- పునరావాస కేంద్రాల్లో దీనస్థితిలో ముంపు మండలాల ప్రజలు
- తాగునీటికి కటకట
- నిత్యావసర సరుకులు ఇవ్వని ప్రభుత్వం
- దోమలతో కంటినిండా నిద్ర కరువు
ప్రజాశక్తి- కూనవరం, విఆర్.పురం, చింతూరు విలేకరులు (అల్లూరి సీతారామరాజు జిల్లా) : -పోలవరం నిర్వాసితుల కోసం అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం కోతులగుట్టలోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో అధికారులు పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడ కూనవరం, ఉదయభాస్కర్ కాలనీల వాసులు ఉంటున్నారు. కలెక్టర్ సుమిత్ కుమార్ పర్యటనకు వచ్చిన రోజు, ఆ తరువాత రోజు మాత్రమే తాగునీటి సౌకర్యం కల్పించారు. ఆ తరువాత వీరిని పట్టించుకున్న నాథుడు లేడు.
విఆర్.పురం మండలంలోని బాధితులకు రేఖపల్లిలోని గురుకుల పాఠశాల, కస్తూర్బా విద్యాలయం, అటవీ శాఖ కార్యాలయాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా చోట్లా కనీస సౌకర్యాలు మృగ్యంగానే ఉన్నాయి. వరద బాధితులకు నిత్యావసర సరుకులను ప్రభుత్వం పంపిణీ చేయడం లేదు.
ఇక్కడే కాదు... పలు పునరావాస కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. గతేడాది వరదల సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లే ప్రభుత్వం ఈసారీ తమను పట్టించుకోవడంలేదని పునరావాస కేంద్రాల్లోని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను పట్టించుకోండి మహాప్రభో అని వేడుకుంటున్నారు.
ఎగువున కురుస్తోన్న వర్షాలకు అటు గోదావరి, ఇటు శబరి వరద ప్రవాహం తగ్గుతూ, పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. కూనవరం, విఆర్.పురం, చింతూరు మండలాల్లోని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను మళ్లీ వరద భయం పట్టుకుంది. దీంతో, ఈ మండలాలకు చెందిన పలువురు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లారు. వీటిలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల తాగునీరూ సౌకర్యం కూడా లేదు. దోమలు స్వైరవిహారం చేస్తుండడంతో కంటినిండా కునుకులేకుండా ఉందని పునరావాస కేంద్రాల్లోని వారు వాపోయారు. విష పురుగులు, పాముల బెడద కూడా పొంచి ఉండడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చింతూరు మండల కేంద్రంలో 11 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ విద్యుత్, తాగునీరు సౌకర్యాలు ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ ఉంది. మంగళవారానికి కాస్త వరద తగ్గడంతో ఈ కేంద్రాల్లోని బాధితులు తిరిగి ఇళ్లకు వెళ్లారు. వారి సామాన్లు, ఇతర వస్తువులను మాత్రం పునరావాస కేంద్రాల్లోనే భద్రపరుచుకున్నారు. మిగిలిన మండలాల్లోని పునరావాస కేంద్రాల్లోని వారు అరకొర వసతుల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు.
ఏ సాయమూ అందలేదు
గోదావరికి వరద వస్తుందని అధికారులు మమ్మల్ని కోతులగుట్ట పునరావాస కేంద్రానికి తరలిం చారు. ఇక్కడ కలెక్టర్ సుమిత్ కుమార్ వచ్చిన రోజు, ఆ మరుసటి రోజు మాత్రమే మంచినీటి సదుపాయం కల్పించారు. నాలుగు రోజుల నుంచి మావైపు ఎవ్వరూ కన్నెత్తి చూడలేదు. కష్టాల్లో ఉన్న మాకు నిత్యావసర సరుకులు ఇవ్వడం లేదు.
- గద్దల వెంకటేష్,
ఉదయ భాస్కర్ కాలనీ, కూనవరం
ఈ కష్టాలు ఇంకెన్నాళ్లో..
మేం ఇంటి నుంచి తెచ్చుకున్న వాటితోనే జీవనం సాగిస్తున్నాం. ఏటా ఇలా గోదావరి మమ్మల్ని ముంచేస్తుంటే భయమేస్తోంది. ఈ కష్టాలు మాకు ఇంకెన్నాళ్లో అర్థం కావడం లేదు. పునరావాస కేంద్రంలో తినేందుకు కూడా మా వద్ద ఏమీ లేవు. ప్రభుత్వం, అధికారులు స్పందించి నిత్యావసరాలు ఇవ్వాలి.
- నాచుపల్లి వీరబాబు, కూనవరం
పచ్చళ్లతోనే కాలం గడుపుతున్నాం
ఆరు రోజుల నుంచి మాకు సాయం చేసే వారే కరువయ్యారు. మా వద్ద నిత్యావసర సరుకులు లేవు. కూరగాయలు కొందామంటే ధరలు ఆకాశాన్ని ఎక్కి కూర్చున్నాయి. మేము తెచ్చుకున్న ఊరగాయ, పచ్చళ్లతోనే కాలం గడుపుతున్నాం. నిత్యావసరాలు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. మంచినీటి సదుపాయం కూడా లేదు.
- ఎడ్ల మాణిక్యం, కూనవరం










