- ప్రజల దృష్టి మరల్చే చర్య
న్యూఢిల్లీ : ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సిబిఐ దర్యాప్తు అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రైలు ప్రమాదాల విషయాల్లో సిబిఐ దర్యాప్తు చేయదని, ప్రజల దృష్టిని మళ్లించే చర్యగా దీనిని రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. దర్యాప్తు పేరుతో ఈ అంశాన్ని సాగదీసి చేతులు దులుపుకునే చర్యకు మోడీ సర్కారు దిగిందని ఆరోపిస్తున్నారు. దీంతో రైలు ప్రమాద ఘటనపై సిబిఐని రంగంలోకి దింపటంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేంద్రం తీరును ఇటు నిపుణులూ తప్పుబడుతున్నారు. సాంకేతిక, సంస్థాగత, రాజకీయ వైఫల్యాలకు సిబిఐ సహా చట్టాన్ని అమలు చేసే సంస్థలు జవాబుదారీగా ఉండవని అన్నారు. నేరాలను దర్యాప్తు చేయడానికే సిబిఐ ఉద్దేశించబడిందనీ, రైల్వే ప్రమాదాల కోసం కాదని చెప్తున్నారు. ముఖ్యంగా, సిబిఐ, చట్టాన్ని అమలు చేసే ఇతర ఏదైనా ఏజెన్సీలకు రైల్వే భద్రత, సిగలింగ్, నిర్వహణ పద్ధతులలో సాంకేతిక నైపుణ్యం ఉండదని తెలిపారు.
2016 ఘటనను గుర్తు చేస్తున్నది : మోడీకి కాంగ్రెస్ చీఫ్ ఖర్గే లేఖ
ప్రతిపక్షాల నుంచి సిబిఐ దర్యాప్తుపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విషయంపై కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే ప్రధాని మోడీకి నాలుగు పేజీల లేఖను రాశారు. రైల్వే ప్రమాదాలపై దర్యాప్తు జరపడానికి సిబిఐకి యోగ్యత ఉండదని కాంగ్రెస్ వాదిస్తున్నది. ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని ఖర్గే తన లేఖలో పేర్కొన్నారు. ''ప్రమాదానికి గల మూల కారణాన్ని కనుగొన్నామని చెప్పిన కేంద్ర రైల్వే మంత్రి.. సిబిఐ దర్యాప్తును కోరారు. 2016లో కాన్పూర్‌లో రైలు పట్టాలు తప్పిన ఘటనలో 150 మంది మృతి చెందటంపై విచారణ జరపాలని అప్పటి రైల్వే మంత్రి జాతీయ దర్యాప్తు సంస్థను కోరారు'' అని ఖర్గే గుర్తు చేశారు. 2018లో ఎన్‌ఐఎ విచారణను ముగించిందనీ, ఛార్జిషీట్‌ను దాఖలు చేసేందుకు నిరాకరించిందని పేర్కొన్నారు. 150 మంది మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు అని ఖర్గే ప్రశ్నించారు. ప్రస్తుత సిబిఐ దర్యాప్తు అనేది 2016 విషయాన్ని గుర్తు చేస్తున్నదని పేర్కొన్నారు. వ్యవస్థాగత భద్రతా లోపాన్ని పరిష్కరించే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదనీ, జవాబుదారీ నుండి తప్పించుకునేందుకే ఇటువంటి ఎత్తులు వేస్తున్నట్టుగా ఉందని అన్నారు. రైల్వేలో దాదాపు 3 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని విమర్శించారు.
సిబిఐ విచారణ సరికాదు : మమత
ఒడిశాలో ఘోర రైలు ప్రమాద ఘటనపై సిబిఐ విచారణను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తప్పుబట్టారు. ప్రమాదాన్ని ప్రమాదంగానే చూడాలనీ, అయితే కేంద్రం దీనిని కూడా తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తున్నదన్నారు. ఈ విషయంలో సిబిఐ ఎంక్వైరీతో ఎలాంటి ఫలితమూ ఉండదని చెప్పారు. జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ ప్రమాద ఘటన కేసును 12 ఏళ్ల క్రితం తాను సిబిఐకి అప్పగించాననీ, ఎలాంటి ఫలితం లేదని తెలిపారు. అలాగే, సైంతియా కేసునూ సిబిఐకి అప్పగించినా.. దానిది కూడా అదే దారి అని చెప్పారు. సిబిఐ క్రిమినల్ కేసులను దర్యాప్తు చేస్తుందనీ, అయితే ఒడిశా ఘటన ఒక ప్రమాద కేసు అని మమత అన్నారు. ప్రమాద ఘటన వెనుక గల కారణం ప్రజలకు తెలియాలని అన్నారు.
ప్రాథమిక నిర్ధారణలతో విభేదిస్తున్న విచారణాధికారి
రైలు ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై ప్రాధమికంగా దర్యాప్తు నిర్వహించిన ఐదుగురు సభ్యుల విచారణా కమిటీ సభ్యుడైన సీనియర్ రైల్వే అధికారి ప్రాధమికంగా కనుగొన్న కొన్ని అంశాలపై విభేదించారు. ప్రమాద స్థలిలో అక్కడికక్కడే విచారణ జరిపిన ఈ బృందం రెండు పేజీల నివేదికను అందజేసింది. సిగలింగ్ తప్పిదమే ఈ ప్రమాదానికి కారణమని నిర్ధారించింది. ఈ బృంద సభ్యుడైన సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఎ.కె.మహంతా ఈ నిర్ధారణలోని కొన్ని అంశాలతో విభేదించారని, దానిపై తన అభిప్రాయాన్ని నమోదు చేశారని రైల్వే వర్గాలు తెలిపాయి. మెయిన్ లైన్‌లోకి వెళ్లేందుకు కోరమాండల్‌కి సిగల్ వచ్చినా అది లూప్‌లైన్‌లోకి వెళ్లిందని బృందం నిర్ధారించింది. అయితే పాయింట్ (17ఎ) లూప్‌లైన్‌కు సెట్ చేయబడింది అన్న నిర్ధారణను సీనియర్ అధికారి మహంతా అంగీకరించడం లేదు. ''డేటా లాగర్ నివేదికలోని వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుంటే ఆ పాయింట్ మెయిన్ లైన్‌కు సెట్ చేయబడింది. పట్టాలు తప్పిన తర్వాత ఇది రిజర్వ్ కావచ్చు.'' అని ఆయన చెప్పారు. పైగా లెవల్ క్రాసింగ్ గేట్ నెం.94కు ముందుగానే పట్టాలు తప్పింది. ఈ లెవల్ క్రాసింగ్ పాయింట్ 17(ఎ)కి ముందుగానే వుంది. తద్వారా లూప్‌లైన్‌లోకి వెళ్లడానికి ముందుగానే ప్రమాదం జరిగినట్లు వాదించాల్సివుందని చెప్పారు. ఈ మేరకు ఆయన తన అసమ్మతి నోట్‌ను అదే రోజున అంటే 3వ తేదీనే ఖరగ్‌పూర్ సెక్షన్ కంట్రోలర్‌కు అందజేశారు.










