- ఇళ్ల పట్టాల కోసం ఎమ్మెల్యే నివాసం ముట్టడి
- అరెస్టు సమయంలో పలువురికి అస్వస్థత
ప్రజాశక్తి -పెనుకొండ:ఇళ్ల పట్టాల కోసం పేదలు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. గత కొన్ని రోజులుగా సిపిఎం, వ్యకాసం ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పెనుకొండ పట్టణం మడకశిర రోడ్డులోని ప్రభుత్వం స్థలంలో ఇటీవల భూ స్వాధీన పోరాటం నిర్వహించి, అందులో గుడిసెలు వేసుకున్నారు. ఈ గుడిసెలను నాలుగు రోజుల క్రితం రెవెన్యూ, పోలీస్ అధికారులు తొలగించారు. దీనిని నిరసిస్తూ పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ ఇంటి ముట్టడికి సిపిఎం పిలుపునిచ్చింది. అందులో భాగంగా సోమవారం ఉదయం పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే శంకర్ నారాయణ ఇంటిని పేదలు ముట్టడించారు. ఇంటి ప్రధాన గేటుకు వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆందోళనను విరమించాలని ఆందోళనకారులను పోలీసులు కోరారు. తమకు ఇళ్ల పట్టాలు ఇస్తేనే ఆందోళన విరమిస్తామని స్పష్టం చేశారు. దీంతో సిపిఎం నాయకులు, మహిళలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసేందుకు యత్నించారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నారాయణ, తిప్పన్న, సిపిఎం నాయకులు కొండా వెంకటేష్ తదితరులను బలవంతంగా అరెస్ట్ చేసి సోమందేపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న, జిల్లా సహాయ కార్యదర్శి గంగాధర్, జిల్లా కమిటీ సభ్యులు వెంకటరాముడును అరెస్టు చేసే క్రమంలో మహిళలు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఈ సమయంలో నాయకులు గంగాధర్, వెంకటరాముడులు స్పృహ తప్పి అస్వస్థతకు గురయ్యారు. వీరిని పెనుకొండ ఆస్పత్రికి తరలించారు. రొద్దం పోలీసు స్టేషన్‌లో ఉన్న పెద్దన్న కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అరెస్టులు చేసినంత మాత్రాన తమ ఉద్యమాన్ని ఆపేది లేదని ఇళ్ల పట్టాలు ఇచ్చేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని మహిళలు, సిపిఎం నాయకులు తేల్చి చెప్పారు.










