Jul 17,2022 15:31

సాధారణంగా కథలు, నవలల్లో సమాజంలో ఉన్నటువంటు లోపాలు, ఘర్షణలు, హెచ్చుతగ్గులు, నైరాశ్యం, నిస్పృహ, వ్యక్తుల మీద చూపే ప్రభావాలు దాని ఫలితంగా మానవ సంబంధాల్లో తలెత్తే సంఘర్షణలు ప్రతిఫలిస్తాయి. జీవితానుభవాల్లో ప్రతికూలతలు, అననుకూలతలు మాత్రమే కాకుండా కొన్ని సానుకూలంగానూ ఉంటాయి. హృద్యమైన సమయాలుంటాయి. సరససల్లాప సంభాషణలుంటాయి. ఉల్లాసభరితమైనవి, హాయిగా నవ్వుకునే క్షణాలుంటాయి. ఈ రకంగా ఈ పుస్తకంలోని 30 కథలూ నాణేనికి ఆ మరోవైపుని సున్నితంగా, సహజంగా చూపిస్తాయి.
సాహిత్య ప్రక్రియ ఏదైనా కావొచ్చు, సామాన్యులకు దగ్గరవడంలోనే నూరు శాతం సక్సెస్‌ అయిందని అర్థం. కృష్ణస్వామిరాజు రచించిన 'కిష్టడి కథలు' అందుకే సక్సెస్‌ అయ్యాయి. పది పదిహేనేళ్ళ పిల్లలు చదివినా అర్థం చేసుకోగలుగుతారు. కథనంలో సరళత, స్పష్టతతో, మాండలికలో రాసిన కథలివి. ఈ పుస్తకం రచయితకి తొమ్మిదో పుస్తకం. మనిషి జీవితం అనేక మానసిక ఒత్తిళ్ళు, సంఘర్షణలతో నిండిపోయింది. వీటి నుంచి బైటకు రావడానికి ఇలాంటి కథల అవసరం చాలా ఉంది.
ఇక కథల్లోకి వస్తే..
జీవితంలో బాల్యమే పెద్ద పీట వేసుకుని కూర్చుంటుంది. బాల్యం వరమే కాదు. జీవితమంతా తడిమి చూసుకునే నెమలీక పరిమళం. అలాంటి బాల్యంలో అదీ గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగిన బాల్యాన్ని తూచడానికి కొలమానాలేమీ ఉండవు. గ్రామంలో ప్రతి మనిషికి ఒకరితో ఇంకొకరికి సత్సంబంధాలు ఉంటాయి. చుట్టూ ఉన్న మనుషులతో పెనవేసుకుపోయే ఆత్మీయతలుంటాయి. చేసే పనిని బట్టి మనిషికో గుర్తింపు, పేరు ఉండేది. కిట్టయ్య మామయ్య కొట్టు, అప్పారావు బాబారు టీకొట్టు, రంగారావు మామయ్య పచారీ కొట్టు, హోటల్‌ మంగమ్మ పిన్ని, సారా కొట్టు సాంబయ్య. ఇలా పేర్లకు వరుసలు కూడా జత కలిసిపోయి ఉంటాయి. ఇలాంటి గ్రామీణ జీవితం నుంచి తను నడిచొచ్చిన, తనకు ఎదురైన, స్వయంగా తన అనుభవాలే ఈయన కథా వస్తువులు.
'శ్రద్ధాంజలి' కథలో నాలుగు వాక్యాలు ఇవి చదివితే మీకు కచ్చితంగా పుస్తకం చదవాలనిపిస్తుంది. ''రకరకాల పాలసీల గురించి గంట సేపు సినిమా చూపించినారు. ఎగబడి చూసినారు జనం. కార్యక్రమం ముగిసాక స్టేజీ ఎక్కిన బాలాజీ గాడు ఒకటికి రెండుసార్లు గొంతు సవరించుకుని 'ఆఫీసర్లకు మా ఊరి తరుపున శ్రద్ధాంజలి' అని గట్టిగా చెప్పినాడు. 'మళ్ళీ మళ్ళీ మా ఊరికి వచ్చి ఇలాంటి ప్రోగ్రాంలు చాలా చేసి, ప్రతిసారీ గ్రామ ప్రజల శ్రద్ధాంజలి అందుకోవాలి' అని గట్టిగట్టిగా అరిచి, చెప్పినాడు. శ్రద్ధాంజలి పదం విన్న కొందరు 'క్యార్‌' అని ముక్కు మీద వేలేసుకున్నారు'' అని ముగిస్తారు.
'లెక్కలేయలేను తల్లో' కథలో చిన్న సంఘటన చెబుతానిప్పుడు ఏడుపు ముఖం పెట్టిన కిష్టడు 'సాలక్కా బెండకాయలు తింటే లెక్కల్లో మార్కులొస్తాయో లేదో కానీ, నా కడుపు చెడిపోతా ఉంది. రోజూ బెండకాయ పులుసు, బెండకాయ సాంబారు, బెండకాయ తాళింపు ఇలా రకరకాలు బెండకాయ.కూరలు తినలేక చచ్చిపోతా ఉండాను, తినింది చాలని నువ్వన్నా చెప్పి పుణ్యం కట్టుకో అక్కా' అని అడిగినాడు.
'అమ్మ పిచ్చికాకపోతే నాకు లెక్కలొచ్చేదెప్పుడు, నేను టెంతు పాసయ్యేదెప్పుడు అమెరికా విమానం ఎక్కేదెప్పుడు' అనుకుంటూ రోగం తగిలిన కోడి మాదిరి చిన్నగా అమ్మ వెనకనే నడిచినాడు. 'అత్తారింటికి నీలవేణి' కథ ఎంత హాయిగా చదివించిందో! ప్రసాదంలోని జీడిపప్పు కొరికి తింటూ కిష్టడు 'అక్కా, అక్కా ఊర్లో అందరూ నిన్ను పేరు పెట్టి పిలవకుండా నాన్నారం నీలవేణి అని పిలస్తా ఉంటే నీకు కోపంగా లేదా' అని అడిగినాడు. 'పెళ్ళి అయినాక అమ్మగారింటి నుంచి అత్తగారింటికి వచ్చినాను. ఊర్లోవాళ్ళు నన్ను పిలిచే మారు పేరులో మా ఊరి పేరుంటే, మా ఊరి వీధుల్లో తిరుగాడుతున్నట్లుంటుంది. చెవులకు ఆనందంగా ఉంటుంది. ఒళ్ళు పులకరించిపోతుంది. అంతే తప్పితే నాకు ఎలాంటి బాధా ఉండదు' అని నవ్వుతూ సమాధానమిచ్చింది.
ఏ కథా మూడు పేజీలకు మించి లేదు. అంత తక్కువ నిడివిలోనూ తాను చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా చెబుతూ, పాఠకుడిని మొదటి నుంచి చివరి దాకా చదివించే శైలి ఈ కథలకు ఉంది. ఇలా ఉంటేనే పాఠకులు చదవటానికీ ఇష్టపడుతున్నారు. దీన్ని పట్టుకున్నారు రచయిత. మాండలికం, యాస, చదివించే శైలి, సందర్భానుసార సామెతలు, చమత్కారం, తక్కువ నిడివి, ఈయన కథల ప్రధాన లక్షణాలు. మనిషిలో ఉండవలసిన సహజ సిద్ధమైన లక్షణాలూ ఈ కథల్లో పుష్కలంగా ఉన్నాయి. ఈ లక్షణాలన్నీ కలిసి, ఈ కథలను ఒక స్థాయిలో నిలబెట్టాయి.
ఈ కథలు చదివిన వాళ్ళు ఎవరైనా సరే ఇంత గజిబిజి, గందర గోళం జీవితంలో నుంచి ఒక్కసారిగా తనని ఎవరో చంకలో ఎత్తుకుని చిన్ననాటి బడిలోనో, గుగ్గిళ్లు..పులిహోర కోసం గుడిలోనో, ఒద్ది వడ కోసం ఏ హోటల్‌ కాడనో, చెరువు గట్టు పక్కనున్న గోరింటాకు చెట్టుకాడనో, ఇంగ్లీష్‌ ట్యూషన్‌లోనో, టెన్త్‌ ఫోటో కోసం ప్రయాసపడిన సందర్భాల్లోకో, కిష్టడి లోపలికోసారి ప్రయాణం చేసి, మన లోలోపలికి కూడా తొంగి చూసుకునే ప్రయత్నం చేస్తాము.
అన్నింటినీ మించి చాలా కథల్లో అమ్మకు ప్రాధాన్యత నివ్వడం రచయితకున్న జెండర్‌ సెన్సివిటీని పట్టి చూపుతుంది. ఇంత అవలీలగా కథలు రాసే కృష్ణస్వామి రాజు సామాజిక మార్పుకు అవసరమైన కథలు కూడా రాస్తే బాగుంటుందని చిన్న సలహా మాత్రమే. ఆలస్యమెందుకు మరి మీరూ పుస్తకం కొని చదవండి.

- వైష్ణవిశ్రీ
80742 10263