- 128 పరుగుల భారీ తేడాతో ఓడిన యువ భారత్
- 353 పరుగుల లక్ష్యఛేదనలో 224 పరుగులకే ఆలౌట్
ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్‌లో భారత ఎ జట్టు, పాకిస్తాన్ ఎ జట్టుపై 128 పరుగుల తేడాతో చిత్తు ఓటమి చెందింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత్ పాకిస్తాన్‌కి బ్యాటింగ్ అప్పగించింది. 50 ఓవర్లలో పాకిస్తాన్ 8 వికెట్లు కోల్పోయి 352 పరుగుల భారీ స్కోరు చేసింది. సయిం ఆయుబ్ 51 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 59 పరుగులు చేయగా సహీబ్‌జాదా ఫర్హాన్ 62 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 65 పరుగులు చేశాడు. ఓమర్ యూసఫ్ 35 బంతుల్లో 4 ఫోర్లతో 35 పరుగులు చేశాడు. 29 ఏళ్ల తయ్యాబ్ తాహీర్ 71 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 108 పరుగులు చేసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు.. కెప్టెన్ మహ్మద్ హారీస్ 2 పరుగులు చేసి అవుట్ కాగా ఖాసీం అక్రమ్ డకౌట్ అయ్యాడు. ముబసిర్ ఖాన్ 35 పరుగులు చేయగా మెహ్రీన్ ముంతాజ్ 13 పరుగులు చేశాడు. మహ్మద్ వసీం జూనియర్ 17 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో రాజవర్థన్ హంగర్‌గేకర్, రియాన్ పరాగ్ రెండేసి వికెట్లు తీయగా హర్షిత్ రాణా, మనవ్ సుథార్, నిశాంత్ సింధులకు తలా ఓ వికెట్ తీశారు..

353 పరుగుల భారీ లక్ష్యఛేదనలో టీమిండియాకి శుభారంభం దక్కింది. 28 బంతుల్లో 4 ఫోర్లతో 29 పరుగులు చేసిన సాయి సుదర్శన్, అభిషేక్ శర్మతో కలిసి తొలి వికెట్‌కి 64 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. ఈ క్రమంలో అర్షద్ ఇక్బాల్ బౌలింగ్‌లో సాయి సుదర్శన్ అవుట్ అయ్యాడు. 15 బంతుల్లో ఓ ఫోర్‌తో 11 పరుగులు చేసిన నికిన్ జోష్, మహ్మద్ వసీం బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. . అభిషేక్ శర్మ 51 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 61 పరుగులు.. కెప్టెన్ యష్ ధుల్ 41 బంతుల్లో 4 ఫోర్లతో 39 పరుగులు.. నిశాంత్ సింధు 10, ధృవ్ జురెల్ 9, రియాన్ పరాగ్ 14, హర్షిత్ రాణా 13, రాజవర్థన్ హంగర్‌గేకర్ 11 పరుగులు చేసి వెంటవెంటనే పెవిలియన్ చేరారు.. యువరాజ్‌సిన్హా దోహియా 5 పరుగులు చేసి అవుట్ కావడంతో టీమిండియా ఇన్నింగ్స్ 224 పరుగుల వద్ద అలౌట్ అయ్యింది.











