న్యూఢిల్లీ : బీహార్ ప్రభుత్వం నిర్వహించిన కుల గణన చట్టబద్దతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఈ నెల 6న విచారిస్తామని సుప్రీంకోర్టు మంగళవారం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తరపున ఈ కేసులో హాజరవుతున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. ఈ నెల 6న విచారణకు లిస్ట్ చేయబడినట్లు పేర్కొంది. ఈ సర్వే చట్టబద్దతను సమర్థిస్తూ పాట్నా హైకోర్టు ఆగస్టు 1న తీర్పు ఇచ్చింది. దీంతో పిటీషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కుల గణన చేసే అధికారం రాష్ట్రానికి లేదని, ఇది కేంద్రం అధికారాలను లాక్కునే ప్రయత్నమని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. జనగణన చట్టం 1948ను ఉల్లంఘించడమేనని వాదించారు. ఈ సర్వే ద్వారా సేకరించిన డేటాను అప్‌లోడ్ చేయడం, సర్వే నివేదికను వెల్లడించకుండా ఉండటంపై స్టే విధించడానికి గత విచారణలో సుప్రీంకోర్టు తిరస్కరించింది.










