ఈ మధ్యకాలంలో సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ చిత్రాలు వరుసగా విడుదలవుతున్నాయి. ఈ తరహా కథలకు ప్రేక్షకుల క్రేజ్ కూడా ఎక్కువే. దీంతో కొత్త దర్శకులకు ఇదో సక్సెస్ ఫార్ములా అయ్యింది. పైగా వీటికి తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ ఆదరణ ఉండడంతో ఎక్కువగా తెరకెక్కుతున్నాయి. తాజాగా ఇదే జానర్‌లో 'అశ్విన్స్'అనే చిత్రం తెరకెక్కింది. అయితే ఈ చిత్రం కథేంటి? ప్రేక్షకులకు ఏ మేరకు చేరువైంది? ఎలా ఉంది? తెలుసుకుందాం..!

టైటిల్ : అశ్విన్స్
నటీనటులు : సంత్ రవి, విమలా రామన్, మురళీధరన్, సిమ్రాన్ పరీక్, ఉదయ దీప్, సరస్వతి మీనన్ తదితరులు
నిర్మాణ సంస్థ : శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
నిర్మాత : బివిఎస్‌ఎన్ ప్రసాద్
దర్శకత్వం : తరుణ్ తేజ
సంగీతం : విజయ సిద్ధార్థ్
కథలోకెళ్తే... ఓ ఐదుగురు యూట్యూబర్స్ డార్క్ టూరిజం మీద ఓ ఎపిసోడ్ చిత్రీకరించాలని నిర్ణయించుకుంటారు. ఇందుకోసం యూట్యూబ్ ఛానెల్ నడిపే అర్జున్ (వసంత్ రవి), రీతు, రాహుల్, గ్రేస్, వరుణ్ ఎపిసోడ్ కోసం లండన్‌లోని ఓ దీవిలో ఉన్న భవంతికి వెళ్తారు. అక్కడ ప్రముఖ ఆర్కియాలజిస్ట ఆర్తి రాజగోపాల్ (విమలా రామన్) ఆత్మ తిరుగుతుందని, గతంలో అక్కడికి వెళ్లిన ఓ 15 మందిని ఆమే చంపేసిందనే ప్రచారం ఉంటుంది. విషయం తెలుసుకున్న అర్జున్ టీమ్ ఆ భవంతిలో సంచరించే ఆత్మలను, అరుపులను తమ కెమెరాలో బంధించాలని ప్రయత్నిస్తారు. అలా వెళ్లిన ఐదుగురికి భవంతిలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? తనవాళ్లను కాపాడుకోవడానికి అర్జున్ చేసిన సాహసం ఏంటి? ఆర్కియాలజిస్ట్ ఆర్తి రాజగోపాల్ ఎలా చనిపోయింది? వంటి ప్రశ్నలకు సమాధానమే 'ఆశ్విన్స్' కథ..!
ప్రతి ఒక్కరిలోనూ మంచి, చెడు అనే రెండు కోణాలుంటాయి. బుద్ధి మంచి వైపు వెళదామని చెబితే... మనసు మాత్ర చెడు వైపు చూయిస్తుంది. ఎంతో నిగ్రహంతో మన మనసుని మార్చుకొని బుద్దితో మంచి వైపు ప్రయాణిస్తే అంతా బాగుంటుంది. మంచి.. చెడు ఈ రెండింటినీ కంట్రోల్ చేసే శక్తి మనిషికి మాత్రమే ఉంటుందనే సందేశాన్ని ఈ సినిమా ద్వారా చూపించారు దర్శకుడు తరుణ్ తేజ. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉంది. కానీ దానిని తెరపై చూపించడంలోనే కాస్త తడబడ్డాడు. కథను మొత్తం ఐదు చాప్టర్లలో చెప్పాడు. (టూ డెత్స్, టూ వాయిసెస్, టూ కర్సెస్, ది మైండ్ ఆఫ్ టూ వరల్డ్స్, ది వరల్డ్ ఆఫ్ టూ మైండ్స్). రైతు, ఇద్దరు కుమారులు చనిపోవడం.. అశ్వినీదేవతలు ప్రత్యేక్షమై వరం ఇవ్వడం.. రాక్షస ఆత్మ, ఆశ్వినీ దేవతలు ఇచ్చిన రెండు బొమ్మల్లో ఒకదానిని దొంగిలించి.. భూమి మీదకు రావడం..ఇలా ఇంట్రెస్టింగ్ స్టోరీతో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కథంతా రొటీన్ హారర్ చిత్రాల్లాగే సాగుతుంది. ఫస్టాఫ్‌లో కథ పెద్దగా లేకపోయినా.. విచిత్రమైన సౌండ్లతో ప్రేక్షకులను భయపెట్టడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఇక సెకండాఫ్‌లో ఆర్కియాలజిస్ట్ ఆర్తి రాజగోపాల్(విమలా రామన్)నేపథ్యంతో అసలు సినిమా స్వభావం ఏంతో తెలిసిపోతుంది. ఫస్టాఫ్ మొత్తం ప్రేక్షకులను భయపెట్టడం మీదే దృష్టిపెట్టిన దర్శకుడు.. సెకండాఫ్‌లో అసలు కథను వెల్లడించి థ్రిల్లింగ్‌కు గురి చేశాడు. అయితే ఫస్టాఫ్‌లో కొన్ని సాగదీత సీన్స్ ఇబ్బందిగా అనిపిస్తాయి. అయితే మొత్తంగా చూసుకుంటే ప్రేక్షకులను భయపెట్టడంతో పాటు ఓ మంచి సందేశాన్ని అందించారు.
అర్జున్ పాత్రలో వసంత్ రవి ఒదిగిపోయాడు. రెండు విభిన్న పాత్రల్లో కనిపించి ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించాడు. ఆర్కియాలజిస్ట్ ఆర్తి రాజగోపాల్‌గా విమలా రామన్ చక్కగా నటించి మెప్పించింది. మిగిలిన వారు పాత్రల పరిధిమేర నటించారు. చిత్రానికి ప్రధాన బలం విజరు సిద్ధార్థ్ అందించిన బిజిఎం. తనదైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఆడియన్స్‌ని భయపెట్టాడు. ఎ.ఎం.ఎడ్విన్ సాకే సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ వెంకట్రాజన్ కత్తెరకు పని చెప్పాల్సింది.










