- సింగమ్ అటువంటి వ్యక్తి కాదు : 'ది వైర్' ఇంటర్వ్యూలో ఎన్ రామ్
న్యూఢిల్లీ : జర్నలిస్టులపై దాడులు విషపూరితమైనవని, ఈ దాడుల్లో ఇమిడివున్న ప్రభుత్వ సంస్థలన్నీ కూడా పంజరంలో చిలుకల వంటివని 'ది హిందూ' పత్రిక మాజీ సంపాదకులు, ప్రచురణకర్త ఎన్.రామ్ విమర్శించారు. జర్నలిస్టులను బెదిరించడానికి వేటాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఐదు నగరాల్లో న్యూస్‌క్లిక్ కార్యాలయాలు, 50మంది సిబ్బంది నివాసాలపై జరిగిన పోలీసు దాడులు, వారిపై మోపిన అభియోగాలు, ఆరోపణలు గురించి ఆయన ఆన్‌లైన్ వెబ్‌సైట్ 'దివైర్'కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నెవిల్లె రారు సింగమ్ నుండి న్యూస్‌క్లిక్ నిధులు అందుకుంటోందని, ఆ నిదులను భారత్ భద్రతకు ముప్పు కలిగించేలా అది ఉపయోగిస్తున్నదని ఢిల్లీ పోలీసులు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని రామ్ చెప్పారు. సింగమ్ తనకు తెలుసునని, ఆయన వామపక్షాలకు మద్దతుదారుగా వుంటారని, అయినా కూడా ఆయన చైనా ప్రచారానికి లేదా చైనా నిధులకు ఒక వాహకంగా లేరని రామ్ స్పష్టం చేశారు. న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని బాధ్యతారాహిత్యమైనదిగా, సోమరితనంతో కూడిన జర్నలిజంగా ఆయన అభివర్ణించారు. అసలు సింగమ్ ఎవరు, గార్డియన్ పత్రిక కోసం ఆయన చేసిన కృషి ఏంటి, ఆయన డబ్బు ఎలా సంపాదించారు, వాటిని మంచి పనుల కోసం ఎలా ఉపయోగిస్తున్నారనేది రామ్ వివరంగా చెప్పారు. జర్నలిస్టుల పట్ల మోడీ ప్రభుత్వ వైఖరి ఎమర్జన్సీని తలపిస్తోందని ఆయన విమర్శించారు. న్యూస్‌క్లిక్‌పై దాడిని నిరసిస్తూ బుధవారం ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా వద్ద జరిగిన ఆందోళనల్లో ప్రధాన వార్తాపత్రికలకు లేదా ప్రధాన వార్తా చానెళ్లకు సంబంధించిన ఏ సంపాదకులు లేకపోవడం విచారకరమని అన్నారు.










