May 28,2023 21:45

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌ :బదిలీలు, ఉద్యోగోన్నతులు ఆన్‌లైన్లో కాకుండా మాన్యువల్‌ చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యాన ఉపాధ్యాయులు ఆదివారం ధర్నా నిర్వహించారు. ధర్నాలో ఫ్యాప్టో జిల్లా చైర్మన్‌ మజ్జి మదన్మోహన్‌ మాట్లాడుతూ తాత్కాలిక ప్రమోషన్లతో ఉపాధ్యాయులు కొత్త ప్రాంతాల్లో పనిచేశాక వాటిని రద్దు చేసి, మళ్లీ ప్రమోషన్ల ప్రక్రియకు తెరతీయడం సరికాదన్నారు. తక్షణమే షెడ్యూల్‌ను ప్రకటించి మాన్యువల్‌ కౌన్సిలింగ్‌ నిర్వహించి ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఫ్యాప్టో సెక్రటరీ జనరల్‌ కె.అప్పలరాజు మాట్లాడుతూ తాత్కాలిక సర్దుబాట్ల ద్వారా ఎస్‌జిటిలకు స్కూల్‌ అసిస్టెంట్‌గా ప్రమోషన్‌ ఇవ్వకుండా పనిచేయించుకోవడం వెట్టిచాకిరీ కిందకే వస్తుందన్నారు. వారు పనిచేసిన కాలానికి ప్రభుత్వం ప్రకటించిన గౌరవ భృతిని చెల్లించాలని డిమాండ్‌ చేశారు. యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు పొందూరు అప్పారావు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వకుండా తప్పించుకునేలా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు టి.చలపతిరావు, పి.రామారావు, పి.ప్రతాప్‌ కుమార్‌, ఎస్‌.వి రమణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా విద్యాశాఖాధికారి తిరుమల చైతన్యకు వినతిపత్రం అందజేశారు.