- పార్టీల తరపున రంగంలోకి ప్రచార కంపెనీలు
- ప్రభుత్వం తరపున అన్ని కార్యక్రమాలకూ వెళుతున్న ఐప్యాక్
- ప్రతిపక్ష టిడిపి తరపున రాబిన్‌శర్మ గ్రూపు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఎన్నికల వాతావరణం సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయ సర్వేలూ పెరుగుతున్నాయి. ఏజెన్సీల తరపున పెద్దఎత్తున సంస్థలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే వైసిపి తరపున ఐప్యాక్ బృందం పనిచేస్తుండగా, టిడిపి తరపున రాబిన్‌శర్మ గ్రూపు ప్రచారం చేస్తోంది. ఇప్పటికే రెండు మూడు విడతలుగా ఆయా సంస్థలు సమావేశాలు కూడా నిర్వహించాయి. ప్రభుత్వం నుండి ఎపిఎఫ్‌ఎస్‌ఎల్ కూడా ఆన్‌లైన్ సర్వే చేపట్టింది. రెండురోజులకు ఒకసారి సర్వే ఫైబర్ నెట్ వాడే వారికి టివిల్లోనే పంపిస్తున్నారు. దీనిపై వారు క్లిక్ చేసి ఏదో ఒకటి నొక్కిందాకా ఐకాన్ స్క్రీన్‌మీద నుండి తొలగదు. ఇప్పటికే అన్ని సంస్థలూ ఒక విడత ఎన్నికల సర్వేలు మొదలుపెట్టాయి. ఓటర్ల అభిప్రాయం, అభ్యర్థులు, కులం, డబ్బు నాలుగు అంశాలపై సర్వే ప్రారంభించాయి. ఇప్పటికే ఉభయగోదావరి జిల్లాలపై ఎక్కువ దృష్టి సారించాయి. ప్రభుత్వం తరపున ప్రచారం ప్రారంభించిన ఐప్యాక్ గ్రూపు ఇప్పటికే అన్ని పార్టీల కార్యక్రమాలు, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలపై దృష్టి సారించింది. విజయవాడ ధర్నా చౌక్‌లో జరిగే కార్యక్రమాలను కూడా ప్రతిరోజూ ఐప్యాక్ సిబ్బంది కవర్ చేస్తున్నారు. అక్కడ నుండి ఫీడ్‌బ్యాక్ ప్రభుత్వానికి పంపిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేల వారీ సర్వే పూర్తి చేసిన ఐప్యాక్, ఎంపిల సర్వేనూ దాదాపు పూర్తి చేయబోతోంది. ఈసారి ఎంపి అభ్యర్థులను ఎక్కువమందిని మార్చే అవకాశముందని తెలిసింది. ఎమ్మెల్యేలకు సంబంధించి నెలకోసారి నివేదిక ఇస్తుండటం, సిఎం దానిపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి పూర్‌గా ఉన్న ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇవ్వడం, తప్పదనుకున్న వారిలో కుటుంబ సభ్యులకు టికెట్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకునేలా సూచనలివ్వడం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఐప్యాక్ పెద్ద పాత్ర పోషిస్తోంది. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయ సర్వేకు సంబంధించి చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే సంస్థ కీలకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే బిఆర్‌ఎస్ పార్టీకి సర్వే చేసే బాధ్యతలూ చేపట్టినట్లు తెలిసింది. అదే సంస్థ రాష్ట్రంలోనూ నియోజకవర్గాలకు సిబ్బందిని నియమించి వాటిల్లో జరిగే కార్యకలాపాల వివరాలను ప్రతిరోజూ నివేదిక రూపంలో తెప్పించుకునే ఏర్పాట్లు చేస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీ తరపున రాబిన్‌శర్మ గ్రూపు ప్రచార బాధ్యతలు చేపట్టింది. ఇది ఇప్పటికే రంగాల వారీ సమావేశాల ఏర్పాటు చేయిస్తోంది. ఎప్పటికప్పుడు నియోజకవర్గాల నుండి ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం, యువగళం కవరేజీ తదితర అంశాలను చూస్తోంది. దీంతోపాటు నియోజకవర్గాల్లో ఎవరి పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందని ఇన్‌ఛార్జుల పనితీరుపైనా నిరంతరం సర్వేలు చేయిస్తోంది.










