May 21,2023 07:24

వేసవి సెలవలంటే అమ్మమ్మ, నానమ్మల ఊళ్ళకు వెళ్ళటం. అక్కడ చెట్లు, పచ్చటి పొలాలు, ఆయా కాలాల్లో వచ్చే కాయలూ, పండ్లూ తింటూ.. ఆటపాటలతో హాయిగా కాలం గడపటం గుర్తొస్తుంది. వేసవిలో మాత్రమే దొరికేవి తాటి ముంజెలు, మామిడి పండ్లూ. పల్లెటూళ్ళలో ఇళ్ళ పక్కనో, దగ్గరలోనో ఎక్కడంటే అక్కడ తాడిచెట్లు ఉంటాయి. కొబ్బరి గెలల్లానే తాటి కాయలూ గుత్తులుగా గెలలకు కాస్తాయి. వాటిని చెట్టు నుంచి కోసి, కాయను ముచిక వైపు చెక్కి ఇస్తే.. బొటనవేలితో ముంజెలు జుర్రుకుని, తినటం భలే మజా. ముంజల రుచి లేత కొబ్బరిలా ఉంటుంది. లేత ముంజెలలో నీరు ఉంటుంది. కాయను ఎత్తి ఆ నీటిని తాగటం ఓ గమ్మత్తైన అనుభూతి.

తాటి ముంజలు వేసవిలో దొరికే అద్భుతం. ఇవి చూడటానికి జెల్లీలా, పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటాయి. తియ్యగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి. ఈ పండు శరీరానికి కలిగించే చలువ వల్ల దీన్ని 'ఐస్‌ యాపిల్‌' అని కూడా అంటారు. వీటిని కన్నడలో 'తాటి నుంగు' అని.. తమిళంలో 'నుంగు' అని అంటారు.

1
  • ఇంటిలోనే..

తాటిముంజెలతో ఎన్నో రకాల పానీయాలు, చిరుతిళ్లూ ఇంట్లో తయారు చేసుకోవొచ్చు. పొట్టు తీసిన ముంజెలు, కొబ్బరినీళ్ళు, పంచదార మిక్సీపట్టి, ముందుగా నానబెట్టిన సబ్జా గింజలను కలిపి వేసవి తాపాన్ని తగ్గించే జ్యూస్‌.. పాలు, తాటి ముంజెలు, పంచదార మిక్సీపట్టి, దానిపై డ్రై ఫ్రూట్స్‌ పలుకులు గార్నిష్‌ చేస్తే మిల్క్‌షేక్‌.. సగ్గుబియ్యం, పాలు, సేమ్యా, పంచదారలతో పాయసం కాచి, చల్లారిన తరువాత ముంజెలను చిన్న ముక్కలుగా చేసి దానిలో కలిపి తీసుకుంటే ముంజెల ఖీర్‌.. మైదా, కార్న్‌ఫ్లోర్‌ల క్రీమ్‌లో తాటిముంజెల ముక్కలను డిప్‌చేసి, డీప్‌ ఫ్రై చేయాలి. వాటిని సుగర్‌ సిరప్‌లో నాననిస్తే ముంజెల స్వీట్‌.. బజ్జీ పిండిలో ముంజెలను డిప్‌ చేసి డీప్‌ఫ్రై చేస్తే ముంజెల బజ్జీ.. తాలింపులో ఉల్లిపాయ వేగిన తర్వాత ముంజెలను ముక్కలుచేసి వేయించితే కూర.. మరింత ప్రత్యేకంగా ముంజెల పైపొట్టుతోనూ కూర వండుకోవచ్చు. ఇలా ఇంటిలోనే ముంజెలతో రుచులు చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఆనందానికి ఆనందం..

  • ఎన్నెన్నో పోషకాలు..

తాటి ముంజెలలో విటమిన్స్‌, మినరల్స్‌, అనేక రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఎ, బి, సి విటమిన్లు, ఐరన్‌, జింక్‌, ఫాస్ఫరస్‌, పొటాషియం, క్యాల్షియం శరీరానికి చాలా అవసరం. వీటిలో తక్కువ క్యాలరీలు, ఎక్కువ శక్తినిచ్చే లక్షణాలు ఉంటాయి. ఎండాకాలంలో ఎన్ని నీళ్లు తాగినా దప్పిక తీరదు. ముంజెల్లో నీటి శాతం అధికంగా ఉండటం వల్ల వీటిని తింటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. వేసవిలో శరీరానికి కావాల్సిన మినరల్స్‌, చక్కెరలను ఇవి సమతుల్యం చేస్తాయి. శరీరాన్ని డీ హైడ్రేట్‌ అవకుండా కాపాడతాయి.

2
  • సహజ ఔషధం..

ముంజెలలో అధికంగా ఉండే పొటాషియం ఇన్సులిన్‌ ఉత్పత్తిని పెంచి, రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే లక్షణముంది. అందుకని మధుమేహ వ్యాధితో బాధపడే వారికి ఇది నేచురల్‌ మెడిసిన్‌ అని చెప్పవచ్చు. జీర్ణవ్యవస్థలో సమస్యలకు సహజ నివారణనిస్తాయి. ఎసిడిటీ, మలబద్ధకం, మూత్రవిసర్జన సాఫీగా ఉండేలా, అల్సర్ల నుండి ఉపశమనం కలిగిస్తాయి. తాటి ముంజెలు కాలేయ సంబంధ సమస్యల్ని, శరీరంలో ఉండే విషపదార్థాలను తొలగిస్తాయి. బరువును తగ్గిస్తాయి.
ముఖ్యంగా గర్భిణీలకు వచ్చే కడుపునొప్పి, వికారం, వాంతులు లాంటి సమస్యలను ముంజెలు తగ్గిస్తాయని చెబుతారు. చలువ చేసే లక్షణాలు ఉండటం వలన వేసవిలో వచ్చే చెమట పొక్కులు, దద్దుర్లు వంటి చర్మ సమస్యలను నివారిస్తాయి. ఇవి ఎక్స్‌పెక్టరెంట్‌ (దగ్గు సిరప్‌) గా కూడా ఉపయోగపడతాయి. తాటి ముంజెలు.. వివిధ రకాల ట్యూమర్స్‌, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ కణాలను అభివృద్ధి చేసే ఫైటోకెమికల్స్‌, ఆంథోసయనిన్‌ లాంటి వాటిని నిర్మూలిస్తాయి.

2
  • పొట్టుతోనే తినాలి..

చాలామంది ముంజెలపై పొట్టులాగా ఉండే దాన్ని తీసేసి తింటారు. కానీ ఆ పొట్టులోనే ఎన్నో రకాల పోషకాలున్నాయి. అలాగే ముంజెలు శరీరానికి ఎక్కువ చలువ చేస్తాయనే విషయంలోనూ ఈ పొట్టుదే ప్రధానపాత్ర. కాబట్టి తాటి ముంజెల్ని పొట్టుతోపాటే తింటే మంచిది.

4
  • జీవనోపాధిగానూ..

తాటికాయలు,ముంజెలు కొంతమందికి జీవనోపాధిని కలిపిస్తున్నాయి. జ్యూస్‌, షర్బత్‌, టోఫీ, బర్ఫీ, మిఠాయి, పెడా, పాయసం, ఖీర్‌లు చల్లగా వేసవిలో మంచి వ్యాపారంగా ఉంది. బజ్జీలాంటి స్నాక్స్‌ రూపంలోనూ మార్కెట్‌లో చోటు చేసుకున్నాయి. ఆవ రుచుల్లోనూ నిల్వ పెడుతున్నారు. ముంజెల వల్ల సైడ్‌ఎఫెక్ట్స్‌ గానీ, దుష్ప్రభావాలు గానీ ఉంటాయని ఎలాంటి అధ్యయనాలూ లేవు. కానీ ఇవి ఎక్కువగా తిన్నప్పుడు, ముదురువి తిన్నా.. కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంది.దీనికి విరుగుడు ముంజెలపై పొట్టుతో సహా తినడం ఒకటి. మరొకటి ఆవకాయలోని మామిడికాయ ముక్క తీసుకుంటే మంచిది.
మరి ఇన్ని ప్రయోజనాలున్న తాటి ముంజెలను నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకోవటం మంచిది కదా. మరింకెందుకు ఆలస్యం.. చల్లటి, తెల్లటి తాటి ముంజెలతో సూర్యుడి తాపం నుంచి ఉపశమనం పొందుదాం. చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకుందాం.