- బుమ్రా సిద్ధం - రింకూ సింగ్ అరంగేట్రం పక్కా
- 18న ఐర్లాండ్‌తో తొలి టి20
ముంబయి: వెస్టిండీస్‌తో టి20 సిరీస్‌ను చేజార్చుకున్న టీమిండియా జట్టు ఇక ఐర్లాండ్‌తో సిరీస్‌కు సిద్ధమైంది. ఈ పర్యటనకు సీనియర్ ఆటగాళ్లు, హార్దిక్ పాండ్యాను దూరంగా ఉంచి మేనేజ్‌మెంట్ యువ క్రికెటర్లకు పెద్దపీట వేసింది. వెన్నునొప్పితో దాదాపు ఏడాదిగా టీమిండియాకు దూరంగా ఉన్న పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ పర్యటనలో భారటజట్టు పగ్గాలను అందుకున్న బుమ్రాతో పాటు ప్రసిధ్ కృష్ణ కూడా ఈ సిరీస్‌తోనే పునరాగమనం చేయనున్నాడు. ఆసియాకప్, వన్డే ప్రపంచకప్ ముందు మ్యాచ్ ప్రాక్టీస్ కోసం బుమ్రాను ఈ సిరీస్ ఆడిస్తున్నారు. అలాగే వెస్టిండీస్ పర్యటనతో అంతర్జాతీయ క్రికెట్ టి20ల్లో అరంగేట్రం చేసిన తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్ ఈ సిరీస్‌కు కూడా ఎంపికయ్యారు. ఇక ఐపిఎల్ 2023 సీజన్‌లో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు కొట్టి మ్యాచ్‌ను మలుపుతిప్పిన రింకూ సింగ్‌తోపాటు శివమ్ దూబే చాలాకాలం తర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ పర్యటన నుంచి హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్‌తో పాటు సహాయ సిబ్బంది విశ్రాంతి నిచ్చిన బిసిసిఐ.. సితాన్షు కోటక్, సాయిరాజ్ బహుతులేలను కోచ్‌లుగా ఎంపిక చేసింది.
ఓటమి మంచే చేసింది: హార్దిక్ పాండ్యా
టి20 సిరీస్ చేజారడం తమకు మంచే చేసిందని టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా సమర్ధించుకున్నాడు. వెస్టిండీస్‌తో ఐదో, చివరి టి20 ఓడిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ''నేను బ్యాటింగ్‌కు వచ్చే సమయంలో ఫామ్‌ను కొనసాగించే బ్యాటర్ కరువయ్యాడని, దీంతో వేగంగా పరుగులు చేయలేకపోయామన్నాడు. ఓటమిపై ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని, గెలుపు, ఓటములు అనేవి ఆటలో ఒక భాగమని పేర్కొన్నాడు. త్వరలో వన్డే ప్రపంచకప్ జరగనుందని, కొన్నిసార్లు ఓడిపోవడం కూడా మంచి చేస్తుందని నమ్ముతానని అన్నాడు. ఎందుకంటే ఓటమిలో చాలా విషయాలను నేర్చుకునేందుకు అవకాశం కల్పిస్తుందని, ముఖ్యంగా యువ ఆటగాళ్లు తమకొచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొన్నారని పేర్కొన్నాడు. అమెరికాలో క్రికెట్‌ను వీక్షించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని, వచ్చే ఏడాది టి20 ప్రపంచకప్ అమెరికాలోనే జరగనుందని, ఇక్కడి పిచ్‌లకు బ్యాటింగ్‌కు అనుకూలమని చెప్పుకొచ్చాడు. ఆదివారం ఫ్లోరిడా వేదికగా జరిగిన ఐదో, చివరి టి20లో వెస్టిండీస్ జట్టు 8వికెట్ల తేడాతో టీమిండియాను చిత్తుచేసి సిరీస్‌ను 3-2తో చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ షెఫర్డ్‌కు, సిరీస్ పూరన్‌కు లభించాయి. ఈ సిరీస్‌కు ముందు జరిగిన టెస్టు సిరీస్‌ను 1-0తో, వన్డే సిరీస్‌ను 2-1తో టీమిండియా చేజిక్కించుకుంది.










