు
సంగీతం : విజరు బుల్గానిన్‌
ఛాయాగ్రహణం : ఎం.ఎన్‌. బాల్‌ రెడ్డి
రచన, దర్శకత్వం : సాయి రాజేష్‌ నీలం
నిర్మాత : ఎస్‌.కె.ఎన్‌