Apr 16,2023 08:46

ఓటీటీ వేదికల పుణ్యమా ప్రేక్షకులకు అన్ని భాషల చిత్రాలూ అందుబాటులోకి వచ్చేశాయి. వాటిలో కొన్ని తెలుగులోనూ డబ్‌ అవుతున్నాయి. అలా ఇటీవల విడుదలై మంచి విజయం సాధించిద తెలుగులో అనువాదమైన మళయాళ చిత్రమే 'ది మేల్‌ ఘోస్ట్‌' (పురుష ప్రేతమ్‌). 'జయ జయ జయ హే' చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైన నటి దర్శన్‌ రాజేంద్రన్‌. తాజాగా ఆమె ప్రధానపాత్ర పోషించిన చిత్రం 'ది మేల్‌ ఘోస్ట్‌'. ఇన్వెస్టిగేటివ్‌, సస్పెన్స్‌ డ్రామాతోపాటు కామెడీ జోనర్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయం సాధించింది. థియేటర్లలో విడుదలైన నెలకు ఓటీటీలో విడుదలైంది. ఈ చిత్రం కథేంటి? ప్రేక్షకులకు ఏ మేరకు చేరువైందో తెలుసుకుందాం..!
కథలోకి వెళ్తే.. సెబాస్టియన్‌ (అలేగ్జాండర్‌ ప్రశాంత్‌) ఒక సాధారణ ఎస్సై. కానీ అతనికి పోలీసు డిపార్ట్‌మెంట్‌లో సూపర్‌ సెబాస్టియన్‌ అని పేరు. ఎందుకంటే మిగతా పోలీసుల లాగా కాకుండా దేనికీ భయపడకుండా యాక్షన్‌ అడ్వెంచర్స్‌ చేసే సూపర్‌ కాప్‌గా సెల్ఫ్‌ డబ్బా కొట్టుకుంటూ ఉంటాడు. అనారోగ్యంతో ఉన్న అతని తల్లి సెబాస్టియన్‌ను ఎప్పుడూ తిడుతూనే ఉంటుంది. ఇలా సెల్ఫ్‌ డబ్బా కొట్టుకుంటూ.. ప్రతిరోజూ తల్లి చేత తిట్లు తినుకుంటూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో సెబాస్టియన్‌ స్టేషన్‌ పరిధిలో ఉండే కాలువలో ఓ రోజు ఒక పురుషుని శవం కొట్టుకొస్తుంది. దీంతో శవానికి పోస్టుమార్టం నిర్వహించి, దాన్ని బంధువులకు అప్పగించేందుకు సంబంధిత బంధువుల కోసం ఎదురుచూస్తుంటాడు. ఈ క్రమంలోనే ఆ శవం తన భర్తదని సూసన్న (దర్శన రాజేంద్రన్‌) పోలీసుస్టేషన్‌లోకి అడుగుపెడుతుంది. అయితే అసలు ఈ సూసన్న ఎవరు? తాను చెప్పినట్లుగా కాలువలో కొట్టుకొచ్చిన శవం ఆమె భర్తదేనా? సూసన్న వల్ల ఎస్సై సెబాస్టియన్‌ ఎందుకు సస్పెండ్‌ అయ్యాడు? దీనికి గల కారణాలేంటి? కాలువలో కొట్టుకొచ్చిన శవం ఎవరిది? ఈ విషయాన్ని సెబాస్టియిన్‌ కనుక్కున్నాడా? అసలు సూసన్న భర్తకు ఏమైంది? నిజం తెలుసుకున్న సెబాస్టియన్‌కు చివరికి ఎలాంటి పరిస్థితి ఎదురైంది? అనేదే మిగతా కథ.
సాధారణంగా చాలాచోట్ల కాలువల్లో, బ్రిడ్జీల కింద, పలుచోట్ల గుర్తు తెలియని శవాలను పోలీసులు కనుక్కుంటూ ఉంటారు. అయితే ఆ శవాలకు సంబంధించిన బంధువులు, కుటుంబీకులు ఎవరైన వచ్చి ఆ శవాలను క్లేయిమ్‌ చేసుకుంటారేమో అని పోలీసులు ఎదురు చూస్తుంటారు. అలాగే మిస్సింగ్‌ కేసులనూ పరిశీలిస్తారు. అయితే ఒక్కోసారి ఇలా అనాథ శవాల సంఖ్య పెరిగి, ప్రభుత్వ ఆస్పత్రుల్లోని మార్చురీలో కేటాయించే స్థలం సరిపోదు. అయితే శవాలకు సంబంధించినవారు ఎవరూ రాని క్రమంలో కేసు డీటెయిల్స్‌తో వాటిని ఒక స్మశానంలో పూడ్చిపెడతారు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వర్షాల కారణంగా అవి మిస్‌ ప్లేస్‌ అవుతుంటాయి. సరిగ్గా ఈ పాయింట్‌తోనే ఈ సినిమాను ఒక ఇన్వేస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా రూపొందించారు దర్శకుడు. మలయాళం చిత్రాలు ఎప్పుడూ డిఫరెంట్‌గా ఉంటాయని మరోసారి ఈ 'ది మేల్‌ ఘోస్ట్‌' చిత్రం ద్వారా నిరూపించారు. తమ ఆలోచనలతో ఒక బెంచ్‌ మార్క్‌ క్రియేట్‌ చేశారు. తెలుగు సినిమాల్లో పోలీసు హీరోలకు భిన్నంగా పొట్ట, బట్టతలతో ఎప్పుడు సెల్ఫ్‌ డబ్బా కొట్టుకునే సాధారణ ఎస్సైగా హీరో కనిపించే విధానం ఆకట్టుకుంటుంది. సినిమా టైటిల్‌ పడేంత వరకూ అతనే హీరో అన్న విషయం ప్రేక్షకులకు అర్థం కానంతగా చూపించడం విశేషం. ఈ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌లో చివరి వరకూ సస్పెన్స్‌ను క్యారీ చేయడమే కాకుండా సరికొత్త పంథాలో కామెడీని జోడించారు. ఈ ప్రయోగం పూర్తిగా సక్సెస్‌ అయిందనే చెప్పవచ్చు. ఇందులో హీరో, కమెడియన్‌ అంతా సూపర్‌ కాప్‌ సెబాస్టియనే. శవాలు కొట్టుకొస్తే తమ పరిధిలోకే వస్తాయా లేదా అని పోలీసులు చూసే విధానం నవ్వు తెప్పించడమే కాకుండా వాస్తవ సంఘటనలకు అద్దం పడుతుంది. తమ విధులు నిర్వహిస్తూ.. పర్సనల్‌ లైఫ్‌ ఎంజారు చేయాలనుకునే క్రమంలో పోలీసులు చేసే తప్పులు వారిని ఎలాంటి ఇబ్బందులకు గురిచేస్తాయో చక్కగా చూపించారు. తన భర్తదే ఆ శవమంటూ సూసన్‌ రావడంతో కథలో మరింత ఆసక్తి నెలకొంటుంది.
సూపర్‌ సెబాస్టియన్‌గా అలేగ్జాండర్‌ ప్రశాంత్‌ నటన అద్భుతం అని చెప్పొచ్చు. నటన, ఎక్స్‌ప్రెషన్స్‌ అన్నీ సమపాళ్లల్లో చూపించి, అదరగొట్టారు. దర్శన రాజేంద్రన్‌ తన నటనతో ఎంతో ఆకట్టుకున్నారు. డైలాగ్స్‌ ఎక్కువగా లేకుండా కేవలం తన కళ్లతోనే హావాభావాలను పలికించి, ఆశ్చర్యానికి గురిచేశారు. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సినిమాకు మరో ప్రధాన హైలెట్‌ బీజీఎమ్‌. అజ్మల్‌ హస్బుల్లా ఇచ్చిన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ఎప్పుడూ వినని విధంగా విభిన్నంగా ఉంది. సస్పెన్స్‌, డ్రామాతోపాటు మంచి ఫన్‌ జెనరేట్‌ అయ్యేలా ఇచ్చారు. సినిమాటోగ్రఫీ, స్క్రీన్‌ ప్లే ఫర్వాలేదు. ఇక ఫైనల్‌ ఈ కథ రొటీన్‌కి భిన్నమైన సినిమా చూడాలనుకునే వారిని ఆకట్టుకుంటుంది.

టైటిల్‌: ది మేల్‌ ఘోస్ట్‌ (మలయాళం)
నటీనటులు: అలేగ్జాండర్‌ ప్రశాంత్‌, దర్శన రాజేంద్రన్‌, జగదీష్‌, జింజ్‌ షాన్‌, మాల పార్వతీ తదితరులు
సినిమాటోగ్రఫీ: క్రిషంద్‌
దర్శకత్వం: క్రిషంద్‌
కథ: మను తోడపుళ
స్క్రీన్‌ ప్లే: అజిత్‌ హరిదాస్‌
సంగీతం: అజ్మల్‌ హస్బుల్లా
సమర్పణ: జియో బేబీ
ఓటీటీ వేదిక: సోనీ లివ్‌