Jul 26,2023 09:25
  • కేంద్ర ప్రభుత్వం అప్పు రూ.155.6 లక్షల కోట్లు
  • రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం అప్పు రూ.76.1 లక్షల కోట్లు
  • పార్లమెంట్‌లో కేంద్రం ప్రకటన

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశ ప్రజలపై మొత్తం రూ.220.5 లక్షల కోట్ల అప్పు ఉందని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు. ఇది స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో 80.9 శాతంగా ఉందని పేర్కొన్నారు. మంగళవారం రాజ్యసభలో సిపిఎం ఎంపి వి శివదాసన్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అందులో కేంద్ర ప్రభుత్వ అప్పు రూ.155.6 లక్షల కోట్లు (జిడిపిలో 71 శాతం), అన్ని రాష్ట్ర ప్రభుత్వాల అప్పు రూ.76.1 లక్షల కోట్లు (జిడిపిలో 35 శాతం)ని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసే అప్పుల్లో రూ.51 లక్షల కోట్లు (624.65 బిలియన్‌ యుఎస్‌ డాలర్లు ) విదేశీ అప్పు ఉందని మరో ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. దీనికి రూ.159,246 కోట్లు మేర వడ్డీ చెల్లిస్తున్నామని పేర్కొన్నారు.
 

                                                 రైతు రుణమాఫీ పథకం అమలు చేయటం లేదు

కేంద్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ పథకం అమలు చేయటం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గత మూడు ఏళ్లు, ప్రస్తుత సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి రైతుల రుణమాఫీ పథకం అమలు చేయలేదని పేర్కొన్నారు.
 

                                                  బ్యాంకులకు రూ. 5.71 లక్షల కోట్లు ఎన్‌పిఎ

దేశంలో రూ.5.71 లక్షల కోట్లు మొండి బకాయిలు (ఎన్‌పిఎ) ఉన్నాయని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి భగవత్‌ కరడ్‌ తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2023 మార్చి 31 నాటికి దేశంలోని బ్యాంకులకు రూ.5,71,515 కోట్లు మొండి బకాయిలు ఉన్నాయని చెప్పారు.
 

                                               ఎస్‌సి, ఎస్‌టిలకు మినహా కుల గణన జరగలేదు

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి జన గణనలో షెడ్యూల్డ్‌ కులాలు (ఎస్‌సి), షెడ్యూల్డ్‌ తెగలు (ఎస్‌టి) మినహా కులాల వారీగా జనాభాను కేంద్ర ప్రభుత్వం లెక్కించలేదని కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రారు తెలిపారు. లోక్‌సభలో ఒకప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
 

                                                       'ఉపాధి' నిధుల్లో రూ.20,309 కోట్ల కోత

గత మూడేళ్లలో ఉపాధి హామీ నిధులు విడుదలలో రూ.20,309.2 కోట్లు కోత జరిగింది. ఈ మేరకు లోక్‌సభలో ఒక ప్రశ్నకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్‌ జ్వోతి ఇచ్చిన సమాధానంలో ఈ విషయం స్పష్టం అయింది. ఉపాధి హామీకి 2020-21లో రూ.1,11,170.86 కోట్ల నిధులు విడుదల అయితే, 2021-22 నాటికి రూ.98,467.85 కోట్లకు తగ్గిందని, 2022-23 నాటికి రూ.90,861.96 కోట్లకు తగ్గిందని తెలిపారు.

221

                                                      పది పిఎస్‌యుల ప్రయివేటీకరణ పూర్తి

  • వివిధ దశల్లో మరో 26 పిఎస్‌యులు
  • ఇందులో విశాఖ స్టీల్‌ కూడా ఉంది : కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను మోడీ సర్కార్‌ అడ్డూఅదుపు లేకుండా కొనసాగిస్తోంది. ప్రయివేటీకరించాలని నిర్ణయించిన 36 ప్రభుత్వ రంగ సంస్థల్లో పది సంస్థల ప్రయివేటీకరణ పూర్తి చేశామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. రాజ్యసభలో సిపిఎం ఎంపి ఎలమరం కరీం అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రయివేటీకరణ పూర్తి కావాల్సిన సంస్థల్లో వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ కూడా ఉందని ఆమె తెలిపారు. 2016లో 36 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు నిర్ణయం తీసుకున్నామని, అందులో హెచ్‌పిసిఎల్‌, ఎయిర్‌ ఇండియా, డ్రెజ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా వంటి పది సంస్థల ప్రైవేటీకరణ ప్రక్రియ పూర్తి అయిందని తెలిపారు. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌, బిపిసిఎల్‌, ఐడిబిఐ బ్యాంక్‌, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, సిఇఎల్‌ వంటి 26 ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రక్రియ వివిధ దశల్లో ఉందని తెలిపారు.