Aug 22,2023 21:55

ఓట్లు..

       అనంతపురం ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో జిల్లాలో 'ఓట్ల' రాజకీయాలు ఊపందుకున్నాయి. దొంగ ఓటర్లను చేర్చాంటు ప్రతిపక్ష టిడిపి ఆరోపిస్తుండగా, దొంగగా తొలగించేందుకు సిద్ధపడ్డారని అధికార వైసిపి ఆరోపిస్తోంది. గతంలో ఎన్నడూలేని విధంగా ఇరు పార్టీలు ఓటర్ల జాబితాపై నిశితంగా దృష్టి సారిస్తున్నాయి. చిన్న తప్పు దొరికినా పట్టుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. వీటి నడుమ ఉద్యోగులు నలుగుతున్నారు. వినకుంటే ఒక సమస్య... వింటే మరో సమస్య అన్న విధంగా మారింది ఉద్యోగుల పరిస్థితి. ఇప్పటికే కొంత మందిపై వేటు పడటంతో మరింత గుబులు రేపుతోంది. ఓటర్లు జాబితాలో అవకతవకల్లో ఇటీవల జిల్లా ముఖ్య అధికారులిద్దరిపై కేంద్ర ఎన్నికల సంఘం కొరాఢా ఝుళిపించింది. అంతకు మునుపు ఇద్దరు బిఎల్‌ఒలపై పడగా, తాజాగా మరో ఇద్దరిపై వేటుపడింది. వరుసగా ఇటువంటి చర్యలుంటుండటంతో ఉద్యోగుల్లో మరింత గుబులు రేకెత్తిస్తోంది.
రాజకీయవేడిని రాజేస్తున్న 'ఓట్లు'
ఉరవకొండ నియోజకవర్గంలోని విడపనకల్లు మండలంలోని చిలకురికి గ్రామంలో మూడు వేల ఓట్లను నిబంధనలకు విరుద్ధంగా, ఓటర్లు ఉన్నా శాశ్వత వలస వెళ్లారని చూపించి తొలగించారని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ ఆరోపించారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం నేరుగా అక్కడికి వచ్చి విచారణ చేపట్టింది. ఈ విచారణలో నిబంధనలు పాటించలేదని తేలడంతో ఇద్దరు బిఎల్‌ఒలతోపాటు, ఎలక్ట్రోరల్‌, రిటర్నింగ్‌ అధికారులు ఇద్దరు జిల్లా స్థాయి అధికారులను సస్పెన్షన్‌ చేశారు. ఇది ఇలాగుంటే అధికార వైసిపి నాయకులు మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి కూడా టిడిపి నాయకులకు దొంగ ఓట్లు చేర్చారంటూ ఆరోపిస్తూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇలా ఇద్దరి మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగుతున్నాయి. ఓట్ల వ్యవహారంపై రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గంలోనూ టిడిపి వైపు నుంచి మాజీ మంత్రి పరిటాల సునీత ఆరోపిస్తుండగా, వైసిపి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ప్రత్యారోపణలు చేస్తున్నారు. టిడిపి నాయకులు ఓటర్లకు తెలియకుండానే 15 వేల ఓట్లను ఆన్‌లైన్‌లో తొలగించేందుకు వారంతట వారే దరఖాస్తు చేసుకున్నట్టు చూపించి ప్రయత్నం చేసారని ఆరోపించారు. ఈ నియోజకవర్గంలోనూ ఇద్దరి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇది ఇతర ప్రాంతాలకు విస్తరిస్తోంది.
నలుగుతున్న అధికారులు
రెండు ప్రధాన పార్టీల నాయకులు ఓటర్ల జాబితాను అడ్డుపెట్టుకుని ఆడుతున్న రాజకీయ క్రీడలో ఉద్యోగులు నలిగిపోతున్నారు. అవునంటే ఒకరికి కోపం లేదంటే మరికొరికి కోపం అన్న విధంగా మారింది పరిస్థితి. ఓటర్ల జాబితాను పూర్తి స్థాయిలో రూపొందించే క్రమంలో భాగంగా ఎన్నికల సంఘం జులై 21 నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు ఇంటింటి సర్వేను చేపట్టింది. అయితే ఈసర్వే ఆన్‌లైన్‌లో చేసే క్రమంలో యాప్‌లో సాంకేతిక సమస్యలు అధికంగా వచ్చాయి. సర్వర్‌ సమస్యతో పూర్తి స్థాయి ఆన్‌లైన్‌ సర్వే జరగలేదు. అతి కష్టం మీద యాభై శాతం వరకు చేయగలిగారు. తక్కినది ఆప్‌లైన్‌లో చేసి సరిచేసే చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఇంటింటి సర్వే చేసే క్రమంలోనూ ఉద్యోగులకు తిప్పలు తప్పలేదు. ఎందుకంటే బూత్‌ లెవల్‌ అధికారులుగానున్న వారందరూ అధిక శాతం సచివాలయ ఉద్యోగులే ఉన్నారు. వారిలో కొంత మంది సాధారణ విధులూ ఉన్నాయి. ఈక్రమంలో ఇంటింటి సర్వేను పూర్తి స్థాయిలో చేయడంలో ఇబ్బందులు నెలకొన్నాయి. ఆ సమయంలో కొన్ని తప్పిదాలు జరిగే అవకాశాలూ లేకపోలేదన్న అభిప్రాయం ఉద్యోగ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. ఈ రకంగానే వజ్రకరూరులో ఇద్దరు బూత్‌లెవల్‌ అధికారులను జిల్లా కలెక్టరు సస్పెండ్‌ చేశారు. ఇంటింటి సర్వే చేయలేదు. అయితే సదరు ఉద్యోగులు పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్‌గా పనిచేవారు. అతడికి ఇది వరకే తను పనిచేసే చోటే కాకుండా మరో రెండు చోట్ల ఇన్‌ఛార్జి బాధ్యతలూ ఉన్నాయి. ఆ పనే ఎక్కువగానున్న సమయంలో అదనంగా బిఎల్‌ఒ పనిచేయడం ఇబ్బందికరంగా మారింది. సర్వే చేపట్టలేదని చర్యలు తీసుకోవడంతో ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డారు. సొంత పని భారమే ఎక్కువగా ఉండగా అదనంగా ఓటర్ల జాబితా మరింత భారమడంతోనూ ఉద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇటు పనిభారం, అటు రాజకీయ నేతల ఒత్తిళ్ల నడుమ నలిగిపోతున్నారు.