విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారానికి... పోరాటమే ఏకైక మార్గం : 'ప్రజాశక్తి'తో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు
ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : 'విద్యుత్ రంగానికి ఎంత ప్రాధాన్యత ఉందో అంత ఎక్కువగా సమస్యలూ అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్నారు. సమస్యలు పరిష్కారం కావాలంటే పోరాటమే ఏకైక మార్గం' అని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు తెలిపారు. ఆగస్టు పది నుంచి విద్యుత్ రంగ కార్మికులు సమ్మెలోకి వెళ్లనున్న నేపథ్యంలో ఆయన 'ప్రజాశక్తి'తో మాట్లాడారు.
ప్రజాశక్తి : విద్యుత్ రంగంలో ప్రధానమైన ప్రమాదం ఏంటి ?
సిహెచ్ నర్సింగరావు : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ రంగాన్ని ప్రయివేట్, కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఉత్పత్తి, సరఫరా, పంపిణీ... ఈ మూడు విభాగాలను ఒక్కొక్కటిగా అమ్మేందుకు పూనుకుంటున్నారు. కేంద్రం 2022లో తీసుకొచ్చిన విద్యుత్ సవరణ బిల్లు ఇందులో భాగమే. ఇలాంటి పరిస్థితుల్లో సంస్థలు, కార్మికుల సంక్షేమాన్ని, హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది.
ప్రజాశక్తి : సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమానికి జెఎసి ఉద్యమిస్తుందా ?
సిహెచ్ నర్సింగరావు : జెఎసి ఆ పని చేయడం లేదు. విద్యుత్ కార్మికులకు పిఆర్‌సి అమలు చేయడంలో విఫలమైంది. మూడు శాతం ఫిట్‌మెంట్‌తో సరిపెట్టుకుంది. పిఆర్‌సి ప్రకటించకుండా యాజమాన్యం కార్మికులను అవహేళన చేస్తున్నా జెఎసి పట్టించుకోలేదు.
ప్రజాశక్తి : జెఎసి నుంచి సిఐటియు ఎందుకు బయటకొచ్చింది ?
సిహెచ్ నర్సింగరావు : జెఎసిపై నమ్మకం లేకనే సిఐటియుగా మేం బయటకు వచ్చాం. ఎఐటియుసి కూడా మాతోనే ఉంది. జెఎసితో ఉంటే న్యాయం జరగదన్న ఉద్దేశంతోనే ఎలక్ట్రిసిటీలోని సిఐటియు రాష్ట్ర నాయకులు సూరిబాబు రాజీనామా చేసి వచ్చేశారు. సిఐటియు, ఎఐటియుసి కలిసి మొత్తం ఏడు సంఘాలతో పోరాట కమిటీ ఏర్పడింది. ఈ నెల 25న విజయవాడలో రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఎపి విద్యుత్ ట్రేడ్ యూనియన్ పోరాట కమిటీగా ఏర్పాటయ్యాం. ఈ సమావేశానికి ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేశు, సిఐటియు నుంచి నేను హాజరయ్యాం. ఆగస్టు పది నుంచి విద్యుత్ రంగంలో పనిచేస్తున్న 60 వేల మంది పర్మినెంట్, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికుల నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చాం.
ప్రజాశక్తి : జెఎసి మీతో కలిసి వస్తుందా ?
సిహెచ్ నర్సింగరావు : పోరాట కమిటీ ఏర్పడి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో జెఎసి కూడా నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చింది. ఇది పోరాట కమిటీ తొలి విజయం. అందరినీ కలుపుకుని ఐక్య కార్యాచరణ చేపడతాం. ఏడాది కాలంగా జెఎసితో కలిసి ఉన్నాం. అయినా, వారు ఏ పోరాటానికీ పిలుపు ఇవ్వలేదు. కాంట్రాక్టు కార్మికుల సమస్య ఏనాడూ చర్చించలేదు. తెలంగాణలో కాంట్రాక్టు కార్మికులకు రూ.41 వేల జీతం కాగా, ఆంధ్రాలో వారికి రూ.20 వేలే జీతంగా ఇస్తున్నారు. మొత్తం 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు.
ప్రజాశక్తి : పోరాట కమిటీ డిమాండ్లకు ప్రభుత్వం దిగి వస్తుందా ?
సిహెచ్ నర్సింగరావు : పోరాట కమిటీ ఐక్యంగా ఉద్యమిస్తుంది. ఈ నిరవధిక సమ్మెలో పోరాట కమిటీ అగ్రభాగాన ఉంటుంది. జెఎసి కడవరకూ మాతో వస్తుందో? లేదో? వేచి చూడాల్సిందే. కార్మికులు మాత్రం పోరాట కమిటీవైపే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదు. కార్మిక పోరాటానికి ఏ ప్రభుత్వమైనా దిగిరాక తప్పదు. విద్యుత్ కార్మికులు గతంలో అనేక పోరాటాలు చేశారు. ఎన్నో విజయాలు సాధించారు. ప్రభుత్వం నిర్బంధం, పనిభారం పెంచింది. దీంతో, కార్మికులు ప్రభుత్వం పట్ల చాలా కోపంతో ఉన్నారు.










