Jul 25,2023 10:30
  • తూర్పు, సిక్కోలులో విజృంభణ
  • బాధితుల్లో అధికంగా చిన్నారులు

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం, శ్రీకాకుళం ప్రతినిధి : తూర్పు గోదావరి, శ్రీకాకుళం జిల్లాలో కండ్ల కలక విజృంభిస్తోంది. ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే లక్షణం ఉండడంతో గంటల వ్యవధిలో బాధితుల సంఖ్య పెరుగుతోంది. హాస్టల్స్‌, స్కూల్స్‌లో కండ్ల కలక బారిన పడిన చిన్నారుల సంఖ్య పెరుగుతోంది. వాతావరణంలో మార్పులు, కెమికల్‌ రియాక్షన్‌, రసాయనాలు, వాహనాల పొగ, సౌందర్య ఉత్పత్తులు వాడకం, దుమ్ము, ధూళి, పెంపుడు జంతువులు, పుప్పొడి వల్ల కళ్ల కలక వస్తుందని వైద్యులు చెబుతున్నారు.
 

                                                                    చిన్నారులే అత్యధికం

జిల్లాలో అనేక పాఠశాలల్లోని చిన్నారులు ఈ వ్యాధి బారినపడ్డారు. ఈ నెల 21న రాజమహేంద్రవరం ఇన్నీసుపేటలోని బాలుర హాస్టల్‌లో 45 మంది కళ్లకలకకు గురయ్యారు. రాజమహేంద్రవరంలోని కేంద్రీయ విద్యాలయంలో 12 మంది విద్యార్థులు వైరస్‌కు గురవ్వడంతో యాజమాన్యం బాధిత విద్యార్థులను దూరంగా ఉంచి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. ఆర్యాపురంలోని ఓ ప్రముఖ ప్రయివేటు పాఠశాలల విద్యార్థుల్లో 10 మందిలో వైరస్‌ను గుర్తించి ఇంటికి పంపేశారు. కండ్లకలక బాధితులకు వైద్యం అందించిన సీతంపేటకు చెందిన ఇద్దరు ఆర్‌ఎంపిలు సైతం వైరస్‌ బారిన పడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ కళ్ల కలకల బాధితులతో ఒపి ఒక్కసారిగా పెరిగింది. రోజుకు 80 నుంచి 110 ఒపిలు నమోదవుతున్నాయి.శ్రీకాకుళం జిల్లాలో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అందరూ వ్యాధి బారిన పడుతున్నారు. పాఠశాలల్లో ఒకరి నుంచి మరొకరికి వ్యాధి సోకుతుంది. అలా వారి తల్లిదండ్రులకూ వ్యాపిస్తుంది. ఈ వ్యాధితో ప్రభుత్వ ఉద్యోగులు సెలవులు పెడుతుండటంతో విధులపై ప్రభావం చూపుతోంది. శ్రీకాకుళంలోని మంచు ఐ కేర్‌ ఆస్పత్రికి ప్రతి రోజు సుమారు 40 మంది రోగులు వస్తే అందులో 20 మంది కళ్ల కలకతో వస్తున్నారని ఆస్పత్రి ఎండి, గ్లకోమా సర్జన్‌ డా. మంచు వాసుదేవరావు చెప్పారు.
 

                                                                         తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కళ్ల కలక బాధితులు కంటి వైద్యుల సలహాలు పాటించటంతో పాటు రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలి. ఫలితంగా ఎక్కువ మందికి వ్యాప్తి చెందకుండా కట్టడి చేయవచ్చు. కంటిని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు చల్లని నీటితో బాగా కడగాలి. చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. కంటి వైద్యులు పరిశీలించిన తర్వాత సమస్యను బట్టి మందులు వాడాలి. మొబైళ్లు, టివిలకు దూరంగా ఉండాలి. బాధితులు వినియోగించిన దుస్తులు, దప్పట్లు, ఇతర సామగ్రిని ఇతరులు వాడరాదు.
 

                                                             సెల్ఫ్‌ ఐసోలేషన్‌ కేర్‌ తీసుకోవాలి

చిన్నారులకు వైద్యం అందించాం. వాతావరణంలో మార్పులు కారణంగా కళ్ల కలకలు వస్తాయి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రెండు గంటలకు ఒకసారి కళ్లు శుభ్రం చేసుకోవాలి. వైద్యుల సలహాలు పాటించి ఐసోలేషన్‌లో ఉండటం మంచింది. బాధితులు కళ్ల అద్దాలను వినియోగించాలి. చేతులు ఎప్పటికపుడు శుభ్రం చేసుకోవాలి. ప్రతి పిహెచ్‌సిలో కళ్లకలకల నివారణకు మందులు అందుబాటులో ఉంచాం.
- డాక్టర్‌ ఎ. లావణ్య జిల్లా అంధత్వ నివారణ అధికారి