Oct 24,2023 21:50

చిలమత్తూరులో కొనసాగుతున్న పేదల భూపోరాటం
ప్రజాశక్తి-చిలమత్తూరు (శ్రీ సత్యసాయి జిల్లా):శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండం కోడూరు 805లో సిపిఎం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పేదలు చేపట్టిన భూ స్వాధీన పోరాటం పండుగ రోజునా కొనసాగింది. గత 40 రోజులుగా పేదలు వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా సోమ, మంగళవారాల్లో దసర వేడుకలను భూ స్వాధీన స్థలంలోనే నిర్వహించారు. భిన్నత్వంలో ఏకత్వం ఉట్టిపడేలా హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు దసరా పండగును వారు వేసుకున్న గుడిసెల స్థలంలోనే మంగళవారం జరుపుకున్నారు. అక్కడే వంటావార్పు చేసుకుని సహఫంక్తి భోజనాలు చేశారు. చిన్నారులతో కలిసి ఆటపాటలు, నృత్యాలు నిర్వహించారు. తొలుత లేఅవుట్‌లో సిపిఎం జెండాను ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎం ఇంతియాజ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిలమత్తూరులో ఇళ్ల స్థలాల కోసం పేదలు చేస్తున్న పోరాటం జిల్లాకే ఆదర్శమన్నారు. విజయదశమి అంటే రాక్షసులపై ప్రజల విజయమని, అలాంటి రోజున పోరాట స్ఫూర్తితో ఎర్రజెండాను ఎగరవేయడం అభినందనీయమని తెలిపారు. పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సమిష్టి జీవనం.. సమిష్టి కృషితో ఇళ్ల పట్టాలను సాధించేలా పోరాటం కొనసాగిస్తామని ఇళ్ల స్థలాల సాధన సమితి కార్యదర్శి చందు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యకాసం జిల్లా కార్యదర్శి పెద్దన్న, అధ్యక్షుడు ఫిరంగి ప్రవీణ్‌ కుమార్‌, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి ఎంవి రమణ, సిపిఎం మండల కార్యదర్శి వెంకటేష్‌ పాల్గొన్నారు.