Jul 30,2023 22:15

భారత బ్యాటర్లు తడబాటుకు గురయ్యారు. యువ ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌ (55), శుభ్‌మన్‌ గిల్‌ (34) మంచి ఆరంభం అందించినా.. మిడిల్‌ ఆర్డర్‌ విఫలమైంది. సీనియర్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ విశ్రాంతి తీసుకోగా.. కుర్ర క్రికెటర్లు కరీబియన బౌలర్లను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడ్డారు.

బ్రిడ్జ్‌టౌన్‌ :భారత యువ ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ (55, 55 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) వరుసగా రెండో మ్యాచ్‌లో అర్థ సెంచరీతో మెరిశాడు. తొలి వన్డేలో స్వల్ప ఛేదనలో మెరిసిన కిషన్‌.. రెండో వన్డేలోనూ అదే ఫామ్‌ కొనసాగించాడు. మరో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (34, 49 బంతుల్లో 5 ఫోర్లు) తోడుగా ఓపెనింగ్‌ వికెట్‌కు శుభారంభం అందించాడు. ఓపెనర్లు మెరిసినా.. సంజు శాంసన్‌ (9), అక్షర్‌ పటేల్‌ (1), హార్దిక్‌ పాండ్య (7), సూర్యకుమార్‌ యాదవ్‌ (24, 25 బంతుల్లో 3 ఫోర్లు), రవీంద్ర జడేజా (10, 21 బంతుల్లో) విఫలమయ్యారు. మిడిల్‌ ఆర్డర్‌ కుప్పకూలటంతో భారత్‌ ఒత్తిడిలో పడింది!.కిషన్‌, గిల్‌ జోరు : టాస్‌ నెగ్గిన ఆతిథ్య వెస్టిండీస్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ విశ్రాంతి తీసుకోగా భారత జట్టుకు హార్దిక్‌ పాండ్య సారథ్యం వహించాడు. కొత్త బంతితో కరీబియన్‌ పేసర్లు కవ్వించినా..స్వింగ్‌తో సవాల్‌ విసిరినా.. యువ ఓపెనర్లు అద్భుతంగా బదులిచ్చారు. పవర్‌ప్లేలో 49/0తో మెరుగ్గా ఆడిన ఓపెనర్లు.. ఆ తర్వాత ఆకట్టుకున్నారు. ఇషాన్‌ కిషన్‌ ఐదు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 51 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. వరుసగా రెండో వన్డేలో కిషన్‌ అర్థ సెంచరీతో కదం తొక్కినా.. భారీ స్కోరు దిశగా సాగలేకపోయాడు. ఐదు ఫోర్లు బాదిన శుభ్‌మన్‌ గిల్‌ సైతం జోరు మీద కనిపించాడు. 90/0తో భారీ స్కోరు దిశగా సాగిన టీమ్‌ ఇండియా.. ఏడు పరుగుల వ్యవధిలోనే ఓపెనర్లు సహా మూడు వికెట్లు కోల్పోయింది. స్పిన్నర్‌ మోటీ ఓవర్లో గిల్‌ వికెట్‌ కోల్పోగా.. రోమారియో షెఫార్డ్‌ బంతికి ఇషాన్‌ కిషన్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. నం.4 బ్యాటర్‌ అక్షర్‌ పటేల్‌ (1) ఎంతోసేపు క్రీజులో నిలువలేదు. అందివచ్చిన చాన్స్‌ను సంజు శాంసన్‌ (9) సైతం సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (7) వికెట్‌ నిలుపుకోలేదు. సూర్యకుమార్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా కాసేపు క్రీజులో నిలిచినా.. ఆ భాగస్వామ్యం ఎంతో సేపు కొనసాగలేదు. 34 ఓవర్లలో 154 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయిన భారత్‌.. 200 పరుగుల మార్క్‌ చేరుకునేందుకు తంటాలు పడుతోంది. విండీస్‌ బౌలర్లలో షెఫార్డ్‌ మూడు, మోటీ రెండు వికెట్లు పడగొట్టారు.