Sep 11,2023 11:10

 అధికారం కోసం వారు దేనికైనా తెగిస్తారు

పారిస్‌లో విద్యావేత్తలతో ముఖాముఖీలో  రాహుల్‌

పారిస్‌ :   బిజెపికి వాస్తవిక హిందూ మతానికి ఎటువంటి సంబంధమూ లేదని, అసలు వారికే ఆ పోలికలే లేవని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలన్నదే బిజెపి విధానమన్నారు. అందుకోసం వారు దేనికైనా తెగిస్తారని చెప్పారు. పారిస్‌లో విద్యావేత్తలు, విద్యార్థులతో శనివారం జరిగిన ముఖాముఖీ చర్చలో రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. 'భారతదేశ యొక్క ఆత్మ' అయిన సామ్యవాద, లౌకిక, ప్రజాతంత్ర, గణతంత్ర పరిరక్షణ కోసం పోరాడటానికి ప్రతిపక్షాలు కట్టుబడి ఉన్నాయన్నారు. దేశం 'ప్రస్తుత అల్లకల్లోలం' నుండి సమర్థవంతంగా బయటపడుతుందని' ఆకాంక్షించారు. బిజెపి చెబుతున్న 'హిందూత్వ' విధానాలు వాస్తవ హిందూ మత గ్రంథాల్లో కానీ, ఇతిహాసాల్లో కానీ ఎక్కడా కనిపించదని ఆయన పేర్కొన్నారు.

'నేను భగవద్గీత చదివాను.. ఉపనిషత్తులు చదివాను, అనేక హిందూ పుస్తకాలు చదివాను కానీ.. బిజెపి చెబుతున్న 'హిందూ' వాటిల్లో లేదు' అని ఆయన పేర్కొన్నారు. 'మీ కంటే బలహీనమైన వ్యక్తులను భయభ్రాంతులకు గురిచేయాలని, హాని చేయాలని హిందూ సాహిత్యంలో ఎక్కడా లేదు, ఏ హిందూ పండితుడి వద్ద వినలేదు. కాబట్టి బిజెపి చేస్తున్నది హిందూ కాదు. వారు హిందూ జాతీయవాదులు కాదు. వారికి హిందూ మతంతో సంబంధం లేదు' అని చెప్పారు. బిజెపి వాళ్లు అధికారం కోసం ఏదైనా చేస్తారని చెప్పారు. గత ఎన్నికల్లో దేశంలోని ఓటర్లల్లో 60 శాతం మంది ప్రతిపక్ష పార్టీలకు ఓటేయగా, కేవలం 40 శాతం మంది అధికార పార్టీకి ఓటు వేశారని రాహుల్‌ గుర్తు చేశారు. 'కాబట్టి మెజారిటీ కమ్యూనిటీ బిజెపికి ఓటు వేస్తోందనేది తప్పుడు ఆలోచన' అని రాహుల్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం రాహుల్‌ గాంధీ యూరప్‌ పర్యటనలో ఉన్నారు. ఇప్పటికే యూరోపియన్‌ పార్లమెంట్‌ సభ్యులతో సంభాషించిన సంగతి తెలిసిందే.