Aug 10,2023 00:30

గయానా: మూడో టి20లో నెగ్గిన టీమిండియా నాల్గో టి20కి అదే జట్టును కొనసాగించనుంది. సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో విజయాన్నందుకున్న టీమిండియా.. మూడు రోజుల బ్రేక్‌ అనంతరం శనివారం జరిగే నాలుగో టీ20లో ఆతిథ్య విండీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి ఐదు టీ20ల సిరీస్‌ను 2-2తో సమం చేసి ఆఖరి పోరును డిసైడర్‌గా మార్చాలని హార్దిక్‌ సేన భావిస్తోంది. మరోవైపు నాలుగో టీ20లో గెలిచి మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ కైవసం చేసుకోవాలని విండీస్‌ పట్టుదలతో ఉంది. దాంతో నాలుగో టీ20 మ్యాచ్‌ కూడా రసవత్తరంగా సాగనుంది. మూడో టీ20లో కీలక మార్పు చేసిన టీమిండియా.. అదే కాంబినేషన్‌ను కొనసాగించనుంది. ఇషాన్‌ కిషన్‌పై వేటు వేసిన టీమ్‌మేనేజ్‌మెంట్‌ యశస్వి జైస్వాల్‌కు అవకాశం కల్పించింది. కానీ అతను తీవ్రంగా నిరాశపరిచాడు. అయితే అతనికి మరో అవకాశం ఇవ్వనున్నారు. బౌలింగ్‌ కాంబినేషన్‌లోనూ పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు. ఆవేశ్‌ ఖాన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌లకు అవకాశం కల్పించాలనుకుంటే ముకేష్‌ కుమార్‌ను పక్కనపెట్టే అవకాశం ఉంది. సిరీస్‌ రేసులో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌ కావడంతో టీమిండియా ప్రయోగాలు చేసే అవకాశం లేదు. తెలుగు తేజం తిలక్‌ వర్మ వరుసగా మూడో మ్యాచ్‌లోనూ సత్తా చాటడం... సూర్యకుమార్‌ యాదవ్‌ ఫామ్‌ అందుకోవడం జట్టుకు కలిసొచ్చే అంశం. ఓపెనింగ్‌ జోడీ సత్తా చాటితే టీమిండియాకు తిరుగుండదు. యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌ శుభారంభం అందిస్తే భారత్‌ భారీ స్కోర్‌ చేయనుంది. బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌, చాహల్‌ మంచి ప్రదర్శన కనబర్చారు. అదే జోరు కొనసాగిస్తే టీమిండియాకు తిరుగుండదు. వికెట్‌ కీపర్‌ సంజూ శాంసన్‌ కూడా సత్తా చాటితే భారత బ్యాటింగ్‌కు డోకా ఉండదు.
భారత తుది జట్టు(అంచనా): యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా, సంజూ శాంసన్‌, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చాహల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ముఖేశ్‌ కుమార్‌.