Jul 29,2023 22:23

వర్షంతో నిలిచిన ఆట
బార్బొడోస్‌: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేకు వర్షం అంతరాయం కలిగించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ నిలిచే సమయానికి భారతజట్టు 24.1ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 113పరుగులు చేసింది. టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాను ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌(55), శుభ్‌మన్‌ గిల్‌(34) తొలి వికెట్‌కు 90పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి నిష్క్రమణ తర్వాత టీమిండియా వరుసగా వికెట్లను కోల్పోయింది. సంజు శాంసన్‌(9), అక్షర్‌ పటేల్‌(1), కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా(7) సింగిల్‌ డిజిట్‌కే పెవీలియన్‌కు చేరారు. వర్షం కారణంగా మ్యాచ్‌ నిలిచే సమయానికి సూర్యకుమార్‌ యాదవ్‌(0) క్రీజ్‌లో ఉన్నాడు. మూడు వన్డేను దృష్టిలో ఉంచుకొని టీమిండియా మేనేజ్‌ మెంట్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లికి విశ్రాంతినిచ్చి.. సంజు శాంసన్‌, అక్షర్‌ పటేల్‌కు చోటు కల్పించింది.
రోహిత్‌, కోహ్లీకి విశ్రాంతి
మూడో వన్డేను దృష్టిలో ఉంచుకొని రెండో వన్డేకు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, సీనియర్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లికి విశ్రాంతినిచ్చినట్లు కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌ తెలిపాడు. దీంతో వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా బాధ్యతలు చేపట్టాడు. టాస్‌కు వచ్చిన పాండ్యా మాట్లాడుతూ.. టాస్‌ గెలిచినా.. తాము బ్యాటింగ్‌ తీసుకునేవాళ్లమని తెలిపాడు. 'ఈ పిచ్‌పై మేం ఎన్ని పరుగులు చేస్తామో చూడాలనుకుంటున్నాం. రోహిత్‌, కోహ్లీ తీరిక లేకుండా క్రికెట్‌ ఆడుతుండటంతో విశ్రాంతినిచ్చాం. జట్టులో ఉన్న కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కునేందుకు వారు ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నారు. మూడో వన్డేలో ఫ్రెష్‌గా బరిలోకి దిగుతారు. ఓ జట్టు 115 పరుగులకు ఆలౌట్‌ అయ్యిందంటే అందులో బౌలర్ల శ్రమ ఎంతో ఉందని అర్థం చేసుకోవాలి. తొలి వన్డేలో మా ఫీల్డర్లు అద్భుత క్యాచ్‌లను అందుకున్నారు. కానీ ఇంకా మెరుగుపడాల్సి ఉంది. చేజింగ్‌లో మేం ఐదు వికెట్లు కోల్పోవడం ఏమాత్రం ఆహ్వానించ తగినది కాదు. రెండు వికెట్లు కోల్పోయి చేధించాల్సిన లక్ష్యం అది' అని పాండ్యా తెలిపాడు.
ఇక వెస్టిండీస్‌ కెప్టెన్‌ షై హోప్‌ మాట్లాడుతూ.. పిచ్‌ కండిషన్స్‌ నేపథ్యంలోనే టాస్‌ గెలిచినా తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకున్నామని తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్‌ చేస్తాం. గత మ్యాచ్‌లో ఏం జరిగిందో చూశాం. పిచ్‌ కండిషన్స్‌ బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్నాయి. మాకు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే మాకు సిరీస్‌ గెలిచే అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఈ మ్యాచ్‌ ఫలితాన్ని ఊహించలేం. ఎందుకంటే ఇరుజట్లు ఒకే పిచ్‌పై ఆడబోతున్నాయి. మేం మా బౌలింగ్‌తో భారత్‌ను ఒత్తిడిలోకి నెడతాం' అని టాస్‌ సందర్భంగా షారు హోప్‌ చెప్పుకొచ్చాడు.