Sep 08,2023 22:32

-  రేపు, ఎల్లుండి  జి20 శిఖరాగ్ర సమావేశాలు
- నిఘా నీడలో రాజధాని
న్యూఢిల్లీ : ప్రపంచంలోని అత్యంత ప్రభావశీల దేశాధినేతల రాకతో శుక్రవారం దేశ రాజధాని నగరంలో సందడి నెలకొంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నగరమంతా నిఘా నీడలోకి జారుకోవడంతో జనజీవనం మొత్తం స్థంబించింది. ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యదర్శి ఆంటోనియో గుటెరాస్‌, అమెరికా అధ్యక్షులు జోయ్ బైడెన్‌, బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునక్‌, బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌ హసీనా, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని అల్బనీస్‌, ఈజిప్టు అధ్యక్షులు అబ్దేల్‌ ఫతా అల్‌ సిసి, దక్షిణ కొరియా అధినేత యూన్‌ సుక్‌ యోల్‌, ఒమన్‌ ప్రధాని హైతాం బిన్‌ తారిఖ్‌ సయీద్‌, రష్యా విదేశాంగ మంత్రి సెర్జారు లావరోవ్‌ ఇప్పటికే న్యూఢిల్లీ చేరుకున్నారు. అయితే జి20 సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే విందుకు కాంగ్రెస్‌ అధ్యక్షులు, పార్లమెంట్‌లో ప్రధాన ప్రతిపక్ష నేత అయిన మల్లికార్జున ఖర్గేకి ఆహ్వానం పంపకపోవడం వివాదస్పదమైంది. మోడీ సర్కార్‌ ఎక్కడుంటే అక్కడ మనువాదం రాజ్యమేలుతోందని, దళిత నేత అయినందునే ఖర్గేను ఆహ్వానించకుండా కేంద్ర ప్రభుత్వం కుల వివక్షకు పాల్పడిందని కాంగ్రెస్‌ నేతలు విమర్శలు గుప్పించారు. ఢిల్లీ చేరుకున్న అగ్ర నేతలకు కేంద్ర మంత్రులు వికె సింగ్‌ తదితరులు స్వాగతం పలికారు. నగరంలోని ప్రగతి మైదానంలో అత్యంత ఆధునిక హంగులతో ఏర్పాటు చేసిన 'భారత్‌ మండపం'లో శని, ఆదివారాల్లో జి 20 18వ శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించనున్నారు. ''ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్‌'' అన్న అంశంతో జరగబోయే ఈ సదస్సు ప్రధానంగా సర్వతోముఖాభివృద్ధి, డిజిటల్‌ ఆవిష్కరణ, వాతావరణ మార్పులు, అంతర్జాతీయంగా అందరికీ సమాన అవకాశాలు వంటి అంశాలపై దృష్టి పెట్టనుంది.
ఆర్థిక, ద్రవ్యపరమైన అంశాలపై అంతర్జాతీయ సహకారానికి ప్రధాన వేదికగా 1999లో జి-20 ఏర్పడింది. ఇందులో యురోపియన్‌ యూనియన్‌, మరో 19 దేశాలు వున్నాయి. అర్జెంటైనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, కెనడా, చైనా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్‌, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, టర్కీ, బ్రిటన్‌, అమెరికా సభ్య దేశాలుగా వున్నాయి.
ప్రపంచ జిడిపిలో జిా20 దేశాల వాటా దాదాపు 85శాతంగా వుంది. అంతర్జాతీయ వాణిజ్యంలో 75శాతానికి పైగా వాటా వుంది. ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల జనాభా ఈ దేశాల్లోనే వున్నారు.
అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో 2008లో, జి 20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంక్‌ గవర్నర్ల సమావేశాలను దేశాధినేతలు, ప్రభుత్వాధినేతల సమావేశం స్థాయికి పెంచారు. సంక్షోభ సమయాల్లో మరింత సమన్వయంతో వ్యవహరించేందుకు గానూ ఈ మార్పు తప్పనిసరని భావించారు. అదే ఏడాది వాషింగ్టన్‌లో మొదటి సమావేశం జరిగింది.
జి 20 ఒక అసంఘటిత ఫోరమ్‌ అయినందున దానికి పాలనా మండలి లేదా శాశ్వత మండలి లేదు. దానికి బదులుగా జి 20 దేశాలు ఏడాదికోసారి అధ్యక్ష బాధ్యతలను పంచుకుంటూ ఆ సదస్సుకు ఆతిథ్యం ఇస్తాయి.
2008 నుండి ఇప్పటివరకు మొత్తంగా 17 జి20 సమావేశాలు నిర్వహించారు. 2009లో జి20 నేతలు రెండుసార్లు లండన్‌, పిట్స్‌బర్గ్‌ల్లో సమావేశమయ్యారు. 2010లో టరంటో, సియోల్‌లో భేటీ అయ్యారు. 2011 నుండి 2019 వరకు పలు ప్రాంతాల్లో ఏడాదికోసారి మాత్రమే సమావేశాలు జరుగుతూ వచ్చాయి.
2020లో సౌదీ అరేబియా అధ్యక్షతన ఆన్‌లైన్‌లో సమావేశం జరగగా, ఆ తర్వాత బాలిలో సాధారణ సమావేశం జరిగింది. 2021లో ఇటలీ అధ్యక్షతన ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రెండింట్లో జరిగాయి.
ఆర్థిక మాంద్యాలను ఎదుర్కొనడం, అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లను క్రమబద్ధీకరించడం, పన్ను ఎగవేతలపై పోరు, అభివృద్ధి విధానానికి ఊపునివ్వడం వంటి అంశాలపై ఈ సమావేశాల్లో చర్చలు జరిగాయి.