Aug 09,2023 21:52
  • తిలక్‌ వర్మకు చేజారిన అర్ధసెంచరీ
  • మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌

ముంబయి: వెస్టిండీస్‌తో మంగళవారం జరిగిన మూడో టీ20లో ఒక్క పరుగు దూరంలో అర్ధసెంచరీని చేజార్చుకున్న హైదరాబాదీ బ్యాటర్‌ తిలక్‌ వర్మకు మాజీ క్రికెటర్ల నుంచి మద్దతు లభిస్తోంది. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ట్వీట్టర్‌ వేదికగా.. ''కష్టంగా ఉన్న పని మీరు చేయండి.. సులభంగా ఉన్న పని నేను చూసుకుంటా. ఇలాంటివి వినీ వినీ..'' అంటూ తన వ్యాఖ్యలను అసంపూర్తిగా వదిలేశాడు. దీంతో.. ఇర్ఫాన్‌.. హార్దిక్‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశాడని కామెంట్లు చేస్తున్నారు. సిరీస్‌ ఆరంభం నుంచి కెప్టెన్‌గా ఓవరాక్షన్‌ చేస్తున్న పాండ్యా.. ఇప్పుడిలా స్వార్థంగా ప్రవర్తించడం ఎవరికీ నచ్చడం లేదంటూ చురకలు అంటిస్తున్నారు. తిలక్‌ వర్మ 49 పరుగుల వద్ద ఉండగా.. ఇంకా పదమూడు బంతులు మిగిలే ఉన్నాయి. ఇలాంటి సమయంలో సూర్యకు అండగా నిలిచి.. క్లిష్ట సమయంలో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన తిలక్‌కు హార్దిక్‌ స్టైక్‌ ఇచ్చి ఉంటే బాగుండేది. అదే జరిగితే ఈ హైదరాబాదీ కెరీర్‌ ఆరంభంలోనే వరుసగా రెండు అర్ధ శతకాలు బాదిన బ్యాటర్‌గా నిలిచేవాడు'' అని పేర్కొన్నాడు. ఇక టీమిండియా మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా ట్వీటర్‌లో ''ఇంత స్వార్థం పనికిరాదు. కోహ్లి విషయంలో ధోని ఏం చేశాడో గుర్తుందా?'' అంటూ ఏకిపారేస్తున్నారు. దీంతో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాను ఓవరాక్షన్‌ పాండ్యాకు మంచి కౌంటర్‌ ఇచ్చారంటూ అభిమానులు వీరిద్దరిని ప్రశంసిస్తున్నారు. వెస్టిండీస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ గెలుపు ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది.