Nov 08,2023 08:55

-టిడిపి హయాంలో స్కీమ్‌లు లేవు... అన్నీ స్కామ్‌లే
-ఎన్నికల ముందు వారు చెప్పే మాయమాటలు నమ్మొద్దు
-ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
-పుట్టపర్తిలో బటన్‌ నొక్కి రెండో విడత 'రైతు భరోసా' నిధులు జమ
ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి:'గత నాలుగేళ్లలో ఒక్కసారి కూడా కరువు రాలేదు. ఈ ఏడాది కొన్ని మండలాల్లో మాత్రమే కరువు ఉంది' అని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచామని తెలిపారు. రెండో విడత రైతు భరోసా కింద రూ.2,204.77 కోట్లు నిధులను శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో మంగళవారం ఆయన బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేశారు. దీనికి ముందు జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చిన 53 నెలల కాలంలో రైతులను అన్ని విధాలుగా ఆదుకునే చర్యలు చేపట్టామన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో రైతులను ఆదుకునే చర్యలు ఏ ఒక్కటీ చేపట్టలేదని విమర్శించారు. టిడిపి అధికారంలో ఉన్న ఐదేళ్లూ వరుస కరువులే నెలకొన్నాయని తెలిపారు. తమ హయాంలో ఈ ఏడాది కొన్ని మండలాల్లోనే కరువు నెలకొందన్నారు. టిడిపి హయాంలో ఐదేళ్లు కరువు ఉన్నప్పటికీ రైతులకు పంటల బీమా కింద ఇచ్చింది రూ.3,400 కోట్లు మాత్రమేనని తెలిపారు. తాము ఈ నాలుగున్నరేళ్లలో కరువు లేనప్పటికీ రూ.7,802 కోట్లు పంటల బీమా ఇచ్చి రైతులను ఆదుకున్నామన్నారు. రైతు భరోసా, పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ అన్నీ కలిపి ఈ నాలుగున్నరేళ్లలో రైతుల కోసం రూ.1.75 లక్షల కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు. టిడిపికి ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన లేదని, వ్యవసాయానికి రాత్రి, పగలు కలిపి కూడా తొమ్మిది గంటలు విద్యుత్‌ ఇవ్వలేకపోయిందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక పగటి పూటే తొమ్మిది గంటలపాటు విద్యుత్‌ను వ్యవసాయానికి అందిస్తున్నామని తెలిపారు. టిడిపికి తెలిసిందల్లా స్కామ్‌లు మాత్రమేనని... స్కీమ్‌ల గురించి తెలియదని దుయ్యబట్టారు. స్కిల్‌ స్కామ్‌... ఇసుక స్కామ్‌, మద్యం స్కామ్‌ ఇలా అన్నింటిలోనూ దోచుకోవడం, దాచుకోవడమే వారు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. త్వరలో రాబోయే ఎన్నికలకు ముందు కూడా టిడిపి ముఠా మరోమారు మీ వద్దకు రానుందని, ప్రతి కుటుంబానికి కేజీ బంగారం, బెంజ్‌ కారు ఇస్తామంటూ మాయమాటలు చెబుతారని అన్నారు. వారి హామీలు నమ్మి మోసపోవద్దని కోరారు. టిడిపి ప్రభుత్వ హయాంలో కంటే ప్రస్తుత ప్రభుత్వంలో అప్పులు తక్కువే చేశామని వివరించారు. అనంతరం రైతు భరోసా మెగా చెక్కును రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కాకాని గోవర్థన్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉష చరణ్‌ శ్రీ, అనంతపురం, సత్యసాయి జిల్లాల ఎంపిలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్‌ చైర్మన్లు పాల్గన్నారు.

  • సిపిఎం నేతల ముందస్తు అరెస్టులు

పుట్టపర్తిలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా సిపిఎం, ప్రజా సంఘాల నేతలను పోలీసులు ఎక్కడికక్కడే అక్రమంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. సోమవారం రాత్రి నుంచే నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి అరెస్టులకు పాల్పడ్డారు. సిఎం పర్యటన అనంతరం వారిని విడుదల చేశారు. అక్రమ అరెస్టులపై సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.