- తొక్కిసలాటలో ఇద్దరు, చెట్టుకొమ్మ విరిగి ఒకరు మృతి
- కర్రల సమరం, అగ్గి దివిటీల వల్ల 105 మందికి రక్త గాయాలు
- నిలువరించడంలో పోలీసుల ప్రేక్షక పాత్ర
ప్రజాశక్తి- హోళగుంద : దేవరగట్టు బన్నీ ఉత్సవాలను పోలీసులు ప్రశాంతంగా నిర్వహించలేకపోయారు. ఈ ఉత్సవాల్లో రక్తం చిందింది. కర్రలు కరాళ నృత్యం చేశాయి. తొక్కిసలాటలో ఊపిరాడక ఇద్దరు, చెట్టుకొమ్మ విరిగి మరొకరు... మొత్తం ముగ్గురు మృతి చెందారు. ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవడానికి రింగ్ కర్రలతో భక్తుల మధ్య సమరం, అగ్ని దివిటీల ఆవిరికి మొత్తం 105 మంది గాయపడ్డారు. వారిలో 11 మందికి తీవ్రగాయాలు కావడతో వారిని మెరుగైన చికిత్స కోసం ఆలూరు, ఆదోని ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు జిల్లా హోళగుంద మండలం నెరణికి, నెరణికి తండా, కొత్తపేట కొండ గుహల్లో వెలసిన దేవరగట్టు శ్రీమాల మల్లేశ్వర స్వామి జైత్రయాత్ర (కర్రల సమరం) మంగళవారం అర్ధరాత్రి జరిగింది. భారీగా పోలీసు బందోబస్తు నిర్వహించారు. రింగ్ కర్రలను తీసుకురావద్దని నిషేధాజ్ఞలు విధించారు. అయినా, రింగ్ కర్రలను దేవరగట్టుకు తీసుకొని రానీయకుండా పోలీసులు ఆపలేకపోయారు. శ్రీమాల మల్లేశ్వరస్వామి జైత్రయాత్రలో నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో పాల బండకు చేరుకున్నారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో కలిసికట్టుగా ఉండాలని, పాత కక్షలు పెట్టుకోకూడదని పాలతో బాస చేసుకున్నారు. అనంతరం మూడు అవుట్లు వదిలి 'డుర్ర్ గో పరాక్.. మాల మల్లేశ్వర బహు పరాక్' అంటూ నినాదాలు చేసి మాల మల్లేశ్వర సన్నిధికి చేరుకున్నారు. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా యుద్ధ వాతావరణాన్ని తలపించింది. అక్కడి నుంచి కొండ గిరిపైకి వెళ్లి, ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీమాల మల్లేశ్వరులకు వివాహం జరిపించారు. అనంతరం జైత్రయాత్రలో భాగంగా శ్రీమాల మల్లేశ్వరుల విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆ సమయంలో విగ్రహ మూర్తులను దక్కించుకోవాలని అరికెర, బిలేహళ్, ఆలూరు, కురుకుంద, ముద్దనగేరి, కరిడిగుడ్డం, సులువాయి, ఎల్లార్తి, హెబ్బటం, నిద్రపట్టి, విరుపాపురం తదితర గ్రామాలవారు ప్రయత్నించారు. రింగ్ కర్రలు, అగ్ని దివిటీలతో ఈ ఉత్సవానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో ఆలూరు మండలం ములగవెల్లి కొట్టాలకు చెందిన రామాంజనేయులు (42), బళ్లారికి చెందిన ప్రకాష్ (28) మృతి చెందారు. చెట్టు ఎక్కి కొమ్మపై కూర్చొని ఈ ఉత్సవాన్ని తిలకిస్తున్న ఆస్పరికి చెందిన గణేష్ (17) ఆ కొమ్మ విరిగిపోవడంతో కిందపడి ప్రాణాలు కోల్పోయారు. ఉత్సవ మూర్తులను దక్కించుకోవడానికి రింగ్ కర్రలతో కొట్టుకోవడం, అగ్ని దివిటీల వల్ల 105 మందికి గాయాలయ్యాయి. జైత్రయాత్ర ఆగకుండా గొరవయ్య తన తొడ పిక్కల నుంచి రక్తాన్ని చిందించాడు. అక్కడి నుంచి ఎదురు బసవన్న గుడి వద్దకు చేరుకుని భవిష్య వాణి వినిపించారు. ఆ తర్వాత సింహాసన కట్టకు వెళ్తుండగా భక్తులు పోటీపడి కర్రలతో మరోసారి తలపడ్డారు. శ్రీమాల మల్లేశ్వర విగ్రహ మూర్తులు సింహాసన కట్టకు చేరడంతో ఉత్సవం ముగిసింది.

భారీగా బందోబస్తు
ఒక అడిషనల్ ఎస్‌పి, తొమ్మిది డిఎస్‌పిలు, 66 మంది సిఐలు, వెయ్యి మంది పోలీసులు, 48 స్పెషల్ పార్టీ బృందాలు, రెండు ఎపిఎస్‌పి బలగాలు, 185 మంది హోంగార్డులతో బందోబస్తు నిర్వహించినా ఉత్సవంలో ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్‌పి జి.కృష్ణకాంత్, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, హోళగుంద తహశీల్దార్ హుస్సేన్ సాబ్, పత్తికొండ డిఎస్‌పి శ్రీనివాస్ రెడ్డి, ఆలూరు సిఐ వెంకటేశ్వర్లు, దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మనూరు శ్రీనివాసులు పాల్గొన్నారు.
మీడియాపై పోలీసుల ఆంక్షలు
దేవరగట్టులో స్థానికంగా ఏర్పాటు చేసిన ప్రాథమిక వైద్యశాలలో గాయాలైన భక్తుల ఫొటోలు, వీడియో కవరేజీ కోసం వెళ్లిన మీడియాపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఎస్‌పి ఆదేశాల మేరకు 'ఏ మీడియా కూడా లోపలికి వెళ్లకూడదు' అంటూ దురుసుగా ప్రవర్తించారు. ఇలాంటి ఆంక్షలు విధించడం మీడియాకు సంకెళ్లు వేసినట్లు అవుతుందని విలేకరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలన్నారు.












