బెంగళూరు: దులీప్ ట్రోఫీ ఫైనల్లో విజయం ఇరుజట్లను ఊరిస్తోంది. సౌత్ జోన్, వెస్ట్ జోన్ మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. విజయం కోసం ఇరు జట్లు హోరాహోరీగా పోరాడుతున్నాయి. సౌత్ జోన్ నిర్దేశించిన 298 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్ట్ జోన్‌జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 62.3 ఓవర్లలో 5 వికెట్లకు 182 పరుగులు చేసింది. విజయానికి వెస్ట్‌జోన్ జట్టు మరో 116 పరుగులు చేయాల్సి ఉండగా.. చేతిలో ఐదు వికెట్లు మాత్రమే ఉన్నాయి. అయితే క్రీజులో ఓపెనర్ ప్రియాంక్ పాంచల్(92బ్యాటింగ్) ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. అయితే మరో ఎండ్‌లో టెయిలెండర్స్ మాత్రమే ఉన్నారు. ఛేదనలో భాగంగా వెస్ట్‌జోన్ ఓపెనర్ పృథ్వీ షా(7), ఛతేశ్వర్ పుజారా(15), సూర్యకుమార్ యాదవ్(4) ఘోరంగా విఫలమయ్యారు. సర్ఫరాజ్ ఖాన్(48) సాయంతో ప్రియాంక్ పాంచల్ పోరాడాడు. సెంచరీకి 8 పరుగుల దూరంలో ఉన్నాడు. చివరి రోజు ఆటలో సౌత్ జోన్ ఐదు వికెట్లు తీస్తే దులీప్ ట్రోఫీ ఛాంపియన్‌గా నిలవనుంది.










