Oct 27,2023 15:18

సిరిసిల్ల: సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి చూసి తనకు ఓటేయాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. శుక్రవారం సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేసిన యువ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... '' కొన్ని పార్టీలు ఉన్నవి లేనట్టు.. లేనివి ఉన్నట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసి యువతను పక్కదోవ పట్టిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారానే వారికి బుద్ధి చెప్పాలి. రాష్ట్రం ఏర్పడక ముందు సిరిసిల్ల పరిస్థితి ఎలా ఉంది. ఇప్పుడు ఎలా ఉందో ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయండి. తెలంగాణ ఏర్పడక ముందు సిరిసిల్లను ఉరిసిల్లగా ఎన్నో సార్లు పత్రికలు రాశాయి.నేను ప్రజల మనిషిని. ఎన్నికల్లో మందు, డబ్బు పంచనని గట్టిగా చెబుతున్నా. సిరిసిల్ల నుంచి ఇప్పటికి నాలుగుసార్లు గెలిపించారు. కలలో కూడా ఊహించని విధంగా పనులు జరిగాయి. సిరిసిల్ల జిల్లా అవుతుందని, ఇంజినీరింగ్‌, మెడికల్‌ కళాశాల వస్తుందని, కేజీ టూ పీజీ క్యాంపస్‌ వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇక్కడి అభివఅద్ధి చూసి అందరూ అసూయ పడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడేమో అన్నీ సిరిసిల్ల, సిద్దిపేటకేనా అంటారు. ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి మాత్రం ఇక్కడ అభివఅద్ధి ఏమీ జరగలేదంటున్నారు. ఆయన కాంగ్రెస్‌ పార్టీయే, ఈయన కాంగ్రెస్‌ పార్టీయే.. ఇక సమాధానం చెప్పాల్సింది మీరే. గతంలో ఇక్కడ మానేరు వాగు ఒక పాయలా కనిపించేది.. ఇప్పుడు సజీవధారగా మార్చారు సీఎం కేసీఆర్‌. దేశంలో ఎక్కడా లేని విధంగా సిరిసిల్లలో రూ.400 కోట్లతో వర్కర్‌ టు ఓనర్‌ స్కీమ్‌ తీసుకొచ్చాం. గత తొమ్మిదేళ్లుగా ఏ రంగం చూసినా గణనీయంగా అభివఅద్ధి చెందింది. ఒక్క సిరిసిల్లనే కాదు రాష్ట్రం మొత్తం ఇదే తరహాలో సాగుతోంది. రాబోయే ఎన్నికల్లో కులం, మతం గురించి ఆలోచించకుండా అభివృద్ధికి ఎవరు దోహద పడతారో వారిని ఎన్నుకోవాలి'' అని మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.