May 14,2023 11:41

సహజంగా మాల్స్‌కి వెళ్లినప్పుడు అక్కడ మనం అనుకున్న దానికంటే ఎక్కువ బిల్‌ అవ్వడం ఖాయం. కుటుంబం మొత్తం వెళితే మరింత ఖర్చు పెరగడం అంతకన్నా వాస్తవం. అక్కడ కొన్ని మనల్ని మనం కంట్రోల్‌ చేసుకోకుండానే కొన్ని వస్తువులు కొనేస్తాం. కొన్ని పిల్లలు ఎంచుకుంటే, కొన్ని మనమే ఎంపిక చేస్తాం. అవీ ఇవీ కలిసి చివరకు తడిసిమోపెడవుతాయి. మరి ఈ ఖర్చును కంట్రోల్‌ చేయడం ఎలా? దీనికి కొన్ని టిప్స్‌ పాటిస్తే కొంతమేర ఖర్చును తగ్గించుకోగలం. అదెలాగో చూద్దాం..
 

                                                                 1.ఇంట్లో ఏమున్నాయి..?

మాల్‌కి ఎప్పుడూ సడన్‌గా వెళ్లకండి. అలా వెళ్లారో మీకు దబిడిదిబిడే. ఎందుకంటే మనకు ఏమి తీసుకోవాలి, ఏమి తీసుకోకూడదన్న అవగాహన ఉండదు. దాంతో అవసరమున్నా, లేకున్నా కొనేస్తాం. ఇది అదనపు ఖర్చును పెంచుతుంది. అందుకే మాల్‌కి వెళ్లేప్పుడు ముందుగా ఇంట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి సరిచూసుకోవాలి. గతంలో ఇలాగే తెచ్చి పడేసినవి చాలా అలాగే పడిపోయి ఉంటాయి. అవి ఉన్నాయన్న జ్ఞాపకమూ ఉండదు. దీంతో ఇంట్లో ఉన్న వాటినే కొనేస్తుంటాం. ఇలా మళ్లీ మళ్లీ కొనడం వల్ల తెచ్చినవి పాడైపోయే అవకాశం ఉంది. మళ్లీ కొనడం వల్ల వృధాగా డబ్బులు పెట్టడమే. అందుకే ముందే ఇంట్లో ఏమేమున్నాయో లిస్టు రాసుకోవాలి.

 

                                                                                2. లిస్ట్‌..మస్ట్‌..

మాల్‌కు వెళ్లే ముందే ఏమేమి కావాలో లిస్టు రాసుకోవాలి. అలాంటి ప్రణాళిక ఉంటే మాల్‌లో ఏవైనా ఆకర్షించినా.. లిస్టు నేనున్నానంటూ కంట్రోల్‌ చేస్తుంది. సహజంగా మాల్స్‌కి వెళ్లినప్పుడు లిస్టు రాసుకోవడం నామోషీగా ఫీలవుతుంటారు. గతంలో కిరాణాకొట్టులో ఇలాగే చిట్టీ తీసికెళితే వాళ్లు అది తిరిగి రాసుకుని, మనకు కావాల్సినవన్నీ పొట్లాలు కట్టి ఇచ్చేసేవారు. దానివల్ల ఒక ప్రణాళికా బద్ధంగా మనం సరుకులు కొనుక్కోవడానికి వీలయ్యేది. కానీ ఇప్పుడు అక్కడ చూసి తీసుకోవచ్చులే అనుకుని మనం వెళితే మన పర్సు ఖాళీ అవడం ఖాయం. అందుకే ముందే లిస్టు రాసుకోవాలి. ఇప్పుడు ఫోన్‌లో ఫీడ్‌ చేసుకుని వెళ్లొచ్చు. కాగితం మీదే రాసుకోనవసరం లేదు. ఆ లిస్టులో కూడా అత్యవసరమైనవి, తర్వాతైనా తీసుకోవచ్చు అనేవి ముందే డివిజన్‌ చేసి రాసుకోవాలి.

                                                                   3. కార్డు వద్దు.. మనీనే బెస్ట్‌..

మాల్‌కి వెళ్లినప్పుడు క్రెడిట్‌ కార్డు అసలు తీసికెళ్లకండి. ముందే బడ్జెట్‌ వేసుకుని ఆ నెల సరుకులకు కేటాయించిన మొత్తాన్నే సుమారుగా తీసికెళ్లండి. కార్డు తీసికెళ్లడం వల్ల మనకు తెలియకుండానే కొనే విషయంలో అదుపు తప్పే ప్రమాదం లేకపోలేదు. అదే పర్సులో డబ్బు లిమిటెడ్‌గా ఉండడంతో మనం కొనాలనుకున్నా ఒక్కసారి ఆలోచిస్తాం. చేతిలో డబ్బులు సరిపోతాయో లేదో ఒకటికి రెండుసార్లు లెక్కించుకుంటాం. దాంతో అనవసరపు ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది.
 

                                                                    4. ఆఫర్లు.. అవసరాలు..

మాల్‌లో ప్రతిసారీ ఏదో ఒక ఆఫర్లు మనల్ని ఊరిస్తూ ఉంటాయి. ఎన్ని ఆఫర్లు ఇచ్చినా.. వాటిలో అమ్మేవాడికి లాభం లేకుండా మనకేమీ అప్పనంగా ఇచ్చేయడు. అందుకే మనం ఆఫర్ల ఆకర్షణకు లోనుకాకుండా.. ఆ ఆఫర్లలో మనకు అవసరమైనవి ఉంటేనే అవీ మన బడ్జెట్‌కు తోడ్పడేలా ఉంటేనే కొనుగోలు చేయాలి. ఈ విచక్షణ లేకుండా ఆఫర్‌ అనగానే అనాలోచితంగా కొనేయకూడదు. ఆఫర్లు మార్కెట్‌ చేసుకోవడానికే పెడతారు. మనం మన అవసరాలకే ఆఫర్లను ఉపయోగించుకోవడం బెస్ట్‌. దానివల్ల మనకు ఖర్చు తగ్గుతుంది.

                                                                  5. పిల్లాపాపలతో వద్దు..

మాల్స్‌కు వెళ్లేటప్పుడు సాధ్యమైనంత వరకూ మన ప్రణాళికలో, మనం కేటాయించుకున్న బడ్జెట్‌లోనే కొనాలనుకున్నప్పుడు పిల్లలతో వెళ్లకుండా ఉండటమే ఉత్తమం. ఇటీవల మాల్స్‌ అనేవి పిల్లలకు సరదా స్థలాలుగా మారిపోయాయి. దీంతో పిల్లల్ని తీసుకుని వెళ్లడంతో సరుకులకు మించిన ఖర్చులు మన బడ్జెట్‌ను అతలాకుతలం చేస్తాయి. పిల్లల సరదాలు తీరాలంటే మాల్స్‌ కన్నా, పార్కు వంటి వాటికి తీసికెళ్లడమే ఉత్తమం.