న్యూఢిల్లీ : రమ్మీ వంటి ఆన్‌లైన్ ఆటలపై పన్ను వేయడానికి లేదని, బెట్టింగ్, జూదం మాదిరిగా ఈ ఆటలు జిఎస్‌టి చట్టం పరిధిలోకి రావంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం గురువారం స్టే విధించింది. జిఎస్‌టి డైరెక్టరేట్ జనరల్ వేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ విచారణ జరిపి, ఆన్‌లైన్ గేమింగ్ సంస్థ అయిన గేమ్‌స్కర్ట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా ఆ సంస్థకు గడువు ఇచ్చింది. అక్టోబరులో విచారించడానికి ఈ కేసును వాయిదా వేసింది. కంపెనీ జూదానికి పాల్పడుతోందని, ఆన్‌లైన్ గేమ్ ఆడేందుకు ప్లేయర్లు చెల్లించే మొత్తంపై 28శాతం జిఎస్‌టిని చెల్లించకుండా కంపెనీ ఎగవేసిందని పేర్కొంటూ గతేడాది సెప్టెంబరు 23న కంపెనీకి జిఎస్‌టి డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. రూ.21వేల కోట్లు జిఎస్‌టిని కంపెనీ ఎగ్గొంటిందని పేర్కొంది. దీనిపై ఆ కంపెనీ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. రమ్మీ అనేది నైపుణ్యంతో కూడిన ఆట అయినందున దాన్ని జూదం, బెట్టింగ్ నిర్వచనం పరిధిలోకి తీసుకురాలేమని హైకోర్టు పేర్కొంది.










