ప్రజాశక్తి - భీమవరం:ప్రధాని మోడీతో కలిసి రాష్ట్రాన్ని అదానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దోచిపెడుతున్నారని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్ ఆరోపించారు. కృష్ణపట్నం, బందర్ పోర్టులు ఇప్పటికే అదానికి కట్టబెట్టారని, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అప్పగించేందుకు చూస్తున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడికీ వెళ్లని అదానీ విజయవాడకు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. సిపిఎం చేపట్టిన ప్రజారక్షణ భేరి బస్సు యాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో రెండోరోజు బుధవారం పర్యటించింది. నరసాపురంలో ప్రారంభమైన యాత్ర పాలకొల్లు, మార్టేరు, తణుకు, తాడేపల్లిగూడెం, కేశవరం మీదుగా భీమవరం చేరుకుంది. పాలకొల్లు గాంధీబమ్మ సెంటర్ వద్ద రాజ్యాంగ నిర్మాత, అంబేద్కర్, కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహాలకు యాత్ర బృందం నివాళులర్పించింది.
భీమవరం ప్రకాశం చౌక్ లో ఏర్పాటు చేసిన సభకు సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.వాసుదేవరావు అధ్యక్షత వహించగా వెంకట్ ప్రసంగించారు. అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం ప్రత్యేక ప్రణాళికతో ప్రజల ముందుకు వచ్చిందన్నారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో వైసిపి విధానాలు అత్యంత ప్రమాదకరంగా మారాయని విమర్శించారు. రైతులు, కౌలు రైతులు, కార్మికుల గురించి ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్వింటాలు వరికి కేంద్ర ప్రభుత్వం రూ.రెండువేలు మద్దతు ధర ఇస్తుంటే మరో రూ.700 కలిపి కేరళలోని ఎర్రజెండా ప్రభుత్వం ఇస్తోందన్నారు. ఎపిలో ఉపాధి హామీ పని దినాలు సరాసరి 40 రోజులు, రోజుకు రూ.240 అందిస్తుంటే, కేరళలో 70 రోజుల పని దినాలు, రూ.850 నుంచి 950 వరకు వేతనం అందిస్తున్నారని తెలిపారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి అధికారం కోసం మోడీ ప్రయత్నాలు సాగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి మోడీ అన్యాయం చేస్తున్నా కనీసం జగన్ నోరు మెదపడం లేదని మండిపడ్డారు. టిడిపి, జనసేన కూడా మోడీ భజన చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు, కె.లోకనాథం, నేతలు కె.ధనలక్ష్మి, ఎవి.నాగేశ్వరరావు, హరిబాబు మాట్లాడారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందాల్సిన జిల్లా పాలకుల నిర్లక్ష్యం కారణంగా వెనుకబడిందన్నారు. జిల్లాలో మూతపడిన పరిశ్రమలను తక్షణం తెరిపించాలని డిమాండ్ చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.లోకనాథం, మంతెన సీతారాం, రాష్ట్ర నాయకులు ఆండ్ర మాల్యాద్రి పాల్గొన్నారు.










