Aug 20,2023 12:29

థ్రిల్లర్‌ సినిమాల పట్ల ఈ మధ్య ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రైమ్‌ థ్రిల్లర్‌తో వచ్చిన 'పోర్‌ తొళిల్‌' చిత్రం ఆద్యంతం ఉత్కంఠభరితంగా రెండున్నర గంటల పాటు వినోదాన్ని అందించింది. తమిళంలో వచ్చిన ఈ చిత్రం భారీ విజయం అందుకుంది. దాంతో అన్ని భాషల్లో (ఆగస్టు 11) సోనీ లివ్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ అయ్యింది. ఇటువంటి థ్రిల్లింగ్‌ సినిమాలు తెలుగులో చాలా వచ్చాయి. అయినా కథనం కొత్తగా, తెరమీదకి ఎక్కించడంలో దర్శకుడు విఘ్నేష్‌ రాజా జాగ్రత్తలు తీసుకున్నారు. శరత్‌కుమార్‌, అశోక్‌ సెల్వన్‌, నిఖిలా విమల్‌ కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రం కథ ఏంటీ? ఎలా ఉందో తెలుసుకుందాం.

/Suspense-throughout

నటీనటులు :శరత్‌కుమార్‌, అశోక్‌ సెల్వన్‌, నిఖిలా విమల్‌, పి.ఎల్‌. తెన్నప్పన్‌, నిళల్‌ రవి, శరత్‌బాబు, తదితరులు.
దర్శకత్వం : విఘ్నేష్‌ రాజా
సంగీతం : జేక్స్‌ బిజోయ్
నిర్మాత : సమీర్‌ నాయర్‌, దీపక్‌ సెగల్‌, ముఖేశ్‌ ఆర్‌. మెహతా, సీవీ శరత్‌, పూనమ్‌ మెహ్రా,
సందీప్‌ మెహ్రా
రచన : విఘ్నేష్‌ రాజా, ఆల్ఫ్రైడ్‌ ప్రకాశ్‌
స్ట్రీమింగ్‌ వేదిక : సోనీలివ్‌

కథలోకి వెళితే ... డిషనల్‌ డీజీపీ మహేంద్రన్‌ ఆదేశాల మేరకు ఎస్పీ లోకనాథన్‌్‌ (శరత్‌కుమార్‌) వద్ద డీఎస్పీ ట్రైనీగా పనిచేసేందుకు వస్తాడు ప్రకాశ్‌ (అశోక్‌ సెల్వన్‌). అతడితో పాటు టెక్నికల్‌ అసిస్టెంట్‌ వీణ (నిఖిలా విమల్‌) కూడా వస్తుంది. తిరుచ్చిలో ఓ యువతి హత్య జరుగుతుంది. ఈ కేసును వీరు విచారణ చేస్తుండగా వరుసగా మరికొన్ని హత్యలు జరుగుతుంటాయి. మొదట మృతి చెందిన యువతితో పాటు, ఈ హత్యల వెనుక ఉన్నది ఎవరు? అందుకు కారణాలు ఏంటి? కనుక్కునే పనిలో ఉంటారు. ఈ క్రమంలో లోకనాథన్‌, ప్రకాశ్‌, వీణలకు ఎదురైన పరిస్థితులు ఏంటి? కేసుని ఎలా ఛేదించారు? హంతకుడు ఎలా కనిపెట్టారు తెలియాలంటే సినిమా చూడాల్సిందే !
          సాధారణంగా క్రైమ్‌, ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్స్‌ అంటే ప్రేక్షకుడు ఊహించని మలుపులతో కథనాలు సాగుతాయి. నేరానికి కారకుడైన వ్యక్తి ఎవరో చివరి వరకూ తెలియకుండా సాగే కథలు ప్రేక్షకుడిని అలరిస్తాయి. అలాంటి కోవలోకి చెందిందే 'పోర్‌ తొళిల్‌'. కానీ, దర్శకుడు విఘ్నేష్‌ రాజా ఎంచుకున్న విధానం కొత్తగా ఉంది. చివరి వరకూ ఆ 'వ్యక్తి' ఇతనే అయ్యి ఉంటాడు అని ప్రేక్షకుడిలో అనుమానం కలిగించి, అంతలోనే మరో వ్యక్తిని అనుమానించేలా సీన్లు క్రియేట్‌ చేశారు. నిత్యం ఉత్కంఠతో మలిచిన సన్నివేశాలు ప్రేక్షకుడు ఊహకు అందనివి. ఒక ట్విస్టు తర్వాత మరొక ట్విస్టు ఉంటుంది. దాంతో ప్రేక్షకుడు సినిమాకు బాగా కనెక్టు అవుతాడు. అక్కడే సినిమా విజయం సాధించింది.
           ఒకవైపు లోకనాథన్‌, ప్రకాశ్‌ ఇన్వెస్టిగేషన్‌, వరుస హత్యలు ఎక్కడా కన్ఫ్యూజన్‌ లేకుండా సన్నివేశాలు ప్రేక్షకుడికి సులభంగా అర్థమవుతాయి. ఎందుకంటే ప్రకాశ్‌కు ఎస్పీ లోకనాథన్‌ ఫీల్డ్‌ ట్రైనింగ్‌, హత్య ఎలా జరిగిందో వివరిస్తూ ఉంటారు. దాంతో ప్రేక్షకుడే క్రైమ్‌ సీన్‌లో ఉండి, వాటిని నేరుగా చూస్తున్న భావన కలుగుతుంది. అదే సమయంలో ప్రకాశ్‌ అమాయకత్వాన్ని కొన్ని సందర్భాల్లో హాస్యాన్ని కలిగిస్తాయి. పిల్లలపై తల్లిదండ్రుల ఆధిపత్యం, భార్యభర్తల మధ్య గొడవలు, ఒక కుటుంబ సభ్యుడిని హీనంగా చూడటం వంటి అంశాలు.. ఓ మనిషి మానసిక స్థితిని ఎలా మార్చుతాయో దర్శకుడు 'పోర్‌ తొళిల్‌' చిత్రం ద్వారా చెప్పాలనుకున్నారు.
          సైకో థ్రిల్లర్స్‌ అలా ఎందుకు అలా మారారు, దాని వెనుక కారణాలేంటనే విషయాలను కూడా వివరించారు. ఎస్పీ లోకనాథన్‌గా శరత్‌కుమార్‌ నటన బాగుంది. ట్రైనీ డీఎస్పీ ప్రకాశ్‌ పాత్రలో అశోక్‌ సెల్వన్‌ చక్కగా సరిపోయారు. సీరియస్‌గా సాగే కథలో కాస్త హాస్యాన్ని పంచేది ఆయన పాత్రే. వీణగా నిఖిలా విమల్‌ తన పాత్రకు న్యాయం చేశారు. కెన్నడీగా శరత్‌బాబు పాత్రను ఎవరూ ఊహించరు. ఆయన చనిపోయే ముందు నటించిన చివరి చిత్రాల్లో ఇదీ ఒకటి. రచయిత ఆల్ఫ్రైడ్‌ ప్రకాశ్‌, దర్శకుడు విఘ్నేష్‌ రాజా కథను తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది.