Sep 26,2023 10:42

న్యూఢిల్లీ : ముస్లిం విద్యార్ధిని సహచర విద్యార్ధులతో చెంపదెబ్బలు కొట్టించిన ఘటనలో ఉత్తరప్రదేశ్‌ పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల సుప్రీం కోర్టు సోమవారం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ కేసు ఎఫ్‌ఐఆర్‌ నమోదులో జాప్యం, మతోన్మాద ఆరోపణలు తొలగించడం పట్ల ప్రశ్నలు లేవనెత్తుతూ, ఈ కేసు దర్యాప్తుకు సీనియర్‌ ఐపిఎస్‌ అధికారిని నియమించాల్సిందిగా యుపి ప్రభుత్వాన్ని బెంచ్‌ ఆదేశించింది. విద్యా హక్కు చట్ట ఆదేశాలను పరిరక్షించడంలో ప్రభుత్వం తరపున ప్రాధమికంగా వైఫల్యం జరిగినట్లు కనిపిస్తోందని కోర్టు వ్యాఖ్యలు చేసింది. విద్యార్ధి తండ్రి ఫిర్యాదు చేసినా ఎఫ్‌ఐఆర్‌ను తక్షణమే నమోదు చేయలేదని బెంచ్‌ పేర్కొంది. సంఘటన జరిగిన దాదాపు రెండు వారాల తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో మతోన్మాద ఆరోపణలు లేకపోవడాన్ని కూడా బెంచ్‌ తప్పుబట్టింది. ఒక ప్రత్యేక మతం పట్ల టీచర్‌ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిందనే సదరు విద్యార్ధి తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారని, కానీ ఎఫ్‌ఐఆర్‌కు వచ్చేసరికి అవేమీ లేవని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇది చాలా తీవ్రమైన అంశమని అన్నారు. ఒక ప్రత్యేక మతానికి చెందిన వారనే కారణంతో సహచర విద్యార్ధిపై చేయి చేసుకోమని చెప్పడం చాలా దారుణమని అన్నారు.