Aug 31,2023 11:49

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌ (కర్నూలు) : ముఖ ఆధారిత హాజరు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేయటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులంతా ముఖ ఆధారిత హాజరు వేస్తున్నారు. అయితే అందులోని కొందరు అధికారులు కార్యాలయానికి కాకుండా హాజరు మాత్రం పక్కా వేస్తున్నారని ఆరోపణాలు వెళ్ళు వెతుతున్నాయి. ఆదోని, మంత్రాలయం పంచాయతీరాజ్‌ ఈఈ సబ్‌ డివిజన్‌ పరిధిలోని కొందరు సీనియర్‌, జూనియర్‌, స్వీపర్ల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలకు, కాంట్రాక్టులకు, ప్రజా ప్రతినిధులకు అందుబాటులో ఉంటూ వారికి సలహాలు, సూచనలు అందజేయాల్సిన అధికారి వారానికోసారి కార్యాలయం ముఖం చూస్తున్నట్లు సమాచారం. ఎప్పుడు కార్యాలయానికి వెళ్లినా సార్‌, మేడం లేరనే సమాధానమే సిబ్బంది నోట వినిపిస్తోంది. ఎంచక్కా సొంత వ్యవహారాలు చూసుకుంటూ విధులకు ఎగనామం పెడుతున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రాలయం పంచాయతీరాజ్‌ ఈఈ కొందరు సీనియర్‌ అధికారులు కార్యాలయానికి రాకుండా ముఖ ఆధారిత హాజరు యాప్‌లో టూర్‌ ఆప్షన్‌ ద్వారా హాజరు వేస్తూ విధులకు ఎగనామం పెడుతున్నారు. కార్యాలయానికి రాకుండానే కిందిస్థాయి సిబ్బందితోనే పనంతా చేపిస్తుండడం సార్‌, మేడం నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. రూ.వేల్లో జీతం తీసుకుంటూ ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు, ప్రజలు కాల్‌ చేసినా స్పందించలేనంత, కార్యాలయానికి వెళ్లినా దొరకనంత బిజీగా సొంత వ్యవహారాల్లో మునిగిపోతున్నా సదరు అధికారి, అధికారినిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం విస్తుగొల్పుతోంది.