Oct 11,2023 09:22
  • స్వతంత్ర మీడియాపై బిజెపి కుట్రలు ఫలించవు
  • శ్రమజీవుల ఉద్యమాలు కవర్‌ చేసినందునే న్యూస్‌క్లిక్‌పై కక్షసాధింపు
  • జంతర్‌ మంతర్‌ వద్ద వామపక్షాల ఆందోళనలో బృందాకరత్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : నిజాలు చెప్పేవారినే మోడీ సర్కార్‌ దేశద్రోహులుగా ముద్ర వేస్తోందని, ప్రశ్నించే తత్వాన్ని అది జీర్ణించుకోలేకపోతోందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ విమర్శించారు. స్వతంత్ర మీడియాపై బిజెపి కుట్రలు ఫలించబోమని తెలిపారు. న్యూస్‌ క్లిక్‌, ద వైర్‌ తదితర స్వతంత్ర మీడియా సంస్థలను నాశనం చేయడానికి బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభంగా ఉన్న మీడియా స్వేచ్ఛను హరించేవిధంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ మంగళవారం నాడిక్కడ జంతర్‌ మంతర్‌ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ సామాజిక తరగతులకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 'ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న మోడీ సర్కార్‌ నశించాలి.. మీడియా స్వేచ్ఛ వర్ధిల్లాలి' అంటూ నినదించారు. ఈ సందర్భంగా బృందా కరత్‌ మాట్లాడుతూ..కార్మికులు, అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలను, వారు చేస్తున్న ఉద్యమాలను కవర్‌ చేస్తున్నందునే 'న్యూస్‌ క్లిక్‌'పై బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని ఆమె పేర్కొన్నారు. సమాజంపై విద్వేష విషం చిమ్మే సంఫ్‌ు పరివార్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) వారపత్రిక 'ఆర్గనైజర్‌'కు మాత్రం ఎనలేని స్వేచ్ఛను కల్పించారని తప్పుబట్టారు. చైనాతో ముడిపెట్టి నకిలీ జాతీయవాదంతో పత్రికా స్వేచ్ఛపై మోడీ సర్కార్‌ దాడి చేస్తోందన్నారు.
          కేంద్ర ఏజెన్సీలు 2020 నుంచి న్యూస్‌ క్లిక్‌పై విచారణ జరుపుతున్నాయని, మూడేళ్లు శ్రమించినా ఇడి, సిబిఐ, ఐబిలు న్యూస్‌ క్లిక్‌కు వ్యతిరేకంగా ఏమీ కనుగొనలేకపోయాయని పేర్కొన్నారు. ప్రబీర్‌ పుర్కాయస్థతో సహా ఎవరినీ అరెస్టు చేయొద్దని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు గతంలోనే ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ కేసును హైకోర్టు మళ్లీ విచారిస్తున్న సమయంలో ప్రబీర్‌ పుర్కాయస్థ, అమిత్‌ చక్రవర్తిని యుఎపిఎ కింద అరెస్టు చేశారని అన్నారు. ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో జైలుశిక్ష అనుభవించిన వ్యక్తి ప్రబీర్‌ పుర్కాయస్థ అని, పోలియో కారణంగా శారీరక సవాళ్లను ఎదుర్కొంటున్న వ్యక్తి అమిత్‌ చక్రవర్తి అని బృందాకరత్‌ తెలిపారు. అలాంటి నిస్వార్థ పాత్రికేయులపై తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్టు చేసినందుకు మోడీ ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి కెఎం తివారీ, అమర్‌జిత్‌ కౌర్‌ (సిపిఐ), జి దేవరాజన్‌ (ఫార్వర్డ్‌ బ్లాక్‌), రవిరారు (సిపిఐ-ఎంఎల్‌), ఆర్‌ఎస్‌ దాగర్‌ (ఆర్‌ఎస్‌పి), ప్రకాశరావు (సిజిపిఐ) తదితరులు మాట్లాడారు.