'కన్నా లేవరా స్కూల్‌కి టైమౌతోంది.. బంగారు తల్లీ లేమ్మా బడికెళ్లాలి.. ఏరా ఎంతసేపు లేపాలి నిన్నూ..!' వంటి మేల్కొలుపులే కదా ఈనాడు ప్రతి ఇంటా. కానీ అమ్మమ్మ.. నానమ్మల ఊరికెళ్తే ఇదే బుడుగులు.. పిడుగులు.. 'కొక్కొరోకో' అనే కోడికూతతో సూర్యోదయానికి ముందే లేచిపోతారు. అవును, అనాదిగా కోడికూతతో మనిషికున్న అనుబంధం అలాటింది మరి. ఆ కూతను కవి పాల్కురికి సోమనాథుడు.. ఇలా వర్ణించారు. 'తొలికోడి కనువిచ్చి నిలిచి మై వెంచి / జలజల రెక్కలు సడలించి నీగి / గ్రక్కున కాలార్చి కంఠంబు విచ్చి / ముక్కున నీకెలు చక్కొల్పి కడుపు / నిక్కించి మెడ సాచి నిక్కి మిన్సూచి / కొక్కొరో కుఱ్ఱని కూయకుమున్న!' అని 'పద్య'మించారు. నిజమే.. కోడికూతతో లేచి ఎవరి పనుల్లో వారు మునిగిపోతారు పల్లెల్లో. ఎలా జరుగుతుంది ఇలా? కోడి మనను మేల్కొల్పడమేమిటి? కోడికి కరెక్ట్‌గా సూర్యోదయానికి ముందే ఎలా మెలకువ వస్తుంది. అసలు నిద్ర పోతుందా.. లేదా.. అని ఎన్నెన్ని సందేహాలో.. మరి అవన్నీ తీర్చేసుకుందామిప్పుడే.

కోడి కూయందే తెల్లవారదా..! అనే ప్రశ్నకు సమాధానమేమో కానీ.. కోడి కూస్తుంది. దాని పని అది చేస్తుంది. ఎవరి పని వారిని చేసుకొమ్మని హెచ్చరిస్తుంది. ఎలా జరుగుతుంది ఇలా అంటే.. కోడిలో బయొలాజికల్ క్లాక్ (జీవ గడియారం) ఉంటుందని పరిశోధనలలో తేలింది. అయితే ప్రతి జీవిలోనూ పగలు, రాత్రి సమయాలను గుర్తించగలిగే శక్తి ఉంటుందట. మెదడులో ఉండే పీనియల్ గ్రంధి మెలటోనిన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇది శరీరంలోని ప్రతి అవయవాన్ని, దాని పని విధానాన్ని సమన్వయపరిచే ఎండోక్రైన్ వ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది. దాని వల్లనే మనం రోజులో పగలు వెలుతురు, రాత్రి చీకటి సమయాన్ని గుర్తించగలుగుతున్నాం. కాంతిలో ఏడు రంగులున్నాయనే విషయం పరిశోధించి మాత్రమే చెప్పగలిగాం.
కానీ కోడి మెదడు సూపర్ లైట్ సెన్సిటివ్‌గా పనిచేస్తుందట. దాంతో కోడి ఆ రంగులన్నింటినీ ప్రత్యక్షంగా చూడగలుగు తుందట. అలాగే సూర్యోదయాన్ని కూడా మనకంటే 45 నిమిషాల ముందే చూస్తుందన్న మాట. అవును.. మనం సూర్యోదయాన్ని చూడగలిగే సమయం కంటే ముందే కోడి సూర్యోదయ కిరణాలను స్పష్టంగా చూడగలుగుతుంది. అంత సునిశిత శక్తి కోడికి ఉంది కాబట్టే.. 'తెల్లారింది లెగండో.. పనుల్లోకి సాగండో' అని కోడి మనను హెచ్చరిస్తుందని అంటారు సీనియర్ శాస్త్రవేత్త లోరీ మారినో. తాజాగా ఈమె చేసిన 'ది సమ్‌వన్ ప్రాజెక్ట్' అధ్యయనం స్ప్రింగర్స్ జర్నల్ యానిమల్ కాగ్నిషన్‌లో ప్రచురితమైంది.

కోడిలో జీవ గడియారం విధానం మూడు రకాలుగా ఉంటుందట. అవి.. సెల్ఫ్ సస్టెయిన్డ్ ఆసిలేటర్ - నిరంతరం కదులుతూనే ఉండటం. దీని వలనే కోడి నిద్రపోయే సమయంలో దాని కళ్ళు మూసినప్పుడు కూడా కదులుతూనే ఉంటాయట. కళ్ళు మూసుకునీ మెదడు ద్వారా కాంతికిరణ సంకేతాలను గ్రహిస్తుంది. రెండోది ఫోటిక్ ఇన్‌పుట్ పాత్‌వే.. అంటే చూసిన దృశ్యాన్ని నిక్షిప్తం చేసుకుంటుంది. అంటే దాని మైండ్‌లో చూసిన దృశ్యం ఫొటో ప్రింటై పోతుందన్న మాట. మూడో విధానంలో రిథమిక్ ప్రొడక్షన్ ఆఫ్ మెలటోనిన్ - మెదడు నిర్వహణనీ క్రమబద్ధీక రించుకుంటుందట. ఇన్ని ప్రత్యేకతలు కోడిలో మాత్రమే ఉన్నాయంటారు మారినో. ఈ బయొలాజికల్ క్లాక్ కోడి శ్వాసక్రియ, ప్రసరణ, విసర్జన, పునరుత్పత్తి, రోగనిరోధక వ్యవస్థలను సమన్వయపరుస్తుందని చెబుతారామె.
- కోడి నిద్రపోతుందా..!
అవును.. ఇన్ని ప్రత్యేకతలున్న కోడి అసలు నిద్రపోతుందా? అంటే.. అవును చీకటి పడుతూనే వాటి గూళ్ళకు చేరిపోతాయి. తెల్లవారే వరకూ నిద్రపోతాయి. అంతేకాదు. నిద్రపోయే సమయంలోనూ వాటి కళ్ళు వేగంగా కదులుతూ, స్పష్టమైన కలలు కంటాయట. ఎలాంటి కలలు అనేది శాస్త్రీయంగా స్పష్టత లేనప్పటికీ భావోద్రేకాలకూ స్పందిస్తాయని మాత్రం వ్యక్తమైందంటారు పరిశోధకులు. ఆలోచనలు, భావోద్వేగాలు వీటిలో ప్రస్ఫుటంగా వ్యక్తమౌతాయంటున్నారు. కోడి సర్వజ్ఞాని. జ్ఞాపకశక్తి, సునిశిత దృష్టి, చర్యకు వెంటనే స్పందించగలిగే శక్తి వీటికి అపారంగా ఉన్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయంటారు మారినో.

- అపారమైన జ్ఞాపకశక్తి..
అంతే కాదండోరు ఈ జీవ గడియారం కోడికెవరైనా అపాయం కలిగించినా.. లేదా ఆ ప్రయత్నం చేసినా.. ఇలాంటి వంద విషయాలను సునాయాసంగా గుర్తు పెట్టేసుకుంటుందట. చూశారా... ఆదివారం వచ్చిందా.. చికెన్ బిర్యానీ తిన్నామా.. అని మాత్రమే తెలిసిన మనం కోడికున్న జ్ఞాపకశక్తికి మోకరిల్లాల్సిందే..! అంతటితో ఊరుకుంటుందా..! అంటే లేదంట దాని బంధుమిత్రులకూ ఆ విషయాలను అందచేస్తుందట.. మరి కొంచెం జాగ్రత్త.
మరో విషయమేమంటే దీనిలోని నాడీవ్యవస్థను సుప్రాచియాస్మాటిక్ అనే న్యూక్లియస్ నేరుగా ప్రభావితం చేస్తుంది. దాంతోపాటు పీనియల్ గ్రంథి, రెటీనా- పగలు, రాత్రిని సమకాలీకరించే విధంగా ఉన్నాయి.
అంతేకాదు సుమా.. మనం కంటి గుడ్డును 180 డిగ్రీల వరకూ కదిలించగలిగితే, కోడి మాత్రం 300 డిగ్రీల వరకూ కదిలిస్తుందట. మరో విచిత్రం.. ఇది మోనోక్యులర్ విజన్ అనే ప్రత్యేకతనూ ప్రదర్శిస్తుంది. అంటే కోడి దాని రెండు కళ్ళనూ ఒకే సమయంలో వేర్వేరు పనులపై కేంద్రీకరిస్తుందట. ఇంకా కోడిపిల్ల గుడ్డు నుంచి బయటకు రాకముందే కాంతి పరిమాణాన్ని బట్టి ఇలాంటివన్నీ గ్రహించగలుగుతుందని పరిశోధనల్లో తేలింది. దీన్నిబట్టి ఈ బయొలాజికల్ క్లాక్ ఫంక్షన్ దాని అన్ని జీవన ప్రక్రియలలోనూ వ్యక్తమౌతుందని తేలింది.
- ప్రకృతి పరంగానే..
ప్రకృతి పరంగా ఏర్పడే సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలలోనే ఈ బయొలాజికల్ క్లాక్ పనితీరు సవ్యంగా ఉంటుందట. వ్యాపారపరంగా ఏర్పాటు చేసిన ఫార్మ్స్‌లో 24 గంటలూ వాటిని కృత్రిమ వెలుతురులో ఉంచితే.. సహజంగా దాని శరీరంలోని కాలచక్రం బలహీన పడుతుందంటున్నాయి అధ్యయనాలు.
అవి ఫామ్స్‌లో నియమానుసారం బలమైన ఆహారాన్ని పెట్టటం, కృత్రిమంగా పొదిగించటం లాంటివి ఇష్టపడవట. వాటంతట అవే ఆహారాన్ని తీసుకోవడాన్ని, కావలసినప్పుడు విశ్రాంతిని కోరుకుంటాయి. రోజంతా కృత్రిమంగా ఏర్పాటుచేసే వెలుతురులో ఉండటం వలన వాటి స్వయంశక్తిని నిదానంగా కోల్పోతాయి కదా. అయితే కోళ్లు కూడా డాల్ఫిన్లు, మానవులలా తెలివిగా ఆలోచిస్తాయని, స్వయంశక్తినే కోరుకుంటాయని అధ్యయనాలలో తెలిసిందంటున్నారు మారినో.
మరి తెలిసిందా.. కోడికూత ఘనత..! ఇప్పటికైనా సండే రాకకు.. ఆపై చికెన్ బిర్యానీ ప్యాక్‌కు మాత్రమే కాకుండా కోడికెంత విలువుందో.. దాని శక్తికెంత పవరుందో గమనించి మసలుకుందామా..!
- సన్నీ
70958 58888










