- భద్రాచలం వద్ద 3వ ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
- ఇక్కడ, కాటన్ బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగింపు
- ధవళేశ్వరం వద్ద 15.75 అడుగుల నీటిమట్టం
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : గోదావరి ఇంకా ఉగ్రంగానే ఉంది. శనివారంతో పోలిస్తే ఆదివారం భద్రాచలం వద్ద నీటిమట్టం తగ్గినా, కాటన్ బ్యారేజీ వద్ద పెరిగింది. విలీన గ్రామాలు, లంకలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. భద్రాచలం వద్ద నీటిమట్టం 49.50 అడుగులకు తగ్గడంతో ఇక్కడ మూడో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కాటన్ బ్యారేజీకి వరద గంటగంటకూ పెరిగి 16 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజీ నుంచి సముద్రంలోకి 16,32,780 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలోని రేవులు, స్నానఘట్టాలను అధికారులు మూసేశారు. పి.గన్నవరంలో కనకాయలంక నీట మునిగింది. అక్కడ ప్రజలు పడవలపై ప్రయాణాలు సాగిస్తున్నారు. రాజమండ్రిలో బ్రిడ్జి లంక ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనరామునిలంక, అప్పనపల్లి, పాసర్లపూడి, పి.గన్నవరం మండలంలో 30 గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి.
ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్ట్ స్పిల్‌వే ఎగువన 34.280 మీటర్లు, దిగువన 26.220 మీటర్లు, ఎగువ కాఫర్ డ్యాం వద్ద 35.460 మీటర్లు, దిగువ కాఫర్ డ్యాం వద్ద 25.480 మీటర్ల నీటిమట్టం నమోదైంది. పోలవరంలో గోదావరి నీటిమట్టం 26.017 మీటర్లు ఉంది. ప్రాజెక్టులోకి వస్తున్న 13,80,216 క్యూసెక్కుల అదనపు జలాలను విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఇఇ పి.వెంకటరమణ తెలిపారు. దీంతో, పోలవరం ప్రాజెక్టుకు రాకపోకలు సాగించే కడెమ్మ వంతెన, పోలవరం ప్రాజెక్టు పోలీస్ చెక్‌పోస్టు నీట మునిగాయి. పోలవరం ప్రాజెక్టుకు రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. పోలవరం ప్రాజెక్టు అధికారులు, కార్మికులు కడెమ్మ అవుట్ ఫాల్ స్లూయీస్ మీదుగా ప్రాజెక్టుకు రాకపోకలు సాగిస్తున్నారు. వేలేరుపాడు మండలం బెస్తగూడెం ఎస్‌సి కాలనీల్లోకి వరద చేరుతుండడంతో 150 కుటుంబాలు రావికుంట కాలనీకి వెళ్లాయి. కాఫర్ డ్యామ్ ప్రభావం, శబరి నదికి భారీగా వరద నీరు చేరి పోటెత్తడంతో మండలంలోని రహదారులపై నీరు తగ్గడం లేదు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు వద్ద శబరి నీటిమట్టం 40 అడుగులు ఉంది. ఈ నది ఉధృతి కొనసాగుతుండడంతో 115 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఎపి, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ నుంచి రాకపోకలు నిల్చిపోయాయి.
ముంపు ప్రాంతాల్లో సిపిఎం బృందం పర్యటన
ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలోని రావికుంట పునరావాస కాలనీలో ఉంటున్న గొమ్ముగూడెం, బెస్తగూడెం ఎస్‌సి కాలనీ, వేలేరుపాడు మండలంలోని రేపాకగొమ్ము గ్రామాల వరద కుటుంబాలను సిపిఎం బృందం పరామర్శించింది. వారి సమస్యలు అడిగి తెలుసుకుంది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి మాట్లాడుతూ వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు టి.కిశోర్ తదితరులు ఉన్నారు.










