న్యూఢిల్లీ: పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ దేశ రాజధానిలో ఉద్యోగులు కదం తొక్కారు. రామ్‌లీలా మైదానంలో నేషనల్ మూమెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌ఎంఒపిఎస్) ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపట్టారు. దీంతో మైదానం జనసంద్రంగా మారింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒపిఎస్ పునరుద్ధరణకు కేంద్రం ఆమోదించినట్లయితే.. ఆ బాధ్యత రాష్ట్రప్రభుత్వాలపై ఉండబోదని తాము బలంగా విశ్వసిస్తున్నట్లు ఎన్‌ఎంఒపిఎస్ నాయకుడు విజరుకుమార్ బంధు తెలిపారు. కేంద్రప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించకపోతే, లోక్‌సభ ఎన్నికలకు ముందే.. 'ఓట్ ఫర్ ఓపీఎస్' పేరుతో దేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఎన్‌ఎంఓపిఎస్ హెచ్చరించింది.రామ్‌లీలా మైదానంలో ఉద్యోగుల ఆందోళనలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ మద్దతు పలికారు. ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగులకు ఒపిఎస్ అమలు చేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ కూడా మద్దతు పలికింది. దేశానికి సేవ చేసే కార్మికులను గౌరవించేలా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈమేరకు కాంగ్రెస్ అధికార ఎక్స్ (ట్విటర్)ఖాతాలో పోస్టు చేసింది.










