బెంగళూరు : కర్ణాటకలోని పలువురు రచయితలను హత్య చేస్తానంటూ గతేడాది ఏప్రిల్ నుంచి బెదిరింపు లేఖలు రాస్తున్న వ్యక్తిని ఎట్టకేలకు శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవలే ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) అధికారులు శివాజి రావు జాదవ్ (41)ను దావణగెరెలో అరెస్టు చేశారు. దావణగెరె జిల్లా హిందూత్వ సంస్థకు కో కన్వీనర్‌గా జాదవ్ వున్నాడు. 8వ తరగతి మధ్యలో ఆపేసిన జాదవ్ ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేస్తున్నాడు. గతంలో జాదవ్‌పై రెండు కేసులు నమోదయ్యాయి. అతని తండ్రి దావణగెరె నగర మున్సిపల్ కార్పొరేషన్‌లో గ్రూపు డి ఉద్యోగి. రచయితలందరికీ జాదవ్ బెదిరింపు లేఖలు రాశాడని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ బి.దయానంద తెలిపారు. నాలుగు జిల్లాలవ్యాప్తంగా అనేక పోస్టు బాక్స్‌ల దగ్గర పెట్టిన సిసి టివి నిఘా ద్వారా నిందితుడిని గుర్తించారు. అరెస్టు చేసి 13 రోజుల పాటు పోలీసు కస్టడీకి పంపారు. రచయితలను హత్య చేస్తానని బెదిరిస్తూ లేఖలు రాసేవాడని కమిషన్ తెలిపారు. అన్ని లేఖలపై ఒకే చేతిరాత వుందని గుర్తించామని, కింద సహిష్ణు హిందూ అని సంతకం చేసేవాడని చెప్పారు. మొత్తంగా 61మంది రచయితలకు బెదిరింపు లేఖలు రాశాడు.










