మౌలానా ఆజాద్ జయంతిలో సిఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో:ముస్లిముల సాధికారతే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. మైనార్టీల సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యాదినోత్సవం సందర్భంగా శనివారం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాల్లో సిఎం పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధికారత దిశలో తమ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో పనులు చేసిందన్నారు. ఈ దిశలో రాజకీయ, ఆర్థికంగా, విద్యా రంగాల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అనేక మార్పులు తీసుకువచ్చినట్లు చెప్పారు. దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా చేసిన సేవలకు గుర్తుగా జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. 2008లో రాజశేఖరరెడ్డి సిఎంగా ఉండగా నవంబరు 11ను మైనార్టీ దినోత్సవంగా ప్రకటించారని, దాన్ని కూడా జరుపుకుంటున్నామని చెప్పారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత మైనార్టీలకు మంత్రి పదవులు ఇచ్చామని, ఎమ్మెల్సీలుగా నియమించామని తెలిపారు. నామినేటెడ్ పదవుల్లోనూ మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని వివరించారు. భారతదేశం ఏడు అడుగుల ఇంద్రధనస్సు అని అనేక రాష్ట్రాలు, భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు, కులాలు, అభిప్రాయాలు ఉన్నా, అందరం కలిసికట్టుగా ఉంటున్నామని తెలిపారు. అదే మనబలమని చెప్పారు. అల్పసంఖ్యాకంగా ఉన్నవారికి అండగా నిలబడటం, అన్నదమ్ముల ఆత్మీయతను పెంచడం అందరికీ బలమని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన 53 నెలల కాలంలో దేశంలో ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్రంలో ముందెన్నడూ జరగని విధంగా పాలన చేస్తున్నామని తెలిపారు. నాలుగేళ్ల కాలంలో రూ.2.40 లక్షల కోట్లు అక్క చెల్లెమ్మల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. గతంలో పాలకులు ఇలా ఎందుకు చేయలేదో ఆలోచించాలని కోరారు. లంచాలు, వివక్ష లేని పాలన చేస్తున్నామని వివరించారు. మైనార్టీల ఖాతాల్లో రూ.12,375 కోట్లు వేశామని పేర్కొన్నారు. నాన్ డిబిటి పథకాల కింద ఇళ్లస్థలాలు, విద్యాకానుక, సంపూర్ణ పోషణ వంటివి కూడా కలుపుకుంటే మరో రూ.10,800 కోట్లు, మొత్తం రూ.23,176 కోట్లు మైనార్టీ అక్క చెల్లెమ్మల ఖాతాల్లో వేశామని పేర్కొన్నారు. పిల్లల చదువులకు అండగా ఉంటున్నామని వివరించారు. ఇంగ్లీషు మీడియం, ఆరోతరగతి నుండి ఐఎఫ్‌పి డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటుచేసి స్కూళ్లను మార్పు చేస్తున్నామని పేర్కొన్నారు. ద్విభాషా పుస్తకాలు తీసుకొచ్చామని పేర్కొన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఉర్దూను రెండో అధికార భాషగా గుర్తించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మైనార్టీస్ కాంపొనెంట్ పథకం ద్వారా సబ్‌ప్లాను తీసుకొచ్చామని పేర్కొన్నారు. విజయవాడ నుండే హజ్ యాత్రను ప్రారంభించామని చెప్పారు. ప్రయాణ ఖర్చు రూ.14 కోట్లు ఎక్కువ అవుతుందంటే అది కూడా ఇచ్చామన్నారు. వక్ప్‌బోర్డు ఆస్తుల రక్షణ కోసం జిఓ 60 జారీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా తదితరులు పాల్గన్నారు.










