Oct 23,2023 19:33

ప్రజాశక్తి-రాజమండ్రి : టిడిపి అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ మరో వినూత్న కార్యక్రమం చేపట్టింది. గతంలో చేపట్టిన 'మోత మోగిద్దాం', 'కాంతితో క్రాంతి', 'న్యాయానికి సంకెళ్లు' తరహాలోనే తాజాగా 'మనం చేద్దాం జగనాసుర దహనం' పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టింది. ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ పిలుపు మేరకు వైసిపి ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఖండిస్తూ ' సైకో జగన్‌ పోవాలి' అని రాసిన పత్రాలను ప్రజలు, పార్టీ శ్రేణులు దహనం చేశారు. రాజమహేంద్రవరంలో లోకేశ్‌, ఆయన సతీమణి బ్రాహ్మణి.. ఎన్టీఆర్‌ భవన్‌ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో టిడిపి సీనియర్‌ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నిరసనలకు సంబంధించిన వీడియోలను తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు.