- రైతులను ఆదుకునేందుకు కృషి
- పొగాకు బోర్డు చైర్మన్ సిహెచ్ యశ్వంత్ కుమార్
ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్:రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తి లక్ష్యం 142 మిలియన్ కిలోలుగా నిర్ణయించినట్లు పొగాకు బోర్డు చైర్మన్ సిహెచ్ యశ్వంత్ కుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో రైతు సంఘాల నేతలతో ఆయన మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పొగాకు రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను రైతు సంఘాల నేతలు ఆయన దృష్టికి తెచ్చారు. దీనిపై యశంత్‌కుమార్ మాట్లాడుతూ.. గత ఏడాది పొగాకు రైతులకు అధిక లాభాలు వచ్చాయని, లోయర్ గ్రేడ్ పొగాకుకు సైతం మంచి ధరలు పలికాయని తెలిపారు. రానున్న రెండేళ్లలో పొగాకు పంట దిగుబడి ఆశాజనకంగా ఉంటుందన్నారు. కరోనా నేపథ్యంలో ఇతర దేశాలలో పొగాకు పంట తగ్గడంతో పొగాకు ఎగుమతులు పెరిగాయని, గత ఏడాది రూ.950 కోట్ల విదేశీమారక ద్రవ్యం బోర్డుకు సమకూరిందని తెలిపారు. ఈ ఏడాది రూ.1200 ా రూ.1400 కోట్ల విదేశీ మారక ద్రవ్యం లభిస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. పొగాకు రైతులను అన్ని విధాలా ఆదుకోవటానికి బోర్డు ఎప్పుడు ముందు ఉంటుందన్నారు. పొగాకు వేలంలో ప్రముఖ కంపెనీలు పాల్గనేలా చర్యలు తీసుకుంటామని, రైతులు పండించిన పొగాకుకు మంచి ధరలు వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. హయ్యర్ గ్రేడ్‌తోపాటు లోయర్ గ్రేడ్ పొగాకు కూడా సరైన ధరలు లభించేలా చూస్తామని తెలిపారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రైతులు పండించే పొగాకుకు మార్కెటింగ్‌లో ఎదురయ్యే సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. పరిమితికి మించి పండించిన పొగాకుకు అపరాధ రుసుం విధించే విషయాన్ని ఆలోచిస్తామని తెలిపారు. అవుట్ సోర్సింగ్ ద్వారా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసే విషయాన్ని ఆలోచిస్తున్నామన్నారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా కొన్ని పంటలకు పరిహారం ఇస్తున్నారని, ఇందులో పొగాకు పంటను చేర్చే విషయమై కేంద్రానికి లేఖ రాస్తామన్నారు. వాతావరణ ఆధారిత బీమా పొగాకు పంటకు వర్తించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో పొగాకు బోర్డు సభ్యులు మారెడ్డి సుబ్బారెడ్డి, బోడపాటి బ్రహ్మయ్య, పి. ప్రసాద్, పమ్మి భద్రిరెడ్డి, కలిగిరి శ్రీకాంత్, భాస్కర్, కె.వెంకటేశ్వర్లు, వడ్డెళ్ళ ప్రసాద్, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.










