Oct 27,2023 20:56

ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి:నెల్లూరు జిల్లా సైదాపురంలో సాగుతోన్న మైనింగ్‌ అక్రమ దందా వ్యవహారంలో నిజాలు నిగ్గుతేల్చడానికి టిడిపి నేతలు శుక్రవారం చలో సైదాపురానికి సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ పార్టీ ముఖ్యనేతలను ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. సంతపేటలోని తన నివాసం నుంచి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి బయలుదేరడానికి సిద్ధమవ్వగా భారీ సంఖ్యలో పోలీసులు అక్కడి చేరుకుని ఆయనన్ను అడ్డుకున్నారు. తాను వివాహానికి వెళ్లాలని, బయటకు వెళ్లడానికి అనుమతించాలని పోలీసులను ఆనం కోరారు. పోలీసులు అనుమతించకపోవడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులు చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల కళ్లుకప్పి నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన వాహనంలో సైదాపురం చేరుకున్నారు. మార్గమధ్యలో లారీల్లో నెల్లూరుకు తరలిస్తున్న హిటాచీలను పరిశీలించి, లారీ డ్రైవర్లను ఆరా తీశారు. సైదాపురం మండలం, తుమ్మలతలుపూరుకు టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి తదితరులు చేరుకుని, పరిశీలించారు. మీడియాలో రాసిన విధంగా సైదాపురంలో రూ. వేలకోట్ల అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ప్రతి రోజూ రూ.10 కోట్ల విలువైన తెల్లరాయి తరలిపోతుందని, ప్రభుత్వానికి ఎలాంటి లీజు చెల్లించకుండా అక్రమంగా మైనింగ్‌ను దోచేస్తున్న పట్టించుకోవడం లేదని విమర్శించారు.