- తిలక్ వర్మ అర్ధసెంచరీ..
- 20 ఓవర్లలో భారత్ 152/7
- 18.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిన విండీస్
గయానా : టీమిండియా మరోసారి ఓడింది. వెస్టిండీస్ తో రెండో టీ20 మ్యాచ్ లోనూ భారత్ పరాజయం పాలైంది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో 153 పరుగుల విజయలక్ష్యాన్ని ఆతిథ్య విండీస్ 18.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓ దశలో భారత్ గెలుపునకు అవకాశాలు లభించినా, విండీస్ చివరి వరుస బ్యాట్స్ మెన్ అకీల్ హోసీన్ (16 నాటౌట్), అల్జారీ జోసెఫ్ (10 నాటౌట్) విలువైన పరుగులు జోడించి తమ జట్టును గెలిపించుకున్నారు. అంతకుముందు విండీస్ ఇన్నింగ్స్ ఆరంభంలో టపటపా వికెట్లు పడినా నికోలాస్ పూరన్ రెచ్చిపోయి ఆడాడు. పూరన్ 40 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 67 పరుగులు చేశాడు. కెప్టెన్ రోవ్ మాన్ పావెల్ 21, హెట్మెయర్ 22 పరుగులు చేశారు. చహల్ ఒకే ఓవర్లో హెట్మెయర్, హోల్డర్ (0)లను అవుట్ చేసి భారత్ కు ఆశలు కల్పించాడు. కానీ ఇతర బౌలర్లు విండీస్ టెయిలెండర్లపై ఒత్తిడి పెంచడంలో విఫలమయ్యారు.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. ఒపెనర్లుగా ఇషాన్ కిషాన్, శుభ్‌మాన్ గిల్ వచ్చారు. 9 బంతుల్లో ఓ సిక్సర్‌తో 7 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, అల్జెరీ జోసఫ్ బౌలింగ్‌లో సిమ్రాన్ హెట్మయర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 3 బంతుల్లో 1 పరుగు చేసిన సూర్యకుమార్ యాదవ్, రనౌట్ అయ్యాడు. 18 పరుగులకే 2 వికెట్లు కోల్పోవడంతో తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ కలిసి ఇన్నింగ్స్ నిర్మించేందుకు సమయం తీసుకున్నారు. మూడో వికెట్‌కి 42 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత ఇషాన్ కిషన్ వికెట్ కోల్పోయింది టీమిండియా.. 23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 27 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, రొమారియో షెఫర్డ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అకీల్ హుస్సేన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ముందుకు వచ్చిన సంజూ శాంసన్, స్టంపౌట్ అయ్యాడు. 7 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో తిలక్ వర్మ, 39 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. అనంతరం అకీల్ హుస్సేన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. 18 బంతుల్లో 2 సిక్సర్లతో 24 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యాని అల్జెరీ జోసఫ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 12 బంతుల్లో ఓ ఫోర్‌తో 14 పరుగులు చేసిన అక్షర్ పటేల్.. 20వ ఓవర్ మొదటి బంతికి అవుట్ అయ్యాడు. అర్ష్‌దీప్ సింగ్ వస్తూనే ఫోర్ బాదగా, రవి భిష్ణోరు సిక్సర్‌తో టీమిండియా స్కోరు బోర్డును 150 దాటించాడు. అర్ష్‌దీప్ సింగ్ 6, రవి భిష్ణోరు 8 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.










